Wednesday, January 22, 2014

స్ఫూర్తి...


కీర్తిగాంచిన వారి నోటినుండి  వచ్చిన ప్రతీ మంచి మాట మిగతా వారికి స్పూర్తిని ఇస్తుంది. అందుకే ఆ స్పూర్తినిచ్చిన ప్రతీ మంచి మాట ఆచరిస్తే మనం కొన్ని సార్లు కీర్తిని పొందవచ్చును. అయితే నేను  ఇక్కడ చెప్పదలచుకున్నది స్పూర్తి గురించే కాని కీర్తి గురించి  కాదు. సరిగ్గా సంవత్సరం ముందు  అంటే జనవరి 2013 లో ఒక పుస్తకంలో ఒక భాగం నాకు ఎంతో స్పూర్తినిచ్చింది. ఈ సందర్భంగా ఆ భాగాన్ని మీ ముందు ఉంచదలచాను.
"ఈ లోకంలో ప్రతీ దానికి ఒక వెల ఉంటుంది అది చెల్లించకుండా దానిని మనం పొందలేము. ఉదాహరణకు ఒక సినిమా అయినా ఒక సుందరప్రదేశమైన, ప్రయాణమైన పోటిగా ఆడుతున్నఆటకైనా... ఇలా పూలకో ఒక వెల, పాలకో వెల నిర్ణయించి మన జీవితంలో పొందుతున్న ప్రతీ అనుభూతికి, ఆనందానికి ఎంతో కొంత వెల చెల్లించి వాటిని పొందగలుగు చున్నాం. చివిరికి మనం పొందుతున్న ఆనందానికి కుడా ప్రభుత్వానికి ప్రత్యక్షంగానో పరొక్షంగానో కొంత సుంకాన్ని చెల్లిస్తున్నాం.  



అలాంటప్పుడు ఈ అద్భుతమైన, అందమైన ప్రపంచంలో మనల్ని ఒక అపురూపమైన మనిషిగా  సృష్టించి ఎల్లప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి  కారణమైన దేవుడే  కనక మన ముందు ప్రత్యక్షమై ఇన్ని రోజులు ఈ ప్రపంచంలో జీవించిన దానికి నాకు నువ్వు ఏ మూల్యం చెల్లించగలవు అని అడిగితే మనం ఆ మహా దేవునికి ఏమి చెల్లించగలము..... ?"
 నిజంగానే దేవుడు కనక ప్రత్యక్షమై నన్నే ఆ ప్రశ్న అడిగితే నేను ఏమి ఇవ్వగలను అని ఆలోచించడం మొదలుపెట్టాను ముందు నాకు ఆశ్చర్యం వేసింది ఇలాంటి ప్రశ్నను నా మనసుకి సంధించుకున్నందుకు, తరువాత బాధ వేసింది నా దగ్గర సమాధానం లేనందుకు, అయిన నేను ఎప్పుడు ఇంకా దేవుడు దయలేదు ఇంకా నేను అనుకున్నట్లు జరగలేదు అని తిరిగి దేవుణ్ణి నిందిస్తూ ఉంటాను. చివరకు ఆ పుస్తకంలో చదవడం ప్రారంభించాను అందులో వ్యాసకర్త మాత్రం ఒక మంచి మాటను చెప్పి ముగించాడు. ఆ మాట " మనం దేవునికి తిరిగి ఏమి ఇవ్వనవసరం లేదు కానీ ఒక రోజు ఈ ప్రపంచంలో ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి ఒక మంచి పని చేస్తే చాలు ". ఇది చదివాకా చాలా సంతోషం వేసింది. ఇక నేను కూడా రోజుకొక మంచి పని చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడో పుస్తకంలో చదివిన మాట గుర్తుకు వచ్చింది. 
" నేను ఈ రోజు ఈ మనిషికి ఎంతో కొంత నేర్పగలిగాను లేదా ఏదో ఒక మంచి పని చేశాను అని పిల్లలకు చెప్పకుండా నిద్రపొవద్దు ..... "   - చార్లెస్ కింగ్స్ ల్ 

ఏదో ఒక మంచి పని చేయాలని ఉద్దేశ్యంతో ముందుకు సాగాను, వారం రోజులు గడిచాయి ... తరువాత ఇంకో వారం రోజులు గడిచాయి ... అయిన నేను ఎలాంటి మంచి పని చేయలేకపోయాను. అప్పుడు అనుకున్నాను పైన చెప్పిన మాట ఆలోచనకి బాగుంది కాని ఆచరణలో కష్టం అని అర్ధం అయ్యింది. ఇలా నేను ఏమి చేయలేనని తలచి,  అవకాశం వచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుంటాను అని మనసు మార్చుకొని అలాగే రోజుకి ఒక మంచి వాక్యం నేర్చుకుందామని నిశ్చయించుకొని అప్పటినుండి డైరీలో వ్రాయడం మొదలుపెట్టాను. అయితే సంవత్సరం పొడుగునా నేను 30 నుండి 40 వాక్యాలని మాత్రమే నా డైరీలో వ్రాయగలిగాను. 

ఇలా ఈ అలచోనలతో సంవత్సరం అంతా ముందుకు సాగి  చివరిలో ఒక ఆలోచనతో వచ్చాను. పైన చెప్పిన మాటలు అమలు చేయడం అసాధ్యం అని తలచి మంచి పని చేయలేకపోయిన ఒక మంచి వ్యక్తిగా మెలగడానికి ఈ క్రింది నిర్ణయం తీసుకొన్నాను 
" నా ప్రేమ వలన ఇంకొకరికి ఇబ్బంది కలగకూడదు 
   అలాగే నా కోపం వలన ఇంకోకరు  బాధ పడకూడదు ..... "
మనం చూపే ప్రేమ వలన ఎదుటవారు వారి స్వేచ్చను కోల్పోకూడదు, అలాగే మనకు నచ్చని పనిని చేసేటప్పుడు కోపాన్ని ప్రదర్శించ కూడదు తప్పుడు పని చేసేటప్పుడు మాత్రం కోపాన్ని ప్రదర్శించాలి.  
చివిరగా నేను ఒక మాట చెప్పి ముగించాలి అనుకుంటున్నాను " మనం చేసే పని కీర్తి కోసం కాదు కేవలం స్ఫూర్తి కోసం మాత్రమే అని నేను ముందే చెప్పాను, మరి ఆ స్ఫూర్తి ఎవరికీ యివ్వాలి అంటే మన పిల్లలకు లేదా మన భావి తరాలు వారికి. నేను ఇలా చెప్పడానికి కారణం ఈ క్రింద మాట నాకు ఎప్పుడు స్పూర్తినిస్తుంది కాబట్టి .... 
" నిలకడైన జీవితానికి అర్ధం వృత్తిలో గెలుపు కాదు, మన పిల్లలను విలువలతో తీర్చిదిద్దడంలో ఉందని నాకు 25 ఏళ్ళ ముందు నాకు చెప్పుంటే బాగుండునని తలస్తున్నాను.... " - రబ్బీ హరోల్డ్ కుషనర్