Monday, December 31, 2012

లక్ష్యం...



అనుష్కనే  లక్ష్యంగా చూసుకొని 'లక్ష్యం' సినిమా చూసి వచ్చాక అలోచించా నా జీవిత లక్ష్యమేంటి అని...?. ఏమో ఏమీ అర్ధం కాలేదు. అలగే డ్యాన్సులను లక్ష్యంగా చేసుకొని ఒక స్తాయికి చేరుకున్న చిరంజీవి గారు  ఇంటర్వ్యూ లో తన జీవితంలో 'ఖైది' సినిమా ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్పినప్పుడు అప్పుడు ఆలోచించ నా జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటి అని...?. కానీ నాకు దీనికి సమాధానం దొరకలేదు. వింతగా ఉంది ఇంతవరకు నా దశను దిశను మార్చే 'లక్ష్యం' ఇంతవరకు లేదు అలాగే  అంతటి విజయం కూడా లేదు. ఇప్పటికైనా నా జీవితంలో నేను ఎటువంటి లక్ష్యాలతో ముందుకు సాగాలని  సారమే ఈ బ్లాగ్. అయితే ముందుగా నా గతించిన జీవితం వెనిక్కి చుస్తే...

నేను పదవ తరగతి వరకు కూడా ఉన్నత మైన లక్ష్యాలు లేకపోయినా, సాధారణ పరీక్షలయిన పోటి పరీక్షలయిన ఒక ప్రణాళికతో చదివే వాడిని. అందుకే నేను పదివ తరగతి వరకు మంచి ఆత్మ విశ్వాసంతో ఉండేవాడిని. కానీ నా వయసు పెరుగుతున్న కొద్ది చదువు తగ్గింది అలానే నాలోని ఆత్మ విశ్వాసం కూడా తగ్గింది. దీనికి కారణం నా అభిరుచులు మారడమే మరియు అలగే చదువు కన్నా ఇతర విషయాలమీద మక్కువ పెరగాడమని అనుకుంటున్నాను. దానీ వలన నాలోన నాకు తెలియకుండానే లేని పోనీ భయాలు కూడా పెరిగాయి. సరే ఇలాంటి భయాలు మధ్య నేను బి. టెక్ పూర్తి చయగానే, నాకు అనుకోకుండా ఉద్యోగం వచ్చింది.  
అప్పుడు కూడా నేను దేవుడు కరుణించాడని అలాగే అదృష్టం కొద్ది ఈ ఉద్యోగం నన్ను వరించింది అని అనుకున్నాను కానీ నేను ఎదో సాధించనని అనుభూతి కలగా లేదు. నాకు ఉద్యోగం వచ్చి నేను పదవ యేట అడుగుపెట్టిన తరువాత పని చేసేది కొద్ది పరాకు, అలాగే జీవించే కొద్ది చిరాకు వచ్చింది తప్పే ఎదో సాధించాన అనుభూతి మాత్రం కలగలేదు. అసలు.. " నేను నిజమైన కలలు కనలేదా...? లేక కలల్ని నిజం చేసుకొనే ప్రయత్నం చేయలేదా...? 

నా హృదయం ఒక కోర్టు అనుకొంటే, నా అంతరాత్మే న్యాయమూర్తి  అయితే, నా లక్ష్యం లాయరుగా వాదిస్తే నా శరీరం మొదట ముద్దాయి అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే నా శరీరానికి అలసత్వం అలవాటుగా చేసుకుంది.  అందుకే ఆలోచనలలో ఉన్న ఆవేశం ఆచరణలో లేదు. ప్రణాళిక రచనలో పక్కగా పద్ధతి అనుసరించే వాడిని, కానీ ఆ పని మొదలు పెట్టాక పక్క మీద పవళించి ప్రక్క తోవలో వెళ్ళిపోవడం నా జీవితంలో సహజం అయిపొయింది.ఏ మంచి అలవాటు కూడా ఈ అలసత్వంనే అలవాటును నెగ్గలేకపోయింది. ఇలా ఆలోచిస్తే నేను ఎక్కడో చదివిన మాట గుర్తుకు వస్తుంది. " వసంతం వెళ్లి గ్రీష్మం వచ్చింది, గ్రీష్మం వెళ్లి శిశిరం వచ్చింది. కానీ నేను పాడాలనుకున్న పాట మాత్రం ఇంకా అలాగే ఉంది పోయింది - నా రోజులన్నీ నా వాయిద్యాన్ని శృతి చేయటంలోనే అయిపోతున్నాయి. ఇలా నా కాలాన్నివృధా చేస్తు గడిపాను. దీనికి కారణం నేను గమ్యాన్ని ప్రేమించినంతగా ఆ గమ్యాన్ని చేరుకోవడానికి గల గమనాన్ని ప్రేమించలేదు అనడం సబబు అనిపిస్తుంది.  నేను ఇలా ఆలోచించ బట్టే ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉంది, అలానే ఏదో సాధించామన్న అనుభవం కానీ, అనుభూతి కానీ పొందలేకపోయాను. 


ఈ నూతన సంవత్సర సందర్భంగా ఒక నూతనంగా అలోచించి ఒక నూతన నిర్ణయం (లక్ష్యం)  తీసోకొందామని ఆలోచనతో ఈ బ్లాగ్ రాయడానికి ముఖ్య ఉద్దేశ్యం . సిమెంటు లేని గోడ సింద్ధాంతాలు లేని మనిషి ఎంతో కాలం నిలబడవు. ప్రతి మనిషికి కొన్ని సింద్ధాంతాలు ఉంటేనే జీవితంలో ఆటు పోటులలో తడబడక ముందుకు సాగాగలం. అందుకే నిర్దిష్టమైన సింద్ధాంతాలు (నియమాలు) కలిగి ఉంటూ.., నాలో నిరుపయోగం ఉన్న అలవాటులు  ఇంకా మంచి అలవాటులతో నన్ను నేను మార్చు కుంటూ ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకొన్నాను.  ఎందుకంటే ముల్లుని ముల్లుతోనే తీయాలి కాబట్టి  నాలోని అలసత్వం లాంటి అలవాటులను నన్ను నుతనపరిచే మరియు నన్ను ఉత్సాహపరిచే అలవాటులతో  మార్చుకొని ముందుకు వెళదామనుకున్నాను. చివిరిగా ఒక సామెతతో ముగిస్తా ..." ఒక ఆలోచన నాటు నాటు ఒక చర్యను పొందు, ఒక చర్యను నాటు ఒక అలవాటును పొందు, ఒక అలవాటును నాటు, ఒక పరివర్తన పొందు, ఒక పరివర్తన నాటు ఒక లక్ష్యాన్ని పొందు...". అందుకే ఈ నూతన సంవత్సరంలో నా లక్ష్యం "నన్ను నేను మార్చుకుంటూ, నన్ను నేను గెలుచుకొంటు, సంతోషంతో సంతృప్తిగా జీవించాలని  అనుకున్నాను. చివిరిగా ఈ నూతన సంవత్సరంలో  నా లక్ష్యం నన్ను నేనే ఓడించుకోవాలి అలాగే నన్ను నేనే గెలుచుకోవాలి
WISH YOU A HAPPY NEW YEAR....

Wednesday, November 14, 2012

ఎందుకీ ఈ ఆరాటం...


అన్నం లేక ఆకలితో అలమటిస్తున్నారు....
నీరు నీడ లేక నిరాశ్రయలవుతున్నారు....
పట్టా పట్టుకొని పొట్టకోసం పట్నం వెళ్లి 
ఫలించక రైలు పట్టాల మీద తల పెడుతున్నారు....
ఆ మాటకొస్తే...మనీకే మకుటం లాంటి మహారాజులున్నారు...
మెదడుకే మరుపెరగని జిజ్ఞానులున్నారు...
మంచిని, మానవత్వాలను మనుషులకు చాటిచెప్పిన వారున్నారు...
అయిన ఎందుకీ ఈ దారిద్ర్యం...ఎందుకీ దారుణ మరణాలు...
డబ్బుకోసం, శాంతి అన్న గాంధిజీ గుండెకే గాయం చేస్తున్నారు...
కులమతాలు లేవన్న అంబేద్కర్ ఆశయానికే ఆటంకం కలిగిస్తున్నారు...
మనవ సేవ మాదవ సేవ అని అన్న మదర్ తెరిసాకే మచ్చగా                                             నిలుస్తున్నారు...
అయినా...! డబ్బుకోసం ఎందుకీ ఈ మనిషికి ఆరాటం...?
ఎందుకీ తన మనసుతో  ఈ  పోరాటం....?

Thursday, November 1, 2012

నా క'సి రా'ల్చిన 'సిరా'....


ఖ'నిజం' లా దాగున్నది 'నిజం'..
క'నికరం' లో లేకున్నది 'నికరం'...
క'సాయం' తో కలిసిపోయింది 'సాయం'....
మమ'కారం' లో పెరిగిపోతున్నది 'కారం'...
అ'న్యాయం' నకు ఆహుతి అయినది 'న్యాయం'....
రాజకీయ సం'గ్రామం' తో సతమతమగుచున్నది 'గ్రామం'...
కలహాభో'జనం' తో బ్రతుకుచున్నది 'జనం'....
'జగ'డ'ము' తో జంతర్ మంతర్ అయినది 'జగము'....
'మని''షీ'...! మరువాలి 'మని' మరియు 'షీ' లేకపోతే 
ఓ మ'నిషా'..! నీ బ్రతుకులో పెరగక తప్పదు 'నిషా'...
వి'శ్రాంతి' తో మనసు పొందగలదా నిజమైన 'శాంతి' ?...
'యింత' యింత కొండనతైన చివరకు నీ వెనుక వచ్చిన'దెంత'...?
హృ'దయ'ము లో ఉదయంచాలి 'దయ'
స'హాయ'ము తోనే సంపాదించగలం నిజమైన 'హాయి'... 
వి'నయం' తోనే మనసు గల రోగన్ని 'నయం' చేయగలం...
వి'శ్వాస'మే మనిషికి మంచి 'శ్వాస' అయితే...
అప'జయం' పోక తప్పదు, రాక తప్పదు 'జయం'...
సం'సారం'లో యిదే సిసలైన 'సారం'...


Friday, October 19, 2012

పెళ్ళి ...


 నేను చిన్నతనంలో ఈ పాటను చాలా ఎక్కువగా వినేవాడిని " పెళ్ళంటే  పందిళ్ళు.. సందడులు,  తప్పిట్లు.. తాళాలు తలంబ్రాలు మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిపితే నూరేళ్ళు..." అందుకేనోమో నేను చిన్నతనంలో పెళ్ళంటే ఆ పాటలాగా పందిళ్ళు...సందడలు అనేకునేవాడిని. సరే మరి నాకు వయసొచ్చింది, అది నా మనసుకి తెలిసొచ్చింది అప్పుడు నా ఊహలకీ పెళ్ళంటే "పెళ్ళంటే ఒక పవిత్రత, పందిరిలో పదిమంది పెద్దల సమక్షంలో పట్టు వస్త్రాలతో, పసుపుతాడు ముడులేసి, పచ్చని కాపురానికి ఆహ్వానం పలికే సమయం.  పెళ్ళనేది జీవితంలో ఒక మధురఘట్టం, భార్యా భర్తలుగా  ముడి వేసిన  చట్టం, ఆలుమగలుగా అల్లుకుపోయే ఒక ఆనంద లోకం, ఆ ప్రపంచంలో పరులు కనిపించరు...పరులున్న ప్రపంచం వీళ్ళకి కనిపించదు". 
             నాకు మూడు పదుల వయసొచ్చింది, కానీ పెళ్లి కాలేదు. నా మిత్రులకి పెళ్లి చేసుకొని వారు వాళ్ళ జీవితాలలో ముందుకు సాగరు. వారిని పెళ్లి గురించి వాళ్ళ అభిప్రాయాన్ని అడిగినప్పుడు అందరు ఒకేలా చెప్పకపోయిన అందరు   ఒకే అర్ధం వచ్చేలా చెప్పారు. అది " పెళ్లి అనేది ఒక బస్సు ప్రయాణం లాంటిది. క్రిందున్న ప్రతివాడు బస్సు ఎక్కాలని ప్రయత్నం చేస్తాడు  అదే బస్సులో ఉన్నవాడు కిందకి దిగాలని ప్రయత్నం చేస్తాడు". ఈ మాటలు విన్నాక నాకు చాల విచిత్రం వేసింది. ఒక్క సారి నన్ను నేను వెనిక్కి చూసుకుంటే నేను చిన్నతనంలో పెళ్ళంటే ఒక వేడుక,  సంతోషించడానికి ఒక వేదిక, మొత్తానికి కుటుంబంలో జరిగే ఒక పండగ అనుకునేవాడిని. ఒక యుక్తవయసు వచ్చే సరికి పెళ్ళనేది ఇద్దరి మనసులకి సంబందించినది, కేవలం వాళ్ళది ఒక ప్రపంచం అది అతి అందమైన ప్రపంచం. ఆ ప్రపంచం ఎంతో అందంగా అలంకరించబడిన ప్రపంచం, అందుకే ఇది అంత్యంత సంతోష సమయం, కానీ ఎక్కువ కాలం నిలువదని తరువాత అర్ధం అయ్యింది. ఇక మూడు పదులు వయసొచ్చే సరికి  పెళ్ళంటే రెండు కుటుంబాల కలయిక,  అలాగే రెండు వేరు వేరు ఆలోచనల కలయిక. అందుకే ఒకర్ని ఒకరు అర్ధం చేసుకోవడానికి ఓపిక కావలి, అలాగే సర్దుకు పోవడానికి కొంత కాలం కావలి. కానీ అంతవరకు వేచి చూడని వాళ్ళకి విసుగు...దానివలన పెళ్లి ప్రయాణినికి విరామం ఇచ్చి మద్యలో దిగడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అనిపించింది. 
             ఇప్పటికీ నా మిత్రులు కొంతమంది ఇప్పటికి ఒక మాట చెబుతారు, అది ఏమిటంటే " ఇప్పుడు నీవు సంతోషంగా ఉంటె ఇక కొత్తగా పెళ్లి చేసుకొని కొత్త బాధలు కోరి తెచ్చుకోవడము ఎందుకు ?". అయిన నేను పెళ్లి వైపు అడుగులు వేయడానికి కారణం నాకు పెళ్లి మీద ఒక మంచి అభిప్రాయం ఉండటమే. అయితే నా మిత్రులను తప్పుపట్టాలని కాదు ఎవరి అనుభవాలను బట్టి ఆలోచనలు, వారి ఆలోచనలు బట్టి వారి అభిప్రాయాలు, సిద్ధాంతాలు ఉంటాయి. ఇది ఎవరికైనా నచ్చకపోతే ఇది సిద్ధాంత విభేదన తప్ప ఎవర్ని తప్పు పట్టాలని నా ఉద్దేశ్యం కాదు.

"ప్రాణం ఉన్నదేది ఏకాంతంగా జీవించదు, అలాగే తన కోసమే జీవించదు  - విలియం బ్లేక్"

         ఇలాంటి మాటలు కధలలో వ్రాసుకోవడానికి, సభలలో చెప్పుకోవద్దనికి బాగానే ఉంటాయి, కానీ నిజజీవితంలో ఆచరించడానికి కొంత కష్టమే. అయిన కూడా ఆ వాక్యం రాయడానికి కారణం అది నిత్య సత్యం. సృష్టిలో ఏ మనిషి కూడా  ఒంటరిగా బ్రతకలేడు. అందుకే పెళ్లి లోనే ఉంది అసలు సృష్టి రహస్యం. ఎందుకంటే మనల్నిఎంతో అపురూపంగా పెంచిన తల్లిదండ్రులను మనం వదిలి ఉండలేము. అయితే ఎప్పటికైనా విడిచి వెళ్ళాల్సిందే... పోయినవరితో మనం అంతరించిపోకుండా ప్రతివాడికి ఒక కుటుంబాన్ని దేవుడు సృష్టించాడు, అది పెళ్ళితోనే పూనది వేసాడు. మనిషి అసలు జీవితం పెళ్ళితోనే ప్రారంభం అవుతుందేమో అని అనిపిస్తుంది. పోనీ పెళ్లి చేసుకున్న వచ్చిన వారు మనల్ని సంతోషంగా పెట్టాలి, అలాగే వారుకూడా సంతోషంగా ఉండాలి. అలా సంతోషంగా ఉండాలి అంటే ఒకే ఒక మార్గం నచ్చకపోతే సర్దుకుపోవాలి, తప్పు అయితే సరిదిద్దుకు పోవాలి. ఇరువురి మధ్యన జరిగే ప్రతి గొడవ ఒక గుణపాటమే, ఎదురైనా ప్రతి సమస్య ఇరువురి గెలుపుకి ఒక అవకాశమే. అయిన వేరు వేరు కుటుంబాలలో పెరిగిన వారు, వేరు వేరు ప్రదేశాలలో పెరిగిన వారు, వేరు వేరు పరిస్తితులలో పెరిగిన వారు ఒకే రకమైన భావాలను కానీ, అలవాట్లును కానీ, ఆచారాలను కలిగి ఉండరు. ఎందుకంటే 
                 " కడలి ఒక్కటే....కానీ కెరటాలు అనంతం...
                    తూర్పు ఒక్కటే... కానీ కిరణాలు అనంతం...
                    మనసు ఒక్కటే... కానీ భావాలు అనంతం..."
             
                మనసులు వేరు, అలాగే వారి ఆలోచనలు వేరు, దాని వలన వారి భావాలు వేరువేరుగా ఉండవచ్చు. అయినంత మాత్రాన ఎవరు తప్పుకాదు. కాబట్టి మొదట మాటలు వేరుగా ఉండవచ్చు కానీ ఒకే బాటలో వెళ్ళితే జీవితానికి చేటు రాదు. అలవాట్లు వేరుగా ఉండవచ్చు, కానీ మన జీవిన విధానానికి కొత్త రూట్లుగా భావిస్తే ఇక అగచాట్లు ఉండవు. మనుషులగా ఒక ఇంట్లో ఒక కాపురం చేసిన, మనసులు మాత్రం ఒక ఒంట్లో కాపురం చేస్తే ఆ కాపురంలో ఓటమే ఉండదు. చివిరిగా ఒక్క మాట పెళ్ళంటే సఖ్యత, పవిత్రత, ఒక బాధ్యతని అనుకుంటే జీవితమంతా ఇక ఆనందమే..

Tuesday, October 16, 2012

మంచి...



మంచి అన్నది పంచు మన్న....
చెడు కంచె  అన్నది తుంచు మన్న...
మంచి కుంచెని రంగదీసి...
మనిషి మదిలో మంచి ముగ్గని గీసి...
మంచి లంచం మూటగట్టు...
బ్రతుకు కంచమగును ఒక భాగ్యచెట్టు..
మంచి మల్లెల మాల కట్టు...
పేద బాధల సంకెళ్ళ చెదరగొట్టు...
ఈ 'నా మంచి' మీ మనసులలో వికసించి 
మంచికి మించినది లేదని ప్రపంచానికి 
చాటించి, మంచిని పాటించి, అంచెలంచెలుగా
పురోగమించి, నీలో మంచిని కరగని 
మంచువలె పెంచి తరించండి.





Thursday, October 11, 2012

న్యాయమా...నీవెక్కడ ....?


నింగి నేలలను అడిగా న్యాయమా నీవెక్కడని ...
నవ్వుతుచెప్పాయి... అలాంటి నామమే వినలేదట...
కొండ కోనలకు కబురుపంపి అడిగా...
కలహాలతో కుళ్లిపోయి కంటికి కానరాలేదట...
వాగువంకలతో వంతపాడి అడిగా...
వాన వరదలొచ్చి ఉండలేక వలసపోయిందట...
ఊరుకొని ఉండలేక ఊరూరు వెళ్లి అడిగా...
ఉతలేక ఊబి ఉచ్చులోకి చిక్కికొని పోయిందట...
మనసాగక మనిషి మనిషిని అడిగా...
మంచిమిత్రుడు లేక, తనని కించపరచుకొనలేక మూగపోయిందట..
నాలుగు గోడల మధ్యనున్న న్యాయాన్ని 
నాలుగు దిక్కుల మధ్యన నాటేవారెవరు...?
నీతి నీరు పోసి నేలతల్లి ఒడిలో నిలబెట్టేవారెవరు...?


Monday, October 1, 2012

నా మధనం...


ఓ మనుషులారా...
మానవత్వం లేని మృగాల్లారా ....
మనీ మత్తులో మునిగి తేలుతూ...
మాదీ మాదీ అని మాన్యంను మీ ముని మనవలు వరకు కూడబెట్టి,
మిగుల రోక్కంతో మైసభాలాంటి మేడను కట్టి, 
మాటిమాటికి మందు ముక్కలతో ముచ్చటించి,
మాకు ఎదురు లేదని మీసాలు మెలేసే మగ మహారాజుల్లారా...
మనసులోని మలినలాను మరిచి, మీ ముంగిట 
మధన ముళ్ళతో, మాసిన బ్రతుకులతో నున్న 
మంచి మనసులో మండే మంటలను చుడండి....
మేను పైన ముతక గుడ్డ ముక్క లేక, మొదలు వారి ముద్దు ముచ్చటను   నోచుకోక 
ముష్టి అయిన ముప్పావలా మించక, పొట్ట ఉట్టిని మట్టితో నింపుతున్న
మా మూడేళ్ళ మిత్రులను చుడండి...
మురికి వాడల మార్గాలలో మసలుతూ.. ముక్కి ముక్కిన మెతుకులను 
మూటకట్టుకొని, మింగ లేక మింగుతున్న మా మూడు కాళ్ళ ముదుసలిని చుడండి...
మనీ, మాగాణిలు మనషికి మాయ మకుటం...
మానవత్వ, మమకారాలు మంచి మనసుకి మణి మకుటం...
నా మాటల మసాజ్ మీ మదికివ్వాలి మేలుకొలుపు....
మరి మురికి వాడల, ముష్టి బ్రతుకలలో మెరవాలి మమతల మెరుపు....

Thursday, September 27, 2012

నీ స్నేహం....


గుంపుగా ఉండే ఆకాశ పక్షులలో ఉండేది ఏ స్నేహం...
కలిమి లేమిలను కలగొలిపివున్న కృష్ణ కుచేలలు మధ్య ఉండేది ఏ స్నేహం...
నీరు లేక నిమిషం గూడా నిలువలేని నీరు చేపల  మధ్య నిలేచేది  ఏ స్నేహం...
కలకాలము కాపాడే కంటి పాపని కంటికి కలిపింది ఏ స్నేహం...

గాయానికి మాన్పు మందుకి మధ్యనుండేది ఏ స్నేహం...
ఏ స్నేహం,  ఏ స్నేహం...అని ఆలోచిస్తే ఎదుట నిలిచింది ఈ స్నేహం..
సమస్యలను సంస్కారంతో సాధించేది స్నేహం...

సమరాన్ని కూడా సద్దుగమనించి సంతోషాన్ని నింపేది స్నేహం..
చింత్లలో చేయూత నిచ్చింది స్నేహం...
అట పాటలతో అందర్నీ ఆహ్లాదపరిచేది స్నేహం...
కన్నీటి కడలిలో వున్నా కాలి తడవకుండా ఒడ్డుకు చేర్చేది స్నేహం...

Saturday, September 22, 2012

కరువు....


నీటి బొట్టు రాల్చాల్సిన నీలి నింగి నిదురపోతున్నది ....
నారు నాటాల్సిన నేల గొంతు నీరు లేక  నిస్సారమవుతున్నది....
ఉరుములు ఉరమాల్సిన చోట ఉదయభానుడి ఉనికి 
                                                  ప్రజ్వరిల్లుతున్నది...
పచ్చని పైరు పండాల్సిన చోట పదును లేక  పాడి పంట
                                                 పతనమగుచున్నది...
నాగలి పట్టి నడిచే  నాయకుడి నట్టింట నరకయాతన....
కౌలు, కూలి చేసి కళేబరాన్ని కాపాడుకుంటున్న కర్షకుని కంట     
                                                కన్నీరు...
అందుకేనేమో! పామరుడు పల్లె వదిలి పట్టణం వైపు పరుగు 
                                               ప్రయాణం...
ప్రాణం వదిలి పైకి పోయి..జీవితానికిచ్చెను విసుగు విరామం...
ఓ నింగీ! వ్యంగ్యాన్ని వదిలి, ఒక్కసారి వంగి పుడమిని తొంగి చూడు...
పతన పుడమి పతాంగికి నీ చినుకు కొంగుతో లంగరు వేసి...
పుడమి అంగాంగాలను పచ్చని పైరు తోరణములతో సింగారించి...
నరుని హృదయంలో కంగారు తగ్గించి.. నీ ఉప్పెనతో...
ఊపిరినీ నింపు...ఉత్సాహాన్నినింపు....

Friday, September 21, 2012

నువ్వే .... నువ్వే....


కనుల కొలనులో కళ కళలాడే కలువవు నువ్వే....
మది మందిరంలో మధనం మరిపించి మకరందమును కురిపించగల మహారాణి నువ్వే....
గుండెల గుడిలో నా గుప్పెడు మనసుతో నిత్యారాధన  అందుకుంటున్న గుణవతివి నువ్వే....
నా పాటలలో పరవశం నువ్వే....
నా పాదాలకు గమ్యం నువ్వే....
నా నోటి మాటలకు మకుటం నువ్వే....
నా నాలుక మీద నిత్యం నాట్యం చేసే నాట్య మయూరివి  నువ్వే.... నువ్వే....నువ్వే....

Thursday, September 20, 2012

కరుణ.....


అరుణ కిరణాలలో లేదు కరుణ...
దప్పిక గొన్న ధరణిని చూసి దేవునికీ కలగలేదు కరుణ...
మాతరణాలతో మరణాలు పెరిగినా మనిషి మదిలో మెదలలేదు కరుణ...
నింగి నీడలో ఉండలేక, కడుపు నిండా తిండి లేక, కొండంత గండాలలో 
అండలేని బ్రతుకు బండిని చూసి ఏ ఫ్రెండికి కలగలేదు కరుణ...
 వసతి లేక వితంతువులు విల విలలు చూసి ఏ వీర నారీ లోను 
                                వికసించలేదు కరుణ....
 ఆకలితో అలమటిస్తున్నఅనాధులు...అపురూపంగా పెంచిన అబ్బాయి నుండి ఆదరణ లేని అమ్మానాన్నలు...ఇలా అందరు ఆదమరిచిన పదం కరుణ......
ఈ దారుణాలను చూసి కావాల్సింది కన్నీళ్ళు కాదు...రాయాల్సింది  కరుడగట్టిన హృదయలను కరిగించే కవితలు కాదు....
కావాల్సింది కల్మషం లేని ప్రేమ....ఉదయాంచిల్సింది ఉప్పెన లాంటి దయ....
కరుణ చూపాల్సిన తరుణమిది.... 
శరణు అనే మనుషలకు కరుణ ఆభరణంతో కలతలను కదిలించాల్సిన తరుణమిది....

Wednesday, September 19, 2012

నా అభి"మతం".....


నేడు మతమత్తులో మనిషి మనుగడ....
కులజాడ్యంపై కుతూహలం....
కుళ్ళు రాజకీయాల స్వార్ధంతో కుమ్ములాటలు యిలా 
మత మంటల్లో ఇంకెన్నాళ్ళు జీవన్మరణ పోరాటం....
ఎందుకీ సగటు మనిషికి ప్రాణసంకటం....
ఎప్పుడొస్తుంది సర్వ సమాన మత సమాజం...
ఇంకెన్నాళ్ళు కావాలి కులరహిత సంఘంలో సంబరానికి...
ఆగండి... ఆలోచించండి.....అభ్యర్దననుకోండి....
మతమంటూ మరవాలి మనిషన్నవాడు....
మమతంతా పంచాలి మనసున్నవాడు....
కలతంతా తీర్చాలి కలిగున్ననాడు...
విడమరచి చెప్పాలి విద్య ఉన్నవాడు....
కులకలహాలను... కలిమిలేమిలను...కుఠిల రాజకీయాలను..
కబళించి కసిరసిని కరుణతో కడిగి ఈ కలియుగంలో 
కలతలు లేని కరుణ యుగంలా కలకాలం 
కన్నలపండుగగా కలిసిపోవాలి.....

Tuesday, September 18, 2012

నేనొక కవితను....

                                       నేనొక కవితను....                                      
తొలకరి మాసంలో వచ్చే చిరుజల్లును....
ఆకాశంలో కనిపించే చక్కని హరివిల్లును....
వసంతంలో కూసే కోకిల మృదు మధురగానంను....
ప్రకృతి పులకరింపుకి పలికే పద్యాన్ని...
మనసులో ఉండే మమతను....
అమ్మలో ఉండే అనురాగాతను....
స్నేహంలో ఉండే సఖ్యతను...
ప్రేమలో ఉండే పరవశంను...
సత్యాన్ని అన్వేషించే శ్రమశక్తిని...
మతోన్మాదాన్ని మంట కలిపే మంచి మల్లెను...
దరిద్రుల దప్పిక తీర్చే ధనిక సంద్రాన్ని ....
భావ ఆవేశాలతో భారతావనికి 
చూపించగల భవితను...కవితను....
నేనొక కవితను.....

Saturday, August 4, 2012

స్నేహం కోసం....

నా అభిప్రాయాలతో ఆకారాలను గీసి, నేను సంతోషంగా ఉన్నప్పుడు నా కళ్ళల్లో మెరిసే పెరుపులతో మెరిగులు దిద్ది  నా పదాలతో ప్రాణాలు పోస్తే...ఖచ్చితంగా పుట్టిన వారు నా మిత్రులలో ఎవరో ఒకరి పోలికలను కలిగి ఉంటాడని అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే "Don't follow any one but learn from every one" అన్నట్టుగా నేను తెలుసుకున్న మంచి విషయాలు లేదా నా లోవున్న మంచి గుణాలు అయిన నా మిత్రుల దగ్గర నుండి ఎక్కువుగా నేర్చుకున్నాను. అందుకేనేమో ఒక మనిషి గురించి తెలిసి కోవాలి అంటే ముందు వాడి మిత్రులగురుంచి తెలుసుకోమంటారు. ఇలా నా జీవితంలో అనేక విషయాలను నేర్పిన ప్రతి మిత్రుడకు, నాకు స్పూర్తిగా నిలిచినా ప్రతి స్నేహితుడకు అంకితమిస్తూ... స్నేహితుల దినోత్సవం సందర్భంగా  రాస్తున్న బ్లాగ్....అయితే నా  స్నేహితులతో ఉన్న అనుభవాన్ని ఈ చిన్న బ్లాగ్ లో రాయడం కష్టం అయిన సముద్రాన్ని మర చెంబులో ఇమిడ్చినట్టు నా అనుభవాన్ని ఈ బ్లాగ్ లో ఇమిడ్చి రాస్తున్న....

నేను చిన్నప్పటి నుండి హాస్టల్ లో చదువుకోవడం వలన నేను ఎక్కువుగా స్నేహితులతో కలిసి ఉండే అవకాసం లభించింది. చిన్నతనంలో తిండికైన, తిరగాడనికైన, చదువుకైన లేదా సాహసానికైనా, ఆటకైన...పాటకైన ఇలా అల్లరిగా చిల్లరిగా చెట్టపట్టాలు వేసుకొని... జట్టు కట్టుకొని సరదాగా గడిపిన రోజులు ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. కానీ ఎంత అల్లరి చిల్లరిగా తిరిగిన ఒకరికోసం ఒకరికి పని చేయడంలో సహాయం చేయడాన్ని, వేచిచూడటం లో ఓర్పుని, చదువులో కొంత నేర్పుని ఇలా మాకు తెలియకుండానే నేర్చుకునన్నాను. నా చిన్నతనంలో నాకు మంచి మిత్రులు ఉండటం వలన, అలాగే వాళ్ళు నా మదిలో మొదట వేసిన స్నేహమనే "విత్తు" నేటికి వృక్షమై..... నా జీవితంలో వినోదభరితం కావడానికి మూలం అయ్యింది. 


ఇక యవ్వనంలోకి వస్తే...ఇవి నా జీవితంలో ఎంతో మధురమైన క్షణాలు ఉన్నాయో అంతే మధనపడ్డ క్షణాలు ఉన్నాయి. ఏదైనా కాలేజి రోజులలో ...అడుగేస్తే నవ్వు.. విజలేస్తే కెవ్వు...అనుకోకుండా ఎదురైనా అమ్మాయిల నవ్వులు...దాని వలన పుట్టిన లవ్వులు...  లవ్వులు గెలవడానికి ఇచ్చిన పువ్వులు... ప్రేమ గెలిస్తే పార్టీలు...ఓడితే వాళ్ళమీద కార్టూన్లు ఇలా ఆద్యంతం ఆనందమే.  ఇక నా విషయానికి వస్తే కాసింత అమాయకత్వం, ఏమి చేయాలో తెలియని అయోమయం, ఎదుట నిలిచే ఆకర్షణలు, దాని వెనుకనున్న అలజడలు, ఏదో అందుకోవాలని ఆలోచన, అడ్డుగా నిలిచినా అవరోధాలు, సన్నగిల్లిన ఆత్మ స్థైర్యం, సర్దుకోలేని ఆర్ధిక ఇబ్బందులు... ఇలా ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా నేను ఓటమి కోరలలో చిక్కుకోలేదు ఎందుకంటే నా మిత్రుల దగ్గరనుండి పొందిన ఆదరణ, వారిచ్చిన ఆత్మ స్థైర్యం, ఆపదలో వెంట నిలిచిన ఆప్తమిత్రులు, వారు చూపిన సన్మార్గం  నన్ను నా జీవితంలో ముందుకు సాగనిచ్చాయి. నా మిత్రులు చేసినది ఒక్క మాటలో చెప్పాలంటే " నేను ఏ పని తలపెట్టిన నా ముందు వెనుక లోటు కనిపించేది, కానీ నా జీవితంలో ఎప్పుడూ...  ఎక్కడా...  లోటు జరగలేదు" అని నేను సంతోషంగా చెప్పగలను.


చివిరిగా నా మిత్రుల గురించి ఒక్క మాట చెప్పాలి. ఇప్పటకి మా అమ్మ నేను కొంత మంది స్నేహితులను కలవడానికి వెళ్తానంటే ఎంతో సంతోషంగా పంపుతుంది. ఎందుకంటే మా అమ్మ నన్ను ఎంత అపురూపంగా, అప్యాయతగా  చూసుకుంటుందో అంత కన్నా నా మిత్ర్హులు బాగా చూసుకుంటారని ఆమె నమ్మకం. పైన నేను చెప్పినట్లు తోబుట్టువులు దగ్గర నుండి పొందని తోడునీడను... , అన్నదమ్మల దగ్గరనుండి పొందని ఆదరణను, నాన్న దగ్గర దొరకని స్వేచ్చను, మా అమ్మ దగ్గర లేని అనురాగాన్ని పొంది ఇలా నా మిత్రుల వలన నేను నా జీవితంలో సమస్యలున్న  సంతోషంగాను, బాధలున్న నిర్భాయంగాను, కలతలున్న కంగారుపడకుండా  నిశ్చంతాగాను నిలకడగా ముందుకు సాగుతున్నాను. అందుకే నా మిత్రుల విషయంలో ఒక బలమైన నిర్ణయం తీసుకోనాను. అది " నాకు నా మిత్రులతో ఏదైనా సమస్య వస్తే, ఆ సమస్యను సరిదిద్దు కోలేనప్పుడు సమస్యనే విడిచిపెడతాను కానీ ఎట్టి పరిస్థితులలోను ఆ మిత్రుడను విడిచి పెట్టను, ఒక వేళ  ఏ మిత్రుడనైన విడిచిపెట్టినట్టయితే  ఇరువరిలో ఎవరో ఒకరు ఈ లోకాన్ని విడిచినట్టే.. ...."

రోజులు గడుస్తున్న నేను నా జీవితంలో సంతోషంగా ఉండటానికి కారణం...మా అందరి హృదయాలు స్నేహమనే సున్నితమైన దారంతో ఎంతో అపురూపంగా కలసిపోయాయి. అందుకే స్నేహమనే దారమే నా జీవితానికి ఆధారం అది లేక పోతే నిరాదరం. ఇలా చెప్పుకుంటే పోతే ఎంతయినా రాయగలం. అయిన అమితమైన ప్రేమున్న మిత్రుల కొరకు మితంగా రాయడం నా వల్ల కాదు గాని, ఇక పైన జీవితంలో కూడా స్నేహాన్ని ఆస్వాదిస్తూ... ఆనందిస్తూ...దానిని నిలబెట్టు కోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ....ఉంటానని సంతోషంగా తెలియచేస్తూ...  స్నేహితులకు మరి స్నేహ ప్రపంచానికి స్నేహితుల దినోత్సవం సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియయచేస్తూ.....
                    " Friendship isn't how to forget but how to forgive
                      Not how you listen, but how you understand
                      Not how you see, but how you feel
                      Not how you let go, but how you hold on! "
                     HAPPY FRIENDSHIP DAY.... 

Thursday, July 5, 2012

సెల్లు ....సొల్లు...

నాకు మొదటి నుండి ఫోన్ అన్నా ఫోనులో మాటాడటం అన్నా మహా సరదా అయితే ఆ కోరిక నాకు ఉద్యోగం వచ్చిన తరువాత తీరింది. కొత్తగా ఉద్యోగం... కొత్త ప్రదేశం... కొత్తవాళ్ల మధ్యలో ఉండడం వలన రోజు సాయింత్రం అయితే చాలు ఇక సెల్ పట్టుకొని కాలక్షేపం కోసమో... మరి కమ్యునికేషన్ కోసమో...తెలియదు కానీ నేను కాస్తా  సెల్ లో ఎక్కువగా మాటాడేవాడిని. చివరికి కస్టమర్ కేర్ నుండి కాల్ వచ్చిన దానిని మిస్సిడ్ కాల్ చూడటమే కానీ ఏనాడూ నేను మాటాడిన పాపాన పోలేదు. ఇది చూసి నా మిత్రులు ఎప్పుడైనా కలిసేటప్పుడు ఈ రోజు "సెల్లు - సొల్లు" ప్రోగ్రాములో ఎంత మందిని టచ్ చేసారు అందులో వింతలూ విశేషాలు మాకు ఒకసారి వివరించండి అని సరదాగా అడిగేవారు...అందుకేనేమో ఈ "సెల్లు-సొల్లు" బ్లాగ్  రాయడానికి కారణం. కానీ కాలం గడుస్తున్నకొద్ది నాకు అనిపించేది నా చుట్టూ జరిగే సంఘటనల  వలన  కావచ్చు నేను సెల్లో మాటాడేటప్పుడు నన్ను జనాలు చూసే విధానమో వలనో కాస్త  నేను కూడా ఈ  సెల్లో మాటలాడటం తగ్గించాను, అయిన ఇంతవరకు దీనిపై నాకున్న  అనుభవాన్ని ఈ  బ్లాగ్ లో పొందిపరచాను.

ముందుగా  సెల్ గురించి చెప్పాలంటే ..... గల్లిలో ఉన్న గడుగ్గాయి చేతిలో చుసిన సెల్లే.... డిల్లీ లో ఉన్న డీసెంట్  బాయ్ చేతిలో చుసిన  సెల్లే... . అత్యాధునిక నగరాలలో తిరిగే అమ్మాయి చేతులలో ఉండేది  సెల్లే......కనీస సదుపాయాలు లేని అరణ్యలలో నివసిస్తున్న ఆడపడుచు చేతిలో ఉండేది  సెల్లే... ...ఆవేశంలో ఎక్కువగా పగలకేట్టేది  సెల్లే... ఆనందం కోసం అందరు ఉపయోగించేది  సెల్లే... సెల్ అనేది ఒకప్పుడు మనిషికి సోకు కానీ నేటి మనిషికి సెల్ అనేది నిత్యావసర సరుకు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే నేడు భారత దేశంలో జనాభా 107 కోట్లు అయితే అందులో సెల్ ఉపయోగించిన వారి సంఖ్య సుమారు 82 కోట్లు అని ఒక టి.వి ప్రోగ్రాంలో చూసాను.  సెల్ వచ్చాక ఎంత దూరంలో ఉన్నావారితో మాట్లాడం చాలా సులభం కావడంతో " ప్రపంచం చాలా చిన్నది అయ్యింది కానీ సెల్ వలన రోజు రోజుకి మనుషుల మధ్య మాత్రం దూరం పెరిగింది"

అసలు సెల్ తెలియక ముందు ఉత్తరాలను ఉపయోగించేవారు. ఉత్తరం అంటే నేను సంఘటన గురించి చెప్పాలి... నేను పదవ తరగతి వరకు గురుకుల పాఠశాలలో చదువుకున్నాను. నేను ఇంటర్ చదువు తున్నప్పుడు పదవ తరగతి మిత్రుడు నాకు ఒక ఉత్తరం రాసాడు. ఆ ఉత్తరం ఒక సరి సారి చదివాక... చదివి ఒకసారి ఆలోచించక... అలోచించి నా గతాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నాక...మా ఆరేళ్ళ స్నేహం  గురించి ఒక అరటావు ఉత్తరంలో చదివాకా నాకు కలిగిన అనుభూతిని మాటలలో మాత్రం చెప్పలేను. ఎప్పుడైనా వాడి మీద కోపం వచ్చినప్పుడు ఆ  ఆ ఉత్తరం చదివితే చాలు ఆ కోపం అర నిమిషంలో పోయేది అలా ఆ ఉత్తరం మా స్నేహం మరింత బలపడటానికి దోహదం చేసింది. మరి సెల్ వచ్చకా ఉత్తరం ఉనికిని కోల్పోయింది కానీ సెల్ అనేది  మనుషల సంతోష సాధనం అయ్యింది కానీ మనిషి జీవితంలో  మధురానుభూతులను మాత్రం నింపలేదు. మరి సెల్ ని మాత్రం ఒకర్ని బాధపెట్టడానికి, భయపెట్టడానికి, బ్లాకు మెయిల్ చేయడానికి ఇలా ఎన్నో అసాంఘిక చర్యలను చేయడానికి సెల్ ఒక గొప్ప సాధనం అయ్యింది కానీ మనషి సంతోషానికి, సమస్యల పరిష్కారానికి, ఉపయోగించడం తక్కువే అని చెప్పాలి. అందుకే నేను కోరుకునేది ఒక్కటే " సెల్ ని వాడండి అవసరాలకే కానీ అనర్ధాల కోసం కాదు... సెల్ ని వాడండి బంధాలు బలపడడానికి  కానీ బాధ పెట్టడానికి కాదు .. సెల్ ని వాడండి అపాయంలో ఉన్నప్పుడు అత్యవసర  సేవలకోసమే కానీ అపాయాలను కలిగించడం కోసం కాదు... "


ఇక సొల్లు గురించి చెప్పాలంటే....భారత దేశంలో వాక్కు స్వాతంత్ర్యం ను ఉపయోగించుకోనేది ఆది నుండి ఆంధ్రులని   చెప్పనవసరం లేదు అలాగే మా మిత్రబృందంలో అయితే నేను మొదటి వాడినే అని చెప్పాలి. ప్రతి మనిషికి తను చెప్పే మాటలు ప్రక్క వాళ్ళు వినాలని, విని వినోదం పొందాలని కోరుకుంటారు. నేను కూడా అలాగే మాట మాటకి పొంతన లేకపోయాన...ఓటమికి వాటం ఇవ్వకుండా పోటిగా మాటడుతుంటాను. దీనివలన ప్రక్కవాల్లికి  వినోదం మాట పక్కన పెడితే విసుగు మాత్రం వస్తుంది. అలాంటిది సెల్ వచ్చాక జేబులు నిల్  అయిన తోటివారు బోర్  ఫీల్ అయిన  ఇంట్లో వాళ్ళు చిరాకు పడిన మాటలకూ మాత్రం దూకుడు తగ్గడం లేదు. చివరికి ఆ మాటలు తగ్గాలంటే నాలుకకు ముల్లు అయిన  గుచ్చాలి లేదా పక్కవడి చెవులకు చిల్లు అయిన పడాలి. నా అనుభవంతో, కానీ నేటి యువతరాన్ని చూసాక  నాకు అనిపించేది ఒకటి " వాగుడు అనేది తాగుడు కన్నా చెడ్డ అలవాటు తాగడం వలన తాగిన వాడికి పిచ్చి వస్తుందేమో కానీ వాగుడు వలన చుట్టూ ఉన్నవాళ్ళకి మాత్రం పిచ్చి వస్తుంది." అలా అని మాట్లాడటం వద్దు అని చెప్పే హక్కు నాకు లేదు కానీ మితంగా మాటాడటం ముద్దు... ఆకర్షించే విధంగా మాటాడటం హద్దు.. కానీ చిరాకు తెప్పించేల మాటాడటం మాత్రం వద్దు. మనం చేసే పనులు మన అదుపులో ఉండాలి అలాగే మనం మాటాడే మాటలు పొదుపుగా ఉండాలి. అందుకే  నేను చివరిగా కోరుకునేది ఒక్కటే మన మాటాడితే......
               నీ మాటతో....ఇటు నిశ్శబ్దం అయిన పోవాలి ...అటు ఓ యుద్ధం అయిన ఆగాలి.
               నీ మాటతో.... ఇటు  సమస్య  అయిన పోవాలి ... అటు సహాయం అయిన పొందాలి  
               నీ మాటతో.... ఇటు  ఆకలి అయిన తీరాలి...  అటు ప్రాణం అయిన పోయాలి.
               నీ మాటతో.... ఇటు  ఆనందం అయిన కలగాలి ....అటు అవమానం అయిన పోవాలి 

Wednesday, May 9, 2012

ఇంకా ఎంత  కాలం.....

ఏదైనా మంచి పని చేయాల్సిన  సమయం వచ్చినప్పుడు నేను దానిని ఎందుకో ఆ  పని చేయకుండా కాలయాపన  చేస్తుంటాను. అప్పుడు  నేను అనుకుంటాను ఇంకా ఎంతకాలం ఇలా కాలయాపన  చేస్తాం. ఉదాహరణకి  నేను నా కళ్ళు దానం చేద్దామని అనుకున్న  అయితే ఇప్పటికి నేను ఆ  పని చేయలేకపోయాను, దీని  గురించి నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు కొంత మంది ఇలాంటి పనులు ఇప్పటినుండే ఎందుకు ఇలాంటివి చేయడానికి ఇంకా  సమయం ఉంది, అందుకే ముందు జీవితాన్ని సంతోషంగా గడపమంటారు. ఏది ఏమైనప్పటకి  ఒక మనిషి ఒక మంచి  పని చేయడానికి  లేదా చేయకపోవడానికి తన  జీవితంలో ఎదురైనా సంఘటనలను బట్టి ఉంటుంది కానీ  పక్కవాడు చెప్పిన  దానిని బట్టి ఉండవు.  ప్రతి మనిషి జీవతంలో ఎదురైనా  కొన్ని సంఘటనలు తనని నిలబెట్టి  ప్రశ్నిస్తాయి,  ఆ సంఘటనలే మనిషిని ప్రభావితం చేస్తాయి, చివరికి  ఆ సంఘటనలే మనిషిలో మార్పుకి నాంది  పలుకుతాయి. అయితే నేను మంచి పనులు చేయాలని అనుకోవడాని నన్ను ప్రభావితం చేసిన  సంఘటనలు  మూడు ఉన్నాయి. 

నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక  సంఘటన  ఇది నేను చదివినదో లేదా ఎవరో చెప్పినదో నాకు గుర్తు లేదు కానీ ఈ  సంఘటన  నన్ను బాగా ఆలోచింపచేసింది. ఒకాయన  నయాగరా జలపాతం నుండి కిందకు ( గుండ్రని టబ్  లోనుండి ) ఒక  రికర్డ్  శృష్టించి, ఒక  రోజు తన  ఇంటి తోటలో కాలు జారి పడిపోవడంతో తన  కాలు విరిగి అనారోగ్యము పాలై చివరికి తన  ప్రాణాలనే విడవ  వలసి వచ్చిందట. రెండవ  సంఘటన  స్వశక్తితో ఆర్దికంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన  సత్యం " రామలింగ  రాజు" గారు ఒకేసారిగా తను  శృష్టించిన  ఆర్ధిక  సామ్రాజ్యం  పేక  మేడల  కూలిపోవడముతో ఇప్పుడు ఎంతో దుర్భరమైన  జీవితాన్ని చూడవలసి వచ్చింది. మూడవదిగా  నేను టెలివిజన్ లో హీరోస్ ప్రాజెక్ట్ ( AIDS Awareness) ఒక  ప్రోగ్రాముని  చూసాను. ఆ  ప్రోగ్రాములో చెన్నై నుండి ఒక  డాక్టర్  తన  దగ్గరికి వచ్చిన  ఒక  రోగి గురించి ఇలా చెప్పారు.

హైదరాబాద్  నుండి తన చెల్లితో వచ్చిన రోగిని పరీక్షించిన తరువాత, తన చెల్లి వచ్చి డాక్టర్ ని అడిగిన మొదటి ప్రశ్న " మా అన్నయ ఇంకా ఎంత కాలం బ్రతుకుతాడు...?". దానికి డాక్టర్ మీ అన్నయ్య ఇంకా ఐదు  సంవత్సరాలు బ్రతకవచ్చు అనగానే అతని చెల్లి ఆత్రుతగా  అయిదేళ్ళు బ్రతుకుతాడా అని మరల అడిగింది. అందుకు డాక్టర్ అవకాశం ఉంటె పదేళ్ళు ఇంకా అదృష్టం ఉంటె ఇంకా ఇరవై సంవత్సరాలు అయినా బ్రతకవచ్చు ఎందుకంటే ఇంతవరకు HIV కి మందు కనుగొనలేదు ఇంకా ఈ అయిదు పది  సంవత్సరాలలో మందు కనక కనుక్కొంటే మీ అన్నయ జీవితకాలం బ్రతికే అవకాశం ఉంటుంది. అది విన్నచెల్లి, అతను ఎంతో సంతోషంగా తిరిగి హైదారాబాద్ బస్సు లో ప్రయాణం అయ్యారు. దురదృష్టం కొద్ది ఆ బస్సు ప్రమాదానికి గురైంది ఆ ప్రమాదంలో HIV సోకినా అన్నయ బ్రతికాడు కానీ ఎంతో ఆరోగ్యవంతురాలైన తన చెల్లి మాత్రం అకాల మరణం చెందింది. ఇలా పై మూడు సంఘటనలలో మొదటివాడు బలవంతుడు రెండవవాడు ధనవంతుడు మూడవవాడు ఆరోగ్యవంతుడు అయినప్పటికీ విధి వక్రించడం వలన వాళ్ళు దేని వలన మనం అతిశాయంచినారో దాని వలెనే వారు నాశనం అయ్యారు అందుకే రేపు మనది కాదు...నేడు సంతోషంగా ఉన్నామా లేదా అన్నది ఆలోచిస్తే చాలు అని అనుకుంటా.... అలాగే ఏదైనా మంచి పని అనుకుంటే దానిని చేస్తే మంచిదని అనుకుంట...

        ఇలాంటి విషయాలు నా మిత్రులతో నేను మాటాడినప్పుడు  రేపే మనం పోతామని వైరాగ్యంతో బ్రతకలేము. మనిషి ఆశ జీవి రేపు ఉందని, ముందు ముందు మంచి జరుగుతాయని ఇంకా ఆనందంగా బ్రతుకుతమనే ఆశతోనే బ్రతకాలి లేకపోతే ఈ ప్రపంచమే లేదు అంటారు. ఆలోచిస్తే ఇదికూడా నిజమనిపిస్తుంది ఒక మనిషి సగటు జీవితంలో చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, ఇలా పిల్లల చదువులు చివరికి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసరికి మనిషి జీవితంలో అరవై సంవత్సరాలు తెలియకుండానే నిండిపోతాయి. అప్పుడు మన జీవితాని ఒక్కసారి వెనిక్కి చూసుకుంటే మన పిల్లలు వచ్చి అడుగుతారు " ఇన్నేళ్ళ జీవితంలో మాకోసం ఏమి సంపాదించారు..?, అలానే మనల్ని నమ్మి జీవితాంతం మనవెనుక నడిచిన భాగస్వామి అడుగుతుంది ఇకనుండి మనం బ్రతకడానికి ఎంత కూడబెట్టారని....? కానీ ఆ రోజు మాత్రం మన అంతరాత్మ అడుగుతుంది " ఇన్నేళ్ళ జీవితంలో ఏమి సాధించావని...?, ఎంత సంతృప్తిని మూట కట్టుకున్నవని..? ఆ రోజు మనం మన అంతరాత్మ ముందు దోషిగా నిలబదకూడదు.. అందుకే నేను అనుకుంటాను "  రేపు ఉందని ఆశతో బ్రతకాలి కాని రేపటికోసం నేటి  సంతోషాన్ని, సంతృప్తి వదులుకొని బ్రతకరాదు."

         ఏదయినా మంచి పని చేయాలంటే మన జీవిత గమ్యాలను చేరుకున్నాక లేదా మన జీవితంలో మంచి స్తాయికి వచ్చాక లేదా మనకున్న బాధ్యతలను నెరవేర్చక చేద్దామని ప్రతివారు చేసే అవకాశం వచ్చినప్పుడు ఇంకోసారి చుద్దములే అని వాయిదా  వేస్తుంటాం  కానీ వాయిదా వేసిన తరువాత అనుకుంటాం అయ్యో ఎంత పని జరిగింది ఈ  పని ముందే చేయాల్సిందని . దీనికి నేను ఒక ఉదాహరణ మీ ముందు ఉంచుతున్నాను. ఒక ఉన్నత ప్రభుత్వ ఉద్యోగి మాతృ దినోత్సవ సందర్భంగా నా తల్లి ఒక పుష్పగుచ్చం కొనడానికి ఒక పూల దుకాణం వద్దకు వచ్చి ఆ పూలవాడితో అధికారి " మాతృ దినోత్సవ సందర్భంగా నా తల్లి ఒక పుష్పగుచ్చం పంపించ దలచుకున్నాను కావున ఒక మంచి, ఒక అందమైన  పుష్పగుచ్చం కావాలి, అది చూడగానే మా అమ్మకి నేను తనని ఎంతగా అభిమానిస్తున్ననో తెలియాలి " అని చెప్పెను. అంతలో ఒక పదిహేనేళ్ళ కుర్రవాడు వచ్చి " అయ్యా నా దగ్గర పది రూపాయలే ఉన్నాయి అందుకు తగ్గ ఒక  పుష్పగుచ్చం ఇమ్మని అడుగగా ఆ పూలవాడు పది రూపాయలకి ఏమి రాదని తిరస్కరించినాడు. అయినప్పటికీ ఆ కుర్రవాడు పూలవాడిని బ్రతిమిలాడటం మొదలుపెట్టాడు. అది చుసిన అధికారి నేను ఆ పిల్లవాడి మొత్తంను  చెల్లిస్తాను తనకి కూడా చిన్న పుష్పగుచ్చం ఇమ్మని చెప్పెను. అది తీసుకొని ఆ కుర్రవాడు ఆనందంగా పరిగెట్టగా అందుకు అధికారి నేను కూడా ఆ మార్గంలో వెళ్తున్నాను నిన్ను కూడా మీ ఇంటి దగ్గర దించి వెళ్తాను అని అంటే ఆ కుర్రవాడు అధికారి కారులో తన ఇంటివైపు వెళ్ళెను. అంత ఆ కుర్రవాడికి తన తల్లిమీద ఉన్న ప్రేమకు అధికారి ముచ్చ్తవేసి కుర్రవాడి తల్లిని చూద్దామని ఇంటికి వెళ్ళెను. అధికారి తన తల్లిని చూసి ఆశ్చర్య  పోయాను ఎందుకంటే ఆ కుర్రవాడి తల్లి చనిపోయి చాలా రోజులు అయ్యింది. ఆ కుర్రవాడు తన తల్లికి అంజలి ఘటించిన తరువాత అధికారితో " అయ్యా నా చిన్నతనంలో నా తల్లి నన్ను ఎంతో అపురూపంగా, ఎంతో అల్లారుముద్దుగా పెంచింది కానీ తనని బాగా చూసుకోవాలని తెలిసే సమయానికి నా తల్లి తనువు చాలించింది. సేవ చేయాలనీ ఉన్న అందరకి ఆ  అవకాశం, అదృష్టం రాదు సార్ " అని విల విల పోయాడు. అది చుసిన అధికారికి ఒక్కసారి ఆలోచించుకొని " తన తల్లిని సంతోషంగా ఉంచాలని మరియు ఉండాలని అనుకుంటున్నాను కానీ    రోజు తను అక్కడ ఎలా ఉందో ఇంతవరకు చూడలేదు, వెంటనే తన ఆఫీసుకి సెలవు పెట్టి తన తెల్లి దగ్గరకి వెళ్ళెను. మనకి అనుకూలమైన సమయం వచ్చే వరకు అవతలవారి అవసరాలు వేచి ఉండవు అందుకే నేను అనుకుంటాను మంచి పని చేయడానికి మంచి రోజు ఎప్పుడని ఆలోచించనవసరం లేదు...మంచి సమయం కోసం ఎదురు చూడనవసరం లేదు...మంచి ముహూర్తం కోసం  వెదకనవసరం లేదు...మంచి పని చేయడానికి మదుపు అవసరంలేదు,  మంది మార్బలం అవసరంలేదు, మంచి చేయాలన్న మంచి మనసుంటే చాలు... ఇంకా లోకంలో మంచి మనసున్న మనుషులు ఉన్నారని నమ్మకంతో ఈ బ్లాగ్ రాస్తున్నా...
          జీవితంలో మనం చేసిన మంచి పనులే ముసలితనంలో మనల్ని మోస్తాయి.. అందుకే వయసు పెరిగే కొద్ది మనకి పెద్దిరకం రావాలి కానీ వృద్ధాప్యం రాకడదు. చివరిగా నేను కోరుకునేది ఒక్కటే ... సమయానుకూలంగా....  సమయస్పూర్తితో... సమస్యల్లో పడకుండా...మనకు సంతృప్తిని మిగిల్చే... నలుగురిని సంతోషపెట్టే మంచి పనుల్ని చేస్తూనే ఉండండి దిన దినం జీవితాన్ని ఆస్వాదిస్తూ....ఆనందిస్తూ...జీవించండి....

Monday, May 7, 2012

అమ్మా నీ సేవా గొప్ప సేవా...

ఒకే ఒక వ్యక్తి... ఆ  వ్యక్తి అంటే ఆనందం, ఆదరణ, ఆత్మీయత, ఆప్యాయత, ఆదర్శం,  ఇలా ఎన్ని చెప్పుకున్న ఇంకా తక్కువే అనిపిస్తుంది. అయిన ఆ ఒక్క  వ్యక్తికే  ఇన్ని రూపాలా, ఆ  వ్యక్తిలో  ఇన్ని భావాలా ఇది నిజ జీవితంలో సాధ్యమేనా...అని ఆలోచిస్తే అది ఒక్కరి వల్లే సాధ్యం ఆ వ్యక్తి ఎవరో కాదు "అమ్మ " ...మరి అలాంటి అమ్మ గురించి ఒక  పూటలోనో, ఒక్క పుట లోనో రాయలేమని తెలిసినప్పటికి, ఇప్పటికే చాలామంది కవులు అమ్మయొక్క  గొప్పతనం   రాసి ఉన్నందున  ఇంకా నేను కొత్తగా ఏమి రాయలేనని తెలిసిన  ఈ  బ్లాగ్  రాయడానికి  కారణం మరొకసారి అమ్మ  ప్రేమని గుర్తుచేద్దామని  ప్రయత్నం మాత్రమే... మహాభారతంలో ఒకచోట  " ఈలోకంలో  ధరిత్రి కన్నా బరువైనది  ఏది అని అడిగితే  దానికి ధర్మరాజు  అమ్మ అని సమాధానం చెబుతాడు." నిజానికి భుమికన్నాభరించే శక్తి  అమ్మకి  మాత్రమే ఉంది. అలాంటి అమ్మ కడుపున పుట్టిననేను  మాతృదినోత్సవం సందర్భంగా  ఆమెకి అంకితమిస్తూ  రాస్తున్నా బ్లాగ్  ఇది....

నవమాసాలు మోసి ఒక బిడ్డకి జన్మనిస్తూ తను పునర్జన్మను పొందినప్పటి నుండి తల్లిగా తన  ప్రయాణం మొదలవుతుంది.  పొత్తిళ్ళలో ఉన్న బిడ్డని చూసి తన  ఒత్తిల్లనే  మరచిపోతుంది. అప్పటిను నుండి ఆ బిడ్డను కంటికి రెప్పవలె  కాపాడతూ  ముందుకు సాగుతుంది. బుడి బుడి నడకలైన, చిలక పపలుకులైన  అన్ని అమ్మ  దగ్గర  నుండే నేర్చుకుంటాం.  ఆకలి వేసినప్పుడు అమ్మ  చేతి గోరుముద్దలైన, అల్లరి చేసినప్పుడు అమ్మ  చేతి  దెబ్బలు కూడా కమ్మగానే  ఉంటాయి. ఇలా బాల్యంలో ఆటపాటలు అమ్మ  ఒడిలోన, మాట  మంచితనం అమ్మ  బడిలోన, ఆనందం మరియు ఆదర్సాలు అమ్మ  గుడిలోన  మనమందరం నేర్చుకున్నవాళ్ళమే. అందుకే నేను అనుకుంటాను "మన అందిరికీ అమ్మే ఆది గురువు...అమ్మ హృదయమే మనకి మొదటి పాటశాల.... "

నేను యవ్వనంలో నాకు మొదట  స్నేహితురాలు మా అమ్మే...నేను పెరుగుతున్న  కొద్ది ఆమె ఇష్టాలను నా మీద  రుద్దలేదు. నా ఇష్టాలను తెలుసుకొని వాటికి ఆమె భావాలను జోడించి నన్ను మంచి మార్గంలో నడిపించింది. నాతో పాటు కుటుంబంలో  పెరుగుతున్న కష్టాలు.. ఆర్దిక  ఇబ్బందులు తనలోనే దాచుకొని నన్ను ఉన్నత  మార్గాలు వైపు నడిపించిది.  నాకు వయసుతో పాటు పెరుగిన  కోపం, కొంటెతనం ఇలా ఆమెను నేను ఇబ్బంది పెట్టిన, తనకు కోపం తెప్పించిన ఆ కోపం తన కళ్ళలోనే చూసాను కానీ ఎప్పుడు ఆ కోపం  ఆమె పెదవి మీద  చూడలేదు. ఇలా ఆమె నోటి మాట  ఎప్పుడు నా మేలే  కోరేది, ఆమె మనసు ఎప్పుడు నా సంతోషాన్నే కోరేది, ఆమె చూపు ఎప్పుడు నా జీవితానికి ముందు  చూపులాగే  సాగింది. మా అమ్మని చుస్తే ఎప్పుడు ఒకటి అనిపిస్తుంది " నా సంతోషం కోసం దుఖాలను, బాధలను  తను దిగ మింగుతూనే ...నా కళ్ళల్లో  సంతోషం చూసి మాత్రం పొంగిపోయేది..." 

నేను చదువుకున్న  సమయంలో సెలవులలో నా మిత్రులు  ఇంటికి వెళ్ళేవాడిని.   అందుకే నాకు నా మిత్రులతో  పాటు  వాళ్ళ కుటుంబ సబ్యులతోను పరిచయం  కూడా ఉండేది.  ఇలా వాళ్ళో ఇంట్లో కూడా నన్ను కుటుంబ సబ్యుడి వలె ఏంతో ఆప్యాయతను,  అనురాగాన్ని పొందాను.  వాళ్ళు  కూడా నా కులాన్ని బట్టో లేదా  మానవత్వంతోనో  నన్ను సాకలేదు. నేను కూడా వాళ్ళ  పిల్లల్లో నన్ను ఒకడిగానే  చూసారు. అందుకే " మతం కన్నా  మానవత్వం గొప్పది... మానవత్వం కన్నా  మాతృత్వం గొప్పది..." అంటారు. దీనికి  గొప్ప నిదర్శనం మదర్ తెరిసా, తన మాతృత్వంతో అనేక దీన జనులకు  సేవ చేయగలిగింది. 

ఇలా అమ్మదనంలో కమ్మదనం గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. మరి అలాంటి అమ్మకు నేటి సమాజంలో  స్థానం ఎక్కడుంది..., మనం బుడి బుడి నడకలు నేర్చుకోవడానికి చేయుతనిచ్చిన  చేతికి చేయూత  ఎక్కడుంది..., మనకు  చిలక పలుకులు  నేర్పిన  ప్రేమమూర్తికి చక్కగా పలకరింపు  ఎక్కడుంది..., పాల  ముద్దలు పెట్టి పెంచిన  పవిత్ర మూర్తికి పిడికెడు మెతుకులు పెట్టెవాడు ఎక్కడున్నాడు... ఇంతకన్నా బాధకరమైన విషయం ఏమిటంటే అన్నదమ్ములు  విడిపోయనప్పుడు " ఆప్పులునైన భరిస్తున్నారు కానీ ముసలి తనంలో అమ్మని  భరించ  లేకపొతున్నారు " అందుకే  రోజురోజుకి వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. ఇలా చేసిన  ఇంకా మనం సంతోషంగా  వున్నామంటే అమ్మ  యొక్క అపూర్వమైన   ప్రేమ  చివరివరకు తనే బాధ పడుతుంది కానీ మనం బాధ  పడాలని కోరుకోదు.  అందుకేనేమో " భుమికన్నాభరించే శక్తి  అమ్మకి మాత్రమే ఉంది.." ఈ  సందర్భంగా నేను ఇంకొక  విషయం  చెప్పదలచు   కొన్నును  " ప్రతి స్త్రీ లోను మాతృత్వం ఉందని గమనించ  కలిగినప్పుడు ఈ  సమాజంలో స్త్రీలపై  ఎలాంటి ఆవాంచినీయ  సంఘటనలు జరగవు. అందుకే అమ్మని ప్రేమించండి...స్త్రీలను గౌరవించండి... మన  భారతీయ  విలువలను  కాపాడండి...
అమ్మని గౌరవించిన  వాళ్ళందరూ ఈ   బ్లాగ్  రాయడానికి నాకు స్పూర్తి ప్రదాతలే...అనుకోని కారణాల  వల్ల  ఒకవేళ    ఎవరైనా తన  తల్లికి దూరంగా ఉన్నట్టు అయితే వారి కోపతాపాలను, తప్పు ఒప్పులను  పక్కని పెట్టి  ఈ  మాతృదినోత్సవం  సందర్భంగా వారు కలిస్తే అంతకన్నా కావాల్సింది ఇంకేమి ఉంటుంది...ఇలాంటివి ఉహాకి బాగానే ఉంటుంది కానీ నిజ  జీవితంలో కష్టమే అయిన  ఏదో ఆశతో ఈ  బ్లాగ్ పోస్ట్  చేస్తున్నాను.  







Wednesday, April 25, 2012

నా కుటుంబం...

నేను ఉన్నత కుటుంబంలో పుట్టలేదు కానీ ఉమ్మడి కుటుంబంలో పెరిగాను. సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు అందరం ఎంతో ఆనందంగా గడిపేవాళ్ళం. అప్పుడు నేను చుసిన ప్రేమ అభిమానాలు, ఆ  అప్యాయతలు నేను పెరుగుతున్న కొద్ది వాళ్ళ దగ్గర నుండి పొందలేకపోయాను. నేను కూడా ఆలోచిస్తే ప్రేమ అభిమానాలు,ఆ అప్యాయతలు  సరిగ్గా వాళ్ళకి పంచలేక పోయాను అనిపిస్తుంది. మరి ఈ మార్పు ఎక్కడ నాలో వచ్చింది ఒక వేళ వస్తే అది ఎక్కడ మొదలయ్యింది. అసలు ఎందుకు మారాల్సి వచ్చింది అని ఆలోచించడం మొదలు పెట్టాను. ప్రపంచంలో పరిస్థితులు మనో వేగంగా కన్నా వేగంగా మారుతున్నాయి. అందుకేనేమో తరతరానికి మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. ఇంతకి కుటుంబం అంటే ఎలా వుండాలి అని నేను ఆలోచిస్తున్న సమయంలో విపులలో ఒక కధ నన్ను ఎంతో ఆకట్టుకుంది. ఆ కధ చదివిన తరువాత నా మనసులో ఒక తెలియని సంతోషం ఒక గొప్ప అనుభూతిని నింపింది. ఆ కధా రచయతికి నా పాదాభి వందనాలు తెలుపుకుంటూ నా మాటలలో ఆ కధను మీ ముందు ఉంచుతున్నాను. ఇంతకి ఆ కధ పేరు " కన్నీళ్లు కావాలి..."

అమెరికా దేశంలో న్యూయార్క్ నగరంలో దేశవిదేశ శాస్త్రవేత్తలందరూ ఒక చర్చా వేదికలో పాల్గొన్నారు. ఆ వేదిక సారంశం " కన్నీళ్ళు తయారుచేయడం ఎలా...?". దీని నిమిత్తం ముందుగా అమెరికా శాస్త్రవేత్త నిలబడి " అయ్యా మనిషి కళ్ళ నుండి రోజురోజికి కన్నీలు రావడం తగ్గుతున్నాయి. ఇలానే కనక కొంతకాలం కొనసాగితే మనిషి కళ్ళనుండి పూర్తిగా కన్నీళ్ళు రావడం జరగదు. కన్నీళ్లు మనిషి యొక్క కళ్ళు అంతర్భాగాలను పరిశుభ్రం చేస్తుంది. కానీ ఇలా కన్నీళ్లు తరగడం వలన  మనిషికి కంటి సంబందమైన వ్యాధులతో బాధపడవలసి వస్తుంది  అలానే చివిరికి మనిషి చూపుకూడా మందగించ వచ్చును. కావున  ఇక్కడకు విచ్చేసిన  వారందరూ కన్నీళ్లు తాయారు చేయడంలో వారియొక్క సూచనలను సలహాలను తెలియచేయమని" చెబుతూ ముగించాడు. తరువాత  జపాన్  శాస్త్రవేత్త లేచి " అసలు కన్నీళ్లు తయారుచేయాలి అంటే ముందు కన్నీళ్ళో కళ్ళను శుద్ధి చేసే ఏ ఏ   రసాయనాలు ఏమున్నాయో తెలుసుకోవాలి కాబట్టి ముందు మనిషి కన్నీళ్లను పరీక్షించాలి. ఇలా ఒక్కో దేశపు శాస్త్రవేత్త తమ తమ సూచనలను తెలియజేస్తున్నారు. చివిరిగా మన భారత దేశ  శాస్త్రవేత్త లేచి అసలు మనిషికి కన్నీళ్లు మనసులోని సంతోషం, బాధలాంటి  భావోద్వేగాలను బట్టి జనిస్తాయి. కానీ మనిషి నేడు అలాంటి భావోద్వేగాలకు లేకుండా యాంత్రికమైన జీవితం జీవిస్తున్నాడు. రోజురోజుకి మనిషికి పెరుగుతున్న పని ఒత్తిడి, సంపాదన మీద  అధిక వ్యామోహం, మితి మీరిన స్వార్ధం వలన  మనిషి యాంత్రికమైన జీవితం సాగిస్తున్నాడు. రేపటి తరాలు కోసం పది రూపాయలు సంపాదించడం ప్రయాసపడుతున్నాడు కానీ వారితో పది నిమిషాలు గడపలేకపోతున్నాడు. పిల్లల సంతోషం కోసం వేలకి వేలు వెచ్చెంచితున్నారు కానీ ఆ పిల్లలతో సంతోషంగా గడపడానికి సమయాన్ని మాత్రం వెచ్చించ లేకపొతున్నారు. అందుకే నేడు కుటుంబ సంబంధాలు కూడా వ్యాపార ధోరణిలోనే నడుస్తున్నాయి. డబ్బుతో అన్ని కొనగలం కానీ అప్యాయతలు, అనురాగాలు వాటితోనే కలిగే సంతోషాలు, బాధలను కొనలేం..అలాగే సహజ సిద్ధంగా జనించే కన్నీళ్లు కూడా మనం కొనలేం. మరి ఇక కన్నీళ్ళు రావాలంటే మనం చేయాల్సింది ప్రయోగాలూ కాదు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రేమించాలి. అలాంటి ప్రేమను పంచె ఒక గ్రామం మా దేశంలో ఉంది దానిని సందర్శించమని చెప్పి ముగించాడు.

భారత శాస్త్రవేత్త కోరిక మేరకు ఒక బృందం మన దేశంలో ఆ   గ్రామాన్ని విచ్చేసారు. వారు ఆ గ్రామంలో జరిగే ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ పెళ్ళిలో పచ్చని గడపలు, మామిడాకుల తోరణాలు, కళకళలాడే కళ్యాణ మందిరాలు, మంగళ వాయిద్యాలు, పడుచుపిల్లల పక్క చూపులు, చిన్న పిల్లల కేరింతలు, వధూవరుల సిగ్గులు స్వప్నాలు, పెద్దల దీవనలు, విందులు, వియ్యాల వారి వినోదాలు, ఇలా ఎదుర్కోల పన్నీరు నుండి అప్పగింతలలో కన్నీరు మద్య జరిగే ఎన్నో అప్రుర్వమైన, అద్భుతమైన  పెళ్లిని తిలకించి ఆ బృందం ఒక గొప్ప ఆనందం కూడిన అనుభూతిని పొందారు. అంత వివహ వేడుకలో కూడా జరిగిన పొరపాట్లుకు కూడా ఒకరికొకరు చేసుకునే సమర్ధింపులు, సర్దుబాటులతో కూడిన సరిదిద్దుబాటులు ఇలా అనుకున్నట్టు జరగన్నపుడు వచ్చే బాధ, తరువాత వాళ్ళని సంతోషపరచాడిని పడే ప్రయాస..ఇలా ఎన్నో భావోద్వాగాలతో జరిగే వివాహం శాస్త్రవేత్తల బృందానికి ఒక సంతృప్తిని మిగిల్చింది. అలా  శాస్త్రవేత్తల బృందానికి ఆ గ్రామాన్ని విడిచి వెళ్ళినప్పుడు గ్రామస్తులు యిచ్చిన వీడ్కోలు దుఖః సాగరంలో సాగింది..

ఇది కధా...ఈ కధ చదివాకా నాకు తెలిసింది మనం నేడు ఆప్యాయతలు అవసరం కొద్ది ప్రదర్శిస్తున్నారు, మమకారం మాటలలోనే చూపిస్తున్నారు, మరి ప్రేమలు తమ .  పని ముగించే వరకే కురిపిస్తారు. సర్దుకు బ్రతకల్సింది పోయి అన్నిముందే  సర్దుకుని బ్రతుకుతున్నారు.మరి సమాజంలో ఇలాంటి మార్పులను  మనం నేడు ప్రపంచీకరణ అని కొత్తగా పిలుచుకున్న, సమాజంలో స్థానం  కోసం ఇలా చేసినవాడిని మనం మంచి నేర్పరిగా చెప్పుకున్న అది చివిరికి  మనిషి వినాసనం వైపు మాత్రమే పయనిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో మనిషి జీవన పరిస్థుతులు కన్నా మనిషి యొక్క మానసికస్థితి ఇంకా వేగంగా మార్పు చెందుతుంది. అభివృద్ధి కోసం మార్పు అనేది మనిషి యొక్క జీవన పరిస్థుతులలో అవసరం కానీ అది మనిషి యొక్క మానసిక స్థితిలోను, మనవ సంబందాలలోను మార్పు అవసరం లేదు. అందుకే మనిషి సంతోషంగా ఉండడానికి నూతన ప్రయోగాలూ చేయనవసరం లేదు, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్నిస్వార్ధం లేకుండా  ప్రేమిస్తే చాలు... అంటే మన కుటుంబ సబ్యులు పట్ల మనం ప్రేమతో మెలిగితే చాలు...ఏదైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మన ఇంటివారిని సంతోషపరిచిన తరువాత సమాజ శ్రేయస్సుకి అడుగులు వేయాలి...

Tuesday, March 20, 2012

నా ప్రపంచం..

నా చిన్నతనంలో బాగా గుర్తు... వేసవికాలం... వెన్నల రాత్రులు...ఆరుబయట అరుగుమీద  కంచంలో  అన్నం తింటూ ...అమ్మతో వింతలు విశేషాలు మాటాడుకుంటూ, తిన్నాక పక్కనున్న మంచమెక్కి ఆకాశంలో చుక్కలు లెక్కిస్తూ పడుకునేవాడిని. నేను పడుకునే ముందు అనేక విషయాలను అమ్మతో మాటాడే వాడిని అమ్మ ఎప్ప్దుడు కూడా మా చుట్టూ జరిగే విషయాలను చెబుతూ వుండేది.  మా అమ్మ ఎప్పుడు మాటలలో చెప్పేది " రోజులు మారుతున్నాయి, కాలం రోజురోజికి మారిపోతుందని.. నేను అప్పటినుండి ఆలోచించేవాడిని ఈ రోజులు ఎవరు మారుస్తున్నారు...ఈ కాలం ఎలా మారుతుందని...?
 నేను పదవ తరగతి చదువుతున్నప్పుడు షోషల్ మాస్టారు చెప్పారు అభివృద్ధి కావాలి అంటే మార్పు అనివార్యం ఎక్కడ మార్పు ఉండదో అక్కడ నుండే విప్లవం పుడుతుంది. అప్పుడు అనుకున్నాను  నేను రోజురోజికి ప్రపంచం అభివృద్ధి చెందుతుందని. ఈ అభివృద్ధి అనేది మనిషి ఇంకా సంతోషంగా మరియు సుఖంగా జీవించాడని మానవుడు తన ప్రయత్నం నిత్యం చేస్తూనే ముందుకు సాగుతున్నాడు. అయితే తరువాత రోజురోజుకి పెరుగుతున్న మారణకాండ కావచ్చు, అలాగే రోజురోజుకి పెరుగుతున్న కొత్త రోగాలు మరియు ప్రకృతిలో చోటుచేసుకుంటున్న అనేక మార్పులు నేడు  మనషి యొక్క ఉనికిని సవాలు చేస్తున్నాయి. భూమి మీద జీవరాసి పుట్టినప్పటినుండి మనిషి ప్రయాణాన్ని గమనిస్తే" భూమి నుండి మనిషి అభివృద్ధి అనే ఆకాశం వైపు అడుగులు వేసేకొద్దీ మనిషి భూమికి దూరమయ్యాడు తప్ప ఆకాశానికి దగ్గర కాలేకపోయాడు". అయితే మరి మనిషికి దేనికోసం ఈ ప్రయత్నం ఇంతకి మనిషి గమ్యం ఎటువైపు... అనే ఆలోచనలో నాకు ఎన్నో ప్రశ్నలు నా మదిలో తలెత్తున్నాయి...అసలు మనిషికి...
                            " పరిశ్రమలు కావాలా...పర్యావరణం  కావాలా...
                              ఆస్తులు కావాలా...ఆత్మీయత కావాలా....
                              ఆనందం కావాలా..... అభివృద్ధి కావాలా...."   
వీటి అన్నిటికి మూలాలు ఎక్కడని నేను ఎప్పుడు ఆలోచించేవాడిని.  భౌతికశాస్త్రంలో  ఒక వస్తువును    విశ్లేశించినట్టు  ఈ ప్రపంచాన్ని కూడా విశ్లేశించాలని ఆలోచన వచ్చింది..ఆ ఆలోచన...
వస్తువు ---> కొన్ని పదార్దాల సముదాయం ----> ఒక పదార్దం కొన్ని అణువుల కలయక----> ఒక అణువు కొన్ని పరమాణువుల కలయక ---->  ఒక పరమాణువు ఎలెక్ట్రాన్,  ప్రోటాన్  మరియు  న్యూట్రాన్ల   కలయక    అదే విధంగా ఈ ప్రపంచాన్ని విశ్లేసిస్తే  ప్రపంచం ----->కొన్ని సమాజాల కలయక-----> ఒక సమాజం కొన్ని  సంఘాల   కలయక ----> ఒక సంఘం కొన్ని కుటుంబాల కలయక ---> ఒక కుటుంబం భర్త  (   ప్రోటాన్  ), భార్య( ఎలెక్ట్రాన్ ) మరియు పిల్లల (న్యూట్రాన్లు )కలయక.  దీనిని బట్టి ఒక వస్తువు యొక్క గుణగణాలు విశ్లేషించడానికి ఎలెక్ట్రాన్,  ప్రోటాన్ల గమనాన్ని బట్టి విశ్లేశిస్తము అలాగే ఈ ప్రపంచం యొక్క గుణగణాలు విశ్లేషించడానికి భర్త  ( పురుషుడు),   భార్య (స్త్రీ)లను విశ్లేషించాలని నాకు అర్ధం అయ్యింది. ఈ ప్రపంచం సంతోషంగా ముందుకు సాగాలి అంటే ముందు  కుటుంబ వ్యవస్థ పటిష్టంగా వుండాలి. అలాగే మార్పు కూడా ఈ కుటుంబ వ్యవస్త నుండే మొదలు అవుతుంది.  అయితే మార్పు మరియు అభివృద్ధి మనిషి అవసరాన్ని తీర్చే విధంగా వుండాలి కానీ అవి నేడు మనిషికి కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి.  కానీ మనిషి నేడు పరిశ్రమలు కోసం పర్యవనాన్ని, అభివృద్ధి కోసం అనందనం, ఆస్తుల కోసం ఆత్మీయతను పణంగా పెట్టి మనిషి ముందుకు సాగుతున్నాడు.

అయితే అవసరాలను తీర్చే అభివృద్ధి, సంతోషంగా బ్రతకడాని సరిపడా సంపద, పర్యవనాన్ని పాడుచేయని పరిశ్రమలతో మనిషి ముందుకు సాగితే మంచిది అలాగే నూతన విజయాలు సాధించడం  కన్నా నేడు భూమి మీద వున్నా సహజ సంపద, సంస్కృతిని కాపాడుకోవడమే ఉత్తమం. అందుకే నేను అనుకుంటాను ప్రపంచం లో మార్పులకు మూలకారణం కుటుంబ వ్యవస్థ మారడమే...వాళ్ళ కొత్త కోరికలను బట్టే కొత్త సమస్యలు..వాళ్ళ ఆవేశలను బట్టే అనర్ధాలు జరుగుతున్నాయి. మనిషి పురోగతి అనుకోని ముందుకు సాగుతున్న అది చివరికి మనిషి పతనానికే దోహదపడుతున్నాయి.  
ప్రపంచం అంటే ప్రదేశాలు, దేశాలు కాదు మన చుట్టూ వున్నా పరిసరాలే... సమాజం  అంటే ఈ లోకంలో ఉన్న సకల జనులు కాదు మనతో పాటు సహజీవనం చేస్తున్న సన్నిహితులు, స్నేహితులే...అదే విధంగా మార్పు అనేది ఎక్కడో ప్రారంభం కాలేదు అది మన నుండి...మనం మన భావి తరాలకు కోత్తాగా నేర్పినవి, దానినే మనం కాల క్రమేనా మార్పుల చెప్పుకుంటున్నాం.
ప్రపంచం బాగుండాలి అంటే ముందు మన కుటుంబం బాగుండాలి. సమాజంలో నైతక విలువలు ఉండాలి అంటే ముందు మన కుటుంబంలో నైతిక విలువలు వుండాలి. సంఘంలో శాంతి మరియు  సంతోషంగా ఉండాలి అంటే మన కుటుంబంలో శాంతి మరియు సంతోషం ఉండాలి.. మరి కుటుంబంలో శాంతి మరియు సంతోషం ఉండాలి అంటే మనం ఏమి చేయాలి?, ఎలా ఉండాలి? అని నేను ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటా...ఆ ఆలోచనలకి ఒక రూపం నేను తరువాత రాయబోయ బ్లాగ్ లో పొందిపరచాను. 

Tuesday, February 21, 2012

ఓడియమ్మ జీవితం....

నాకు బాగా కష్టం వచ్చినప్పుడు " ఒడియమ్మ  జీవితం...." ఇట్టా జరిగిందేటి అని అనుకుంట...అలాగే బాగా ఆనందం కలిగిన " ఓడియమ్మ జీవితం.... " జీవితం అంటే ఇట్టా ఉండాలిరా అని అనుకుంటా...అందుకే జీవితమంటే ఒంట్లో సత్తువయిన వుండాలి లేదా అమ్మనాన్నలు సంపాదించినా సోమ్ముయిన వుండాలి. అప్పుడు ఉంటుంది జీవితమంటే మజా...కానీ నాకు ఎప్పుడు నవ్వు తెప్పించే సంఘటన ఒకటి " నేను పని చేసేది పవర్ ఆఫీసులో కానీ ఇంత ఇంటికి వెళ్లేసరికి పవర్ మాత్రం కొన్ని సార్లు వుండదు" నిజంగా నాకు అప్పుడు అనిపిస్తుంది ఓడియమ్మ ఇదేమి జీవితం. ఇలా ఆలోచిస్తే నా జీవితంలో జరిగిన చిన్న చిన్న సంతోషాలు వాటికన్నా ముందు నేను చుసిన చిన్న కష్టం లేదా చిరాకుల సమాహారమే ఈ బ్లాగ్.

చిన్నతనంలో వాన అంటే సరదా అలాగే వాన తరువాత వచ్చే నీరు వరద అన్న మహా సరదా...దాని తరువాత ఊరిలో ఉండే బురదంటే మాత్రం...చిరాకు..స్కూల్ చదువుకునేటప్పుడు పాఠాలు వినాలి అంటే మాత్రం విసుగు...అదే కధలు వినాలంటే వినయం, ఆటలు అంటే ఆనందం...అదే ఆసనాలు వేయమంటే మాత్రం హడలు...అప్పుడనుకోనేవాడిని " ఓడియమ్మ ఇదేమి స్కూల్ జీవితం.. త్వరగా పూర్తి అయితే కాలేజిలో మనకు  నచ్చినట్టు ఉండవచ్చు అని "

పదహారేళ్ళ వయసు...ఆ వయసుతో వచ్చిన సొగసు...ఆ సొగసును సరిగ్గా ఉంచుకొనే మనసు...ఆ మనసుకి ఇంకొకరి మనసులో స్తానం కోసం తాపత్రయపడే మనసు...అలా ప్రయత్నం చేస్తే అందరిముందు అవుతామేమో అలుసు... అలా ఆలోచించడం అర్దం లేదని తెలుసు...అయిన ముందుకు అడుగు వేయని మనసు..ఎందుకంటే అందరి కళ్ళలో పడతానేమోని భయం. అన్నటు కళ్ళు అంటే ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. నేను ఇంటర్ చదుతున్నప్పుడు కాలేజికి వెళ్ళే మార్గం మద్యలో కిటికీలో నుండి రోజూ ఒక అమ్మాయిని చూసేవాడిని. కిటికీ పై రెక్కలు మాత్రమే తెరచి వుండడం వలన తనని కళ్ళనుండి ఫై భాగం రోజూ చుస్తేనేవాడిని. ఈ కళ్ళు ఆ కళ్ళని రోజూ చుస్తాన్నాయని ఆ కళ్ళకి తెలుసు. ఈ కళ్ళు ఆ కళ్ళని చూడగానే నా ముఖంలో చిరు దరహాసం మరి ఆ కళ్ళలో ఒక ఆనందం అది చూసి నా హృదయంలో ఒక మధురమైన అనుభూతి..ఇలా చాలా రోజులు మా కళ్ళు మాకు తెలియకుండానే మాటలడుకున్నాయి. అయితే ఒక రోజు ఎలా అయిన ఆ అమ్మాయిని చూడాలని నిశ్చయించు కొని
తన ఇంటిముందు కాపు కాసాను. మొదటి రోజు నా సమయం వృధా అయ్యింది మొత్తానికి తను బయటికి రాలేదు మరల రెండవ రోజు కూడా ఆ అమ్మాయి ఇంటిముందు కాపు కాసా... చివిరికి  ఆ అమ్మాయి రానే బయటికి వచ్చింది... ఇంకేంటి ఆ అమ్మాయని చూసాను.."ఒడియమ్మ  జీవితం..." అనుకున్నాను ఎందుకంటే అప్పుడు కూడా ఆ అమ్మాయి కళ్ళని మాత్రమే చేశాను...ఆ అమ్మాయి ముస్లిం అమ్మాయి..అయినా ఇంకా ఒక రెండు రోజులు వెంటబడ్డాను తన బురఖా తీయలేదు అలా ఆ తరువాత తను చూసే ప్రయత్నం చేయలేదు. ఇలా మొత్తానికి నా యవ్వనం అంతా " ఒడియమ్మ  జీవితం మిలటరీ బ్రతుకు "అయిపోయందిని అనుకున్నాను. కానీ లే ఉద్యోగం వచ్చాక ఉదయ్ C/o ఉత్సాహం అనేలా ఎంజాయ్ చేద్దామని అనుకున్నాను.

సరే చివిరికి ఒక ఉద్యోగం వచ్చింది. మొదట్లో పని నేర్చుకోవాలని  ఉత్సాహమో.. అలాగే ఇప్పుడు పని నేర్చుకోకపోతే ఫై స్తాయికి వెళ్ళాక ఇబ్బంది పడతానని భయమో తెలియదు కానీ... అందరికన్నా ఎక్కవ కాలం ఆఫీసులో పని చేసేవాడిని. దాని వలన కొన్ని సార్లు నా వ్యక్తిగత పనులు అలాగే వ్యక్తిగత సంతోషాన్ని కూడా కోల్పోయాను. మా ఆఫీసులో చాల మంది చెప్పేవారు " ఆడది తిరిగి చెడిద్ది.. మగాడు తిరగక చెడతాడు" ఇంకా ఒక నా ఫై అధికారి " మందు తాగని వాళ్ళు వెయ్యల్లేమి బ్రతకరు అలా అని మందు తాగిన వాళ్ళు వందేల్లోపు చనిపోరు " అయిన నా మనసు ఎందుకో అటు ప్రక్క వెళ్ళలేదు. నాకు కొన్ని సార్లు చిరాకు వచ్చినప్పుడు అనిపించేది ఏదో ఒకటి చేయాలనీ ఎందుకంటే " మనిషి అన్నాక కాస్తంత కళాపోషణ వుండాలని ..." కానీ అది కూడా ఆ క్షణమే..తరువాత ఏదో పని చేసుంటూ ముందుకు పోయాను. మొత్తానికి "ఒడియమ్మ  బ్యాచలర్ జీవితం ఇంతకన్నా ఎంజాయ్ చేయలేము ఇక పెళ్లి చేసుకుంటే మంచిది" అని అనుకున్నాను.


కానీ నా ముప్పై సంవత్సరాల జీవితాన్ని ఒక్కసారి వెనక్కి చూసుకుంటే నా బాల్యంలో కానీ, నా యవ్వనంలో కానీ, నా ఉద్యోగ జీవితంలో నేను కోల్పోయింది ఏమి లేదు. ఆ సమయానికి " ఓడియమ్మ జీవితం.... " ఇలా జరిగింది ఏంటి అని అనుకున్న అది తాత్కాలికం మాత్రమే. దీనిని బట్టి నాకు అర్ధం అయ్యింది ఒక్కటి చాల మందిలా నేను కూడా జీవితాన్ని అనుభవించకుండా ప్రేక్షకుడిలా చూస్తూ ఏదో మిస్ అవుతున్నామని అనుకుంటారు. అలా ఏదో మిస్ అవుతున్నామని ఎలాంటి తొందరపాటు పని చేయకపోవడం వలన నేను ఈ రోజు సంతోషంగా మరియు ఇబ్బంది పడకుండా ఉన్నాను. అందుకే ఈ బ్లాగ్ చదివే మిత్రులకు ఒక విన్నపం " పక్కవాడు ప్రేమలో పడ్డాడని మనం కూడా వేరొక అమ్మాయి కోసం ట్రై చేయడం  అనేది అర్ధం లేని విషయం" ఒక వేల అలా చేస్తే దాని వలన మనం తాత్కాలికంగా సంతోషంగా ఉండగాలమో గాని ఏదో ఒక రోజు మనం ఇబ్బంది పడే రోజు అయితే వస్తుంది అప్పుడు మనం అనుకోకూడదు "ఒడియమ్మ  జీవితం...." ఇట్టా జరిగిందేటి అని.  అందుకే  ప్రేక్షకుడిలా పక్కవాడిని గమనించి ఏదో మిస్ అవుతున్నామనే తొందరపాటే ఏదైనా అనుభవానికి పురికొల్పుతుంది తప్ప అందులోంచి ఆనందాన్ని ఆస్వాదించేది ఏమి ఉండదు, మనకు ఒక నిర్దిష్టమైన ఆలోచనతో జీవితాని ఆస్వాదిస్తూ ముందుకు సాగండి ఒక వేల కష్టమైన, సుఖమైన ఎదురైతే అది మన జీవితంలో   చివరికి సంతోషాన్ని ఇస్తేందే కానీ సమస్యలు మాత్రం ఎదురు కావు.