Sunday, July 16, 2017

AFTER TWENTY YEARS...

"AFTER TWENTY YEARS " ఈ పేరు సందర్భానికి సరైనదని పెట్టాను కానీ నిజాయతీ గా చెప్పాలంటే ఇది  "O. HENRY" రచించిన ఒక ఇంగ్లిష్ కధ. ఈ కధ 9వ తరగతిలో ఇంగ్లిష్ సబ్జెక్ట్ లో మాకు  ఒక పాఠ్యంశం. ఈ  కధని గొప్పగా వ్రాసారా లేదా మా టీచర్ గొప్పగా బోధించారో నాకు తెలియదు కానీ ఈ కధ  మాత్రం నా మనసులో బాగా నాటుకు పోయింది. ఈ కధ ఇద్దరు స్నేహితులు మధ్య జరిగే సంభాషణ. వారి వ్యక్తిగత జీవితాలు రీత్యా వారు విడిపోయే   ముందు మరల  20 సంవత్సరాల తరువాత   కలుద్దామని ఒక నిర్ణయం తీసుకుంటారు. వారి జీవిత ప్రయాణంలో ఒకరు పోలీస్ ఇంకొకరు దొంగలా తయారవుతారు. అయితే ఇరవై సంవత్సరాలు తరువాత తన స్నేహితుని కోసం వేచిచూస్తూ తన మిత్రుడు ఎలాంటివాడు ఎలాఉండేవాళ్లు అని చెప్పిన విధానం బాగా నచ్చింది. అయితే మా టీచర్ పాఠం ముగించాక నా మనసులో ఒక ప్రశ్న మొదలయ్యింది. అది " నా జీవితంలో నాకోసం ఎవరైనా ఇలా ఇరవై సంవత్సరాల తరువాత ఎవరైనా కలవడానికి ప్రయత్నం చేస్తారా?".  వాస్తవంగా ఆలోచిస్తే నాకు ఇలా జరగడం కష్టం అనిపించింది. అయితే కనీసం నా జీవితంలో నాతో ఇరవై సంవత్సరాలు కలిసి నడిచిన స్నేహితులను సంపాదిస్తే చాలు అని  అనుకున్నాను. ఎందుకంటే నేను ఎక్కడో చదివిన మాట గుర్తుకు వచ్ఛేది " ఒక సంమవత్సరంలో వేయి మంది స్నేహితులను సంపాదించడం కన్నా వేయి సంవత్సరాలు మనతో ఉండే స్నేహితులను సంపాదించడం మంచిది" అందుకే నేను స్నేహానికి విలువనిస్తూ నా జీవితంలో ముందుకు సాగాను. ఇప్పుడు నేను ఒక్కసారి వెనిక్కి చూసుకుంటే నాతో 20 సంవత్సరాలుగా  ప్రయాణం చేస్తున్న మిత్రులు నా జీవితంలో  ఉన్నారని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్లాలనిపిస్తుంది, ఎంత సమయమైనా వెయిట్ చేయాలనిపిస్తుంది, ఎన్ని రోజులైనా ఇంకా కలిసుండాలనిపిస్తుంది. ఎందుకంటే మమతానురాగాలు మనసుగా, కరుణే కళ్లుగా, మంచితనమే మాటలుగా, చేతలే చేయూతగా, ఆదర్శమే అడుగులుగా, సహనంతో, సంతోషంతో, ఆత్మీయతో ఇంకా అలుపెరగకుండా నాతో 20 సంవత్సరాలుగా  ప్రయాణం చేసిన ఈ మిత్రులకు ఏమిఛ్చి ఋణం తీసుకొనగలను, ఈ బ్లాగ్ ద్వారా శుభాకాంక్షలు చెప్పడం తప్ప.  ఇలాంటి మిత్రుల గురించి ఒక పల్లవి(పాట)లోనో, ఒక పేజీ(బ్లాగ్)లోనో, లేదా మూడు గంటల్లో(సినిమా) చెప్పడం కష్టమే. అయినా నేను మాత్రం ఒక ప్రయత్నం చేయదలచాను.
               
              ముందుగా ఒక పాట రాయాలని చాలా  ఆలోచించ కానీ HAPPY DAYS లో ఈ పాట విన్నాక ఇంతకు మించి నేనే కాదు ఇంకెవరు స్నేహం గురించి వ్రాయలేరనిపించింది. ఇంతటి గొప్ప పాటని అందించిన వేటూరి గారికి నా పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ పాటని ఇక్కడ జతచేసాను.
            
       



 ఇక ఒక బ్లాగ్ వ్రాయాలని ఆలోచిస్తే నా మనసులోనుండి పదాలు ఇలా వరదలా దొర్లిపోతున్నాయి  అమ్మలోని మమకారమనే పాలు నాన్నలోని 
సహకారమనే  చక్కెర కలిస్తే వచ్చేది ఒక తీయనిబంధం. ఆ బందానికే కనక ఒక పేరు పెట్టమంటే దానికి నేను ' స్నేహం' అని నామకరణం చేస్తాను. ఈ బంధానికి కుల మతాలని అడ్డంకులు లేవు, చిన్న పెద్ద అనే తారతమ్యాలు లేవు. బీద ధనిక అనే  గుణగణాలు లేవు.  అందుకేనోమే స్నేహబంధంలో ప్రేమకు అవధులు లేవు. ప్రతి మనిషి జీవితంలో మాటలే మొలకలుగా, ఆటపాటలే ఆకులుగా, కబుర్లే కొమ్మలుగా నవ్వులే పువ్వులుగా ప్రేమయే ఫలంగా ఎదుగుతూ చివరికి స్నేహం ఒక వృక్షంలా వృద్ధి చెంది దాని నీడలో నిత్యం ఆనందిస్తూ ఉంటారు. అందుకేనేమో చాలా మంది తమ కుటుంబ సభ్యులంతా ప్రాధాన్యత స్నేహితులకే ఇస్తారు.


నా జీవితంలో నేను నిజమైన స్నేహితులను పొందగలిగాను ఎందుకంటే నా స్నేహితులతో ఉండే బంధం ఒక స్వచ్ఛమైన సంతోషకర మైన బంధం. నేను ఈ మాట చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో కొన్ని " నాలో కొన్ని బలాలు, కొన్ని బలహీనతలు ఉన్నమాట నిజమే. దాని వలన జరిగే పరిణామాలకు నేను అడుగడుక్కి సంజాయిషీ ఇవ్వనవసరం లేదు. అలాగే నా బలహీనతలను పురికొల్పకుండా నాలో ఉండే మంచి గుణగణాలను ఎప్పుడు బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేయడం. ఏ విషయంలోనైనా  నేనే ముందు చొరవ తీసుకోవాల్సిన పని లేదు. నేను ఈ స్నేహ బంధాన్ని కొనసాగించేందుకు, దానిని నిలుపుకోనేందుకు నా ఇష్టా ఇష్టాల్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. నా ఆత్మగౌరవానికి ఇంతవరకు హాని చేయని బంధం" ఇలా నేను చెప్పినా తక్కువే. నన్ను ఎప్పుడు స్వేచ్చగా, స్వచ్ఛంగా ఉంచే నా స్నేహితుల పట్ల నేను పారదర్సికంగాను, విధేయత తోను ఉండటానికి ఇష్టపడతాను. 
                     ఇక ఒక సినిమానే తీయాలంటే  నాకు అసాధ్యమైన పని తెలుసు. నేను అనుకోకుండా స్నేహితుల దినోత్సవం రోజునే ఒక మిత్రుడుతో కలిసి "కధా నాయకుడు" సినిమా చూసాను. ఈ సినిమా చివరిలో రజినీకాంత్ సంభాషణ సన్నివేశంలో నాకు తెలియ కుండానే నా కళ్ళనుండి కన్నీళ్లు వచ్చ్చేశాయంటే ఆ సన్నివేశంలో నేను ఎంత లీనమైపోయానో ఇంకా నేను చెప్పనక్కరలేదు. ఎందుకంటే ఈ సన్నివేశం నా జీవితానికి చాలా దగ్గరగా అనిపించింది.  కారణం నాకు సమయం దొరికి నప్పుడల్లా నా స్నేహితుల దగ్గరనుండి నేర్చుకున్న విషయాలను కానీ, వారు సహాయపడిన సందర్భాన్ని ఇతరులకు తెలియ చేయడానికి ఇష్టపడతాను. 



ఫైన చెప్పినతలే నా జీవితంలో స్నేహితులు నిజంగా దేవుడిచ్చిన ఒక గొప్ప బహుమతి అనడంలో అతిశయోక్తి లేదు. మరి అలాంటి స్నేహితులకు మరి నేనేమి చేయగలను అని ఆలోచిస్తే బైబిల్ ఒక చక్కని మాట గుర్తుకు వచ్చింది.  " ఎదుట వ్యక్తి మీ పట్ల ఎలా ఉండాలని అనుకుంటారో మీరు అతనిపట్ల అలాగే ఉండండి". ఇంతవరకు నాకు బహుమతిగా ఉండే స్నేహితులకు నేను కూడా వారికి బహుమతిలా ఉంటె మంచిది అనిపించింది. అయితే అది అంత  సులభం కాదు తెలిసిన, ఈ  స్నేహితుల దినోత్సవము నుండి నేను కూడా బహుమతిలా ఉండాలని ప్రయత్నం చేద్దామని అనుకున్నను. ఒకవేళ నేను బహుమతిలా మారకపోయినా ఎవర్ని బాధ కలుగాచేయకుండా ఈ క్రింది మాటకి ఎల్లప్పుడూ కట్టుబడి ఉండాలి ఉండాలని  నిశ్చయించుకొన్నాను. 
I may not always in touch, but I care about you very much
I may not always stop by to say hi, but I hope to never have to say goodbye
I may not prove to be the best or perfect friend, but I hope the friendship we share never reaches an end..............................HAPPY FRIENDSHIP DAY.....

Sunday, July 31, 2016

Its my relations....

ప్రాణం ఉన్నదేది తన కోసం జీవించదు.... అలాగే ఒంటరిగా జీవించదు - విలియం బ్లేక్ 

మనిషి ఎల్లప్పుడూ  ఒంటరిగా కాకుండా ఒక సొంత కుటుంబాన్నిఏర్పరచుకొని జీవనం సాగిస్తాడు. తన కుటుంబంతో జీవనం సాగించడానికి ఒక ఇంటిని కట్టి దానినే దేవాలయంగా భావిస్తారు. " ఇంటి పేరు అనురాగం ముద్దుపేరు మమకారం మా ఇల్లే బృందావనం " ఒక తెలుగు కవి వ్రాసిన పాట. ప్రతీ వారిలాగానే నేను కూడా మా ఇల్లు కూడా ఎల్లప్పుడూ  సంతోషంగా ఉండాలని అనుకుడేవాడిని. కానీ నేను పెరిగిన కొద్దీ మా బృందావనం  బీటలు వాలి కూలిపోయింది చివిరికి మమకారం తగ్గి అహంకారంతో రగిలి అతలాకుతలం అయ్యింది. ఆలోచిస్తే ఒకే ఇంట్లో పెరిగినవాళ్ళం, ఒకే బడిలో చదివినవాళ్ళం, ఒకే ఊళ్ళో తిరిగినవాళ్ళం .... కానీ మా వయస్సు పెరుగుతున్న కొద్దీ మా ఆలోచనలో చాలా  మార్పులు వచ్చాయి. దీనికి కారణం మారుతున్న కాలంతో పాటు, రోజురోజుకి  మనిషిలో   పెరుగుతున్న స్వార్ధం ఎందుకంటే నా చిన్నతనంలో "కలసి ఉంటే కలదు సుఖం" అం చెప్పేవారు, కానీ నేడు " కలసి కలహించుకోవడం కన్నా విడిపోయి సంతోషంగా ఉండటం మేలు". 

నా చిన్నతనంలో ఉన్న కుటుంబాలని నేటి కుటుంబాలతో పోల్చి చూస్తే చలా వత్యాసం కనిపిస్తుంది. "వెన్నల రాత్రులలో చందమామ మిస్ అవ్వలేదు కానీ చందమామ కధలు చెప్పేవారు మిస్ అయ్యారు. ఎండా కాలంలో వేసవి సెలవులు మిస్ అవ్వలేదు కానీ ఆ వేసవి సెలవుల్లో ఇంటిల్లిపాదినీ ఒక దగ్గర చేర్చే పెద్ద దిక్కు మిస్ అయ్యింది. ప్రతి సంవత్సరం  వచ్ఛే పండగలు మిస్ అవ్వలేదు కానీ ఏ పండగ నాడు ఏ తీపి వంటకం వండాలో చెప్పే మనిషి మాత్రం మిస్ అయ్యారు". దీనికి కారణం నేటి తరానికి కధలు చెప్పడానికి ట్యాబ్లు, యూ  ట్యూబ్ ఉన్నాయి. అదే వేసవి సెలవులు వస్తే సమ్మర్ కోర్సులు, క్రాష్ కోర్సులు ఉన్నాయి. అలాగే పండగలు వస్తే తినడానికి రెస్టారెంట్స్, తిరగడానికి షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అందుకే నేటి తరానికి అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు అవసరం లేదు. అందుకే మన భారత దేశంలో కూడా ఉమ్మడి కుటుంబాలు(Joint Family) శాతం తగ్గుముఖం ఉండగా చిన్న కుటుంబాలు (Nuclear Family) శాతం పెరుగుతూ ఉంది. నేటి తరానికి ఏదైనా అవసరం అనుకుంటే వాళ్ళని ఒక క్రాష్ కోర్సులో జాయిన్ చేస్తారు, ఇలా చివరికి వ్యక్తిత్వ వికాసం కూడా కోర్సులు జాయిన్ చేస్తారు. వాళ్ళు వృత్తిలో రాణించడానికి పాఠాలు చెప్పగలరేమో గాని జీవితానికి కావాల్సిన నైతిక విలువలు, సాంప్రదాయాలు, ప్రేమాభిమానాలు మాత్రం నేర్పించలేరని తెలియడం లేదు. 

ఒక అర్ధ శాస్త్రవేత్త చెప్పిన మాటను గుర్తుచేస్తాను" All human relations are commercial relations" అంటే " మానవుని యొక్క అన్ని బంధాలు వ్యాపార బంధాలే". ఏమో కొన్ని సార్లు ఈ మాట నిజమనిపిస్తుంది. నేటి సమాజంలో మనిషి బంధాలను పేమతో కాకా డబ్బుతో ముడి వేస్తున్నారు. ఎక్కడ ఇచ్చిపుచ్చూకునే ధోరణి ఉందో ఆ బంధాలు దృఢంగా ఉంటాయి. ప్రేమ, అభిమానాలు వ్యక్త పరచడానికి ఇచ్చిపుచ్చూకోవడమనేది ఒక పద్ధతి అంతే కానీ పుచ్చూకునే ధోరణితో బంధాలు ఏర్పిడితే అవి ఎక్కువ కాలం నిలబడవు. ప్రేమకు ప్రాధాన్యత ఉన్నచోట డబ్బు ఉంటుంది కానీ డబ్బుకి ప్రాధాన్యత ఉన్నచోట మాత్రం ప్రేమ నిలబడదు. కానీ ఒక్క మాట మాత్రం వాస్తవం " ఈ లోకంలో డబ్బుతో చాలా కొనగలం కానీ మన కోసం కన్నీళ్లు కార్చే మనిషిని మాత్రం కొనలేం " ఈ మాటలు నిజం నేను చెప్పడం కాదు యాపిల్ కంపినీ సృష్టి కర్త, తన ఆఖరి రోజులలో డైరీలో రాసుకున్న ఈ క్రింది మాటలు చదవండి

నేను చివరిగా ఒక మాట చెప్పదలిచాను " Relationships never dies with natural death, but these relationships are always murdered with EGO, IGNORANCE and SELFISHNESS".  అందుకే నా జీవితంలో 

ఉన్న ప్రతీ బంధాన్ని ఇకపై నిలబెట్టుకోవాలని, నేను తెలియక గాని, అనుకోకుండా నాతో ఉన్నవారిని నష్టం కలిగించిన, బాధ పెట్టిన దానికి తగురీతిలో క్షమించమని అడిగి వారితో  ముందుకు సాగాలని నిశ్చయించుకున్నాను. ఎందుకంటే " When you say sorry to someone, It means that you are not wrong and other one is right. But it means that you have given importance to relationship more than 'EGO'

Saturday, August 22, 2015

కాకిలో కాకినై తోకలో ఈకనై .....


"కాకిలో కాకినై తోకలో ఈకనై" ఇది చదవడానికి హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ, ప్రతీ మనిషి ఇలానే జీవిస్తున్నాడనిపిస్తుంది. జీవరాసులు అన్నింటిలోనూ 'కాకి' ప్రత్యేకం కాకపోయినా మనిషి జీవితాన్ని మాత్రం అందరు 'కాకి' తోనే పోలుస్తారు. ఉదాహరణకి " కాకిలా కలకాలం బ్రతకడం కన్నా హంసలా ఆర్నెళ్ళు బ్రతకడం మిన్న" ఇలానే ఒంటరి జీవితానికి 'ఏకాకి' అని, కాకులు 'కావు' 'కావు' అని అరుస్తుంటే " ఈ లోకంలో మనకు ఏవీ శాశ్వతం 'కావు' అని ఇలా సందర్భాన్ని బట్టి మన పెద్దలు మనిషి జీవితాన్ని 'కాకి' తోనే పోల్చారు. అందుకనే  నేను కూడా మనిషి జీవితాన్ని 'కాకి' తో పోల్చి ఈ బ్లాగ్ కి  "కాకిలో కాకినై తోకలో ఈకనై ...." అని పేరు పెట్టాను. ఆలోచిస్తే ఇది నాకు నిజమే అనిపిస్తుంది, ఎందుకంటే మనిషి బ్రతికినంత కాలం " కాకులలో కాకి లాగా జీవించి ...., చివరికి ఏకాకిలా మిగిలి ..., మరణించిన తరువాత తోకలో ఈకలా మిగిలిపోవడం.  అయితే కాకిలా కాకుండా హంసలా బ్రతకాలంటే మనం ఏమి చేయాలి? అసలు మనం జీవిస్తున్న విధానం కాకిలా ఉందా? లేదా హంసలా ఉందా అని తెలుసుకోవడం ఎలా? అని నా మనసులో ప్రశ్న మొదలైంది.

మొదట ప్రశ్నకి సమాధానంగా నేను " ఆస్తులు అమ్ముకొని ఆత్మ సోధనకై ఒక యోగి  ప్రస్తానం ( The Monk Who Sold his Ferrari)" పుస్తకంలో చదివినది మీ ముందు ఉంచదలచాను. " పూర్వం మన దేశంలో ఒక రాజు ఉండేవాడు, ఆ రాజు ప్రతీ రోజు ఉదయాన్నే లేచి అదేరోజు  అతనికి  ఈ లోకంలో చివరి రోజుగా భావించి, తన పిండ ప్రదానం తనే చేసుకునేవాడు. అందుకు ఆ రాజు నిజంగా తన జీవితంలో చివరి రోజని భావంచి  తన భార్యతో, పిల్లలతో, స్నేహితులతో అలాగే ప్రజలతో ఎలా ఆనందంగా గడపాలి? ఎవరితో ఎంతకాలం గడపాలో సమయస్పూర్తిగా మెలిగి తన రాజ్యంలో మంచి పేరు సంపాదించుకున్నాడు." ఇలా ఆలోచిస్తే చాల మంచిది అనిపిస్తుంది ఎందుకంటే మన జీవితంలో అదే చివరి  రోజు అని తెలిస్తే నిజంగా మనల్నిబాధ పెట్టినవాల్లని క్షమించాలనిపిస్తుంది, తప్పు చేసినవాల్లని సరిదిద్దాలనిపిస్తుంది అలాగే మన పట్ల ప్రేమగా ఉన్నవారికోసం త్యాగం చేయాలనిపిస్తుంది. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే  ఆశ, దుఃఖం తగ్గి మన జీవితం సంతొషంగా ముందుకు సాగుతుంది.
మనం బ్రతికినంత కాలం ఎలా బ్రతికామని ఆలోచిస్తే నాకు యండమూరి గారి పుస్తకంలో ( పుస్తకం పేరు సరిగ్గా గుర్తులేదు) మనం చనిపోయిన తరువాత మన గురించి మన కుటుంబసబ్యులలో ఒకరు, మన స్నేహితులలో ఒకరు, మనతో పని చేసేవాళ్ళు ఒకరు ఇలా ఒక్కొక్కర్నీ మన గురించి రెండు నిముషాలు మాట్లాడమంటే నిజానికి, నా గురించి మంచిగా మాట్లాడడానికి ఎంత మంది ముందుకు వస్తారన్నది నాకు పెద్ద సందేహమే. అయితే ఇలా ఆలోచించడం వలన కూడా మనం ఇకపైన మంచిగా ఉండగలమా? నిజానికి ఈలాంటి ఆలోచనలు మనిషిని మార్చగలదా? అంటే తప్పక మనిషి ఆలోచన మారి మంచి విధానంలో నడుస్తాడనే చెప్పాలి. దీనికి ఒక నిజసంఘటన, ఒక ఆద్భుతమైన సంఘటన మీ ముందుంచదలచాను. ఈ విషయం చాల మందికి తెలిసిన సందర్భానుసారం మరొక సారి గుర్తు చేయదలచాను.
ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ బహుమతి అందిరికి తెలుసు అయితే నోబెల్ బహుమతిని  ఇవ్వడానికి గల కారణం అలాగే అందులో అంతర్యం ఏమిటి? అని ఒక్కసారి ఆలోచిస్తే..... " అల్ఫ్రెడ్ నొబెల్ 1833 సంవత్సరంలో స్వీడన్ దేశంలో ఒక ధనవంతుని కుటుంబంలో జన్మించాడు. ఈయన రసాయన శాస్త్రంలో మంచి ఆరితేరిన ఇంజినీర్, ఈయన సుమారు 355 కొత్తవి కనుగొన్నాడు. అందులో 'డైనమేట్' ఈయనికి మంచి పేరుతెచ్చి పెట్టింది. దురదృష్టవత్తు నొబెల్ సహోదరుడు 1988 మరణించాడు, ఈయన సహొదురుని పేరుకి చివర నొబెల్ అని పేరు ఉండటం వలన అల్ఫ్రెడ్ నొబెల్ మరణించాడని బయట ప్రచారం సాగింది. అప్పటిలో సమాచార వ్యవస్థ అంతంత మాత్రంగా ఉండటం వలన, ఒక ఆంగ్ల పత్రిక అల్ఫ్రెడ్ నోబెల్ మరణించాడని భావించి అల్ఫ్రెడ్ నోబెల్ మీద ఒక సంపాదకీయం ప్రచురించింది. నోబెల్ డైనమేట్ కనుగొనడం వలన, ఆ సంపాదకీయంలో ఆయనను ఒక " The Merchant of Death" గా ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఆ సంపాదకీయాన్ని బ్రతికి ఉన్న అల్ఫ్రెడ్ నోబెల్ చదివి నేను మరణించిన తరువాత ఈ ప్రపంచం నన్ను ఈ విధంగా గుర్తుచేసుకుంటుంది అని తెలిసి చాల బాధపడ్డాడు. ఈలాంటి పేరు నేను ఎలాగైనా మార్చుకోవాలని భావించి తను మరిణించె ముందు తన మొత్తం ఆస్తిని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దానిమీద వచ్చే ఆదాయంతో ఈ ప్రపంచంలో శాంతి స్థాపన కోసం కృషి చేసినవారికి మరియు మానవాళికి ఉపయోగకరమైన వాటిని కనిపెట్టిన వారికీ నోబెల్ బహుమతిని ప్రకటించమని తన వీలునామాలో  పొందుపరిచి మరణించాడు. నొబెల్ కధ చదివాక ఇలా ఆలోచించడం మంచిది అనిపిస్తుంది.
పుట్టినవాడు గిట్టక తప్పదు. పుట్టుక చావుల మధ్య ప్రయాణమే జీవితం, సాధారంగా మనిషి బాల్యంలో అల్లరి చేయడం, యవ్వనంలో కామించడం, నడివయస్సులో సంపాదించడం, చివరికి వృద్ధాప్యంలో - చనిపోయే రోజు సమీపించినకొలదీ మంచిగా జీవించాలి..., మన జీవితానికి సార్ధకత ఉండాలని ఇలా చాలాకాలం బ్రతకాలి అనే ఆశతో జీవిస్తారు. శ్రావ్యంగా పాడేవాడికి, ఆ పాట రాసేవాడికి ఒకే హృదయం ఉంటుంది. "నీ కంటే గొప్పవాడిని" అనటానికి ఎవరికీ హక్కు లేదు. ఒకరికి కవిత్వం రాయటంలో, ఇంకొకరికి ప్రకృతిని ఆనందించటంలో శక్తీ ఉంటుంది. ఎవరి ప్రత్యేకత వారిది, ఎవరి జీవితం వారిది. కానీ ప్రతీ జీవితం ఒక ప్రత్యేక జీవితం. ఆశకు అంతు లేదు, కానీ అంతానికి ఆశ కారణం. ఇదే జీవితం, ఇదే ప్రపంచం.నేను పైన వివరించినట్లు మనం ఈ ప్రపంచం మొదటి పదిమంది గొప్పవాల్లలొ మనం ఒకరిలా ఉండాలని నా ఉద్దేశ్యం కాదు, కానీ మన ఆత్మీయ ప్రపంచంలో ఉన్న పదిమందితో సంతోషంగా జీవించాలంటే అలాంటి గొప్ప ఆలోచనలతో ముందుకు సాగాలన్నిది నా ఉద్దేశ్యం.... మన ఆలోచనలే మన జీవిత ప్రమాణాలు... ఆ ప్రమాణాలే మన జీవితానికి సార్ధకతనిస్తాయి... 




Monday, February 9, 2015

Work is worship

"పని దైవంతో సమానం" అన్నారు పెద్దలు మరి దైవం కోసం పని చేసేవల్లున్నారు మరి వారి పనిలో ఎంత నిజాయితి ఉంది? వారి నిజాయితిని ప్రశ్నించే గలిగే పెద్దవాడిని కాదు. ఇకపోతే పనిని (డ్యూటీని)దైవంలా భావించి పని ఎంతమంది చేస్తున్నారు?.  ఇలా ఆలోచిస్తే ముందు నేను పనిని దైవంలా భావించి చేస్తున్నాన లేదా అని ప్రశ్నించుకోవాలి. అందుకే ఈ బ్లాగ్ పూర్తిగా నేను చేస్తున్న పనిని సక్రమంగా చేస్తున్నాన లేదా అని విశ్లేషించడానికి మాత్రమే రాయదలచాను.

నేను ఉద్యోగం జాయిన్ అయినప్పటి నుండి నన్ను నేను విశ్లేషించుకుంటే నేను కొన్ని సార్లు మేనేజర్ గా కొంతమందితో పని చేయించాల్సి వచ్చేది అలాగే నేను సబ్ ఆర్డినేట్ ఒకరి  క్రింద పని చేయాల్సిన సందర్భాలు ఉన్నాయి. పై రెండు సందర్భాలను ఎప్పుడు నేను రెండు కధలతో నేను పోల్చుకొని నాకు నేను సరిగ్గా పని చేస్తున్నాన లేదా అని సరి చేసుకుంటాను. అయితే మొదటిగా నేను మేనేజర్ గా కొంతమందితో పని చేయించాల్సి ఈ చీమ కధని గుర్తుచేసుకుంటాను. ఈ కధ రచయతిని ఈజిప్ట్ దేశం నుండి వెలివేసారట అందుకే నేను ఈ కధని నా పై అధికారులను వేలిత్తి చూపడానికి కధని గుర్తుచేసుకోవడం లేదు నా లోపాలను వేలిత్తి చూపించడానికి మాత్రమే.

పై కధలో రచయత చెప్పినట్లు ఒత్తిడితో పని చేయిస్తే మనకి వచ్చే రిజల్ట్స్ తగ్గుతయిని నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయిన ఇలాంటి పరిస్తితలో సగటు మనిషి పనితనం ఇంతకు మించి ఉండదు అని ఖచ్చితంగా  ప్రక్క చిత్రమే అద్దం పడుతుంది. ఇక రెండవ విషయానికి వస్తే నేను కొన్నిసార్లు సబ్ ఆర్డినేట్ ఒకరి  క్రింద పని చేయాల్సిన వచ్చినప్పుడు ఈ కధని గుర్తుచేసుకుంటాను. ఈ కధ నాకు చాల ఇష్టమైనది. ఈ కధని తలచుకున్నప్పుడు నేను బాగా ఉత్సాహంగా పని చేస్తాను. ఆ కధ  క్లుప్తంగా" ఒక నగరంలో ఒక ప్రఖ్యాత బిల్డర్ ఉండేవాడు ఆయన దగ్గర ఒక నమ్మకస్తుడైన మేస్త్రి ఉండేవాడు. వీరిద్దరి కలయకలో మంచి బిల్డింగ్స్ నిర్మించి ఆ నగరంలోనే మంచి పేరు సంపాదించుకున్నారు. కొంత కాలం గడిచాక ఆ మేస్త్రి బిల్డర్ దగ్గరకు వెళ్లి " నా పిల్లలు పెళ్లి వయస్సుకి వచ్చి ఉన్నారు, వారి పెళ్లి నిమిత్తమై ఇక  నేను నా సొంత గ్రామానికి వెళ్తాను" అని చెప్పగా అది విని బిల్డర్ " నీ మాటను కాదనులేదు కానీ నాకు ఒక కోరిక ఉంది అది నేరేవేర్చి నీ గ్రామానికి వెళ్ళు" అని బదులిచ్చాడు. అంతటి ఆ మేస్త్రి తన యజమాని మాటను తృనికరించలేక ఏమటా కోరిక అని అడుగుగా, ఆ బిల్డర్ " నా మిత్రుని కోసం నేను ఒక ఇల్లు కడతాను అని మాట ఇచ్చాను అది పూర్తి చేసి వెళ్ళమనెను. మొత్తానికి ఆ మేస్త్రి తన యజమానికి యిచ్చిన మాట ప్రకారం ఆ ఇంటిని గడువు కన్నా ముందే పూర్తి చేసి, తన గ్రామానికి వెళ్లేముందు తన యజమాని కలిసి " అయ్యా! మీ కోరిక ప్రకారం మీ మిత్రుడి ఇంటిని పూర్తిచేసాను ఇక నాకు సెలవిప్పంచండి" అని అడుగగా అంత బిల్డర్ " ఇన్నాళ్ళు నాకు నమ్మకంగా పని చేసిన నీకన్నా నాకు గొప్ప మిత్రుడు ఎవరుంటారు? అలాని నీకు నేను ఏమి యిచ్చి సత్కరించగలను? అందుకే నువ్వు చివరిగా కట్టిన ఈ ఇల్లు నీకే బహుమతిగా యిస్తున్నాను" అని ఆ ఇంటి తాళాలను మేస్త్రికిచ్చెను. అది తీసుకొని మేస్త్రి చెప్పలేని సంతోషంతో తను కట్టిన ఇంటికి చేరి మరొకసారి ఆ ఇంటిని మనసారా చూసి చాల బాధ పడ్డాడు. అయ్యో! ఈ ఇల్లు నాకోసమే అని ముందు తెలిసి ఉంటే  ఇంకా బాగా కట్టుకొని ఉండేవాడిని, అనవసరంగా తొందరగా ఇంటిని పూర్తిచేసాని అని చాలా బాధపడ్డాడు"
అందుకే మనం ఎప్పుడు సొంతపని అయితే చక్కగాను ప్రక్కవారి పని అయితే చిరకుగాను చేయకూడదు. ఏ పనైనా సొంతానికి ఒకలాగా, పంతానికి పోయి ఒకలాగా చేయకూడదు. అందుకే ప్రతిఫలాన్ని బట్టి పని చేయకూడదు, మన పని మనం చక్కగా చేస్తే మనవెంట సంతృప్తి అనే ప్రతిఫలం ఎప్పుడు మనలను ముందుకు నడిపిస్తుంది. 


ఈ బ్లాగ్ ని ముగించే ముందు నేను ఒక్క మాట చెప్పదలచాను. " అన్ని వేళలో లేదా అన్ని సందర్భాలలో ఈ మనిషి 100% పనితనాన్ని ప్రదర్శించలేము, ఎందుకంటే జీవితంలో ఎదురైనా సమస్యలతో కొన్ని సార్లు పనిని అనుకున్నంతగా చేయలేము. మనం స్కూలింగ్ చదువుతున్నప్పుడు 6 సబ్జెక్ట్స్ ఒకేసారి చదువుకుంటూ ఒకేసారి పరీక్షలు కూడా రాసి ఉత్తీర్ణలవుతాం. అదే నిత్య జీవితంలో కూడా మనం సరిగ్గా ప్లాన్ చేసుకుంటే అనికున్న పనిని అనుకున్న సమయానికి పూర్తిచేయగలం. ఈ పదేళ్ళ నా ఉద్యోగ జీవితంలో తెలుసుకున్న సత్యం ఉంది. " చాల మంది సమయాన్ని ఎలా గడపాలో తెలియక చాలా ప్లాన్స్ వేసి, ధనాన్ని ఖర్చు చేసి చివరకు ఇంకా అనుకున్నంతగా సంతోషం పొందలేదని నిస్పృహ చెందుతారు. కాని నేను మాత్రం " కాలాన్ని ఖర్చు చేయడానికి ధనాన్ని ఖర్చు చేయను, నా శ్రమని ఖర్చు చేస్తాను"  ఎందుకంటే పనిలో మనం పొంది అనుభవం మనకు ఒక సంతోషాన్ని, ఆ పని వలన ప్రతిఫలం పొందిన వాళ్ళకి ఒక సంతోషం అదిచూసి మనకు ఒక సంతృప్తి ఇలా పని చేయడంతో సంతోషం, సంతృప్తి, అలాగే ఈ సత్ప్రవర్తన సమాజానికి ఒక సుభపరిణామం.




Tuesday, July 29, 2014

బదులు దొరకదే....?


 బదులు  అంటే సమాధానం లేదా జవాబు. ప్రతి మనిషి జీవితంలో జవాబు దొరకని ప్రశ్నలు ఎన్నో ఉంటాయి, వాటినే సమస్యలుగా మనిషి ఉహించుకుంటాడు. అలాగే మనతో నిత్యం కలిసుండే కుటుంబ సభ్యులు, సహచరులు మరియు మిత్రులు మనతో కొన్ని సందర్భాలలో అనుకూలంగా ప్రవర్తించక పోవచ్చు లేదా మనల్ని దూరంగా ఉంచవచ్చు. అప్పుడు మనం బాగా ఆలోచిస్తాం నా వాళ్ళని అనుకునేవాళ్లు నాపట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు. అలాగే నాకే ఎందుకిలా ఎప్పుడూ జరుగుతుందని అనుకుంటాం. ఒక వేల సమయం సందర్భం కుదిరితే కొన్నిసార్లు  ప్రశ్నిస్తాం కుడా. అయితే  వాళ్ళు మన మనస్సుకి నచ్చని  సమాధానం చెబితే  వాళ్లకి బాగా పొగరు అని అనుకుంటాం అదే అసలు సమాధానమే చెప్పకపోతే వాళ్ళని శత్రువులుగా అనుకుంటాం. నిజానికి ఇలాంటి  సందర్భాలలో  సమాధానం దొరకలేదని మీరు గోడకేసి తల బాదుకున్న మన తలనుండి రక్తం కారడం మొదలుపెట్టవచ్చు కానీ ఆ గోడ ఎప్పటికి విరిగి మీకు దారినివ్వదు. చాల కుటుంబాలలో ఆలుమొగలు మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ సమధానం ఉండదు. సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నామంటే ఇంకో వాదాన్ని మనం బలంగా ఎదుటవారికి చేపుతున్నట్టే అని ఉహించుకుంటాం .అసలు నిజంగా సమాధానం ఎవరికీ అవసరం?, మరి దాని నిమిత్తం ఎవరు వెతకాలి ? ఎవరు ప్రయాసపడాలి? అని ఆలోచిస్తే మనం ఎప్పుడు ఎదుటవారి నుండే దానిని కోరుకుంటాం మరల మనం మనకు సమాధానం దొరకలేదని బాధపడతాం. కాని వాస్తవానికి ప్రశ్న ఎక్కడుందో అక్కడే సమాధానం ఉంటుందని నా భావన.

నా జీవితంలో కుడా ఇలాంటి సందర్భాలు చాలా  ఉన్నాయి. అయితే మనకు ఎదురయ్యే ప్రశ్నలేదా మనం అడిగే ప్రశ్నలకు  సమాధానం లేకపోయినా పరవాలేదు కానీ అది సరైన  ప్రశ్న  అవునో కాదో అని మాత్రం మనం ఆలోచిస్తే మనకు సగం బాధలు తీరినట్టే. ఎందుకంటే నేను చాల సార్లు సరిగ్గా ఆలోచించ లేకపోయాను. ఉదాహరణకు నాకు సముద్ర తీరంలో ఉండటం అంటే నాకు చాల ఇష్టం. అందుకే నేను వైజాగ్ వెళ్ళినప్పుడల్లా నేను వైజాగ్ లో నేను ఎందుకు పుట్టలేదా? అని అనుకునేవాడిని. అలాగే తరువాత మా ఊరు వచ్చకా అయ్యో! మా ఊరికి సముద్ర తీరం ఎందుకు లేదు? అని  అనుకునేవాడిని. ఇలా చాలా సార్లు సమాధానం లేని నిరుపయోగమైన ప్రశ్నలను సందించుకొని అనవసరంగా బాధ పడుతుంటాం. ఇలాగే ఒక మునీశ్వరుడి దగ్గరకు ఒక శిష్యుడు వచ్చి " గురువుగారు మంచి వాళ్ళకే ఎందుకు చెడు జరుగుతుంది?" అని అడిగాడట. దానికి ఆ గురువు ఆ ప్రశ్నకి సమాధానం చెబుతూ " ఆ ప్రశ్నే తప్పుగా ఉన్నప్పుడు దానికి నేను జవాబు చెప్పాలని ఎలా అనుకుంటావు. అసలు నీ ప్రశ్న ఇలా ఉండాల్సింది " మంచి వాళ్ళకి చెడు జరిగితే ఏమవుతుంది?, దానికి నేనిచ్చే జవాబు " వాళ్ళు ఇంకా మెరుగైన వాళ్ళల తయారవుతారు" అని ఆ మునీశ్వరుడు చెప్పాడట. అందుకే మన జీవితంలో ఎప్పుడు కూడా సరైన ప్రశ్నలతోనే ముందుకు సాగితే సమాధానాలు దొరకక పోయిన కొత్త సమస్యలు మాత్రం రాకుండా ఉంటాయి.
నేను ABN లో 'సిరివెన్నల' గారితో ముఖా ముఖి చుసాను. అయన చిన్నతనం నుండి ఎక్కువుగా తనని తను ప్రశ్నించుకోనేవారట. అందుకే ఆయన రాసిన పాటలు చాలా  మందిని ప్రశ్నించే నట్టే ఉంటాయి. 'కొత్త బంగారులోకం' లో రాసిన ఈ పాట చూడండి
   
         నీ ప్రశ్నలు నీవే ఎవ్వరు బదులివ్వారుగా .... 
         నీ చిక్కులు నీవే ఎవ్వరు విడిపించారుగా .... 
         ఏ గాలో నిన్ను నిన్ను తరుముతుంటే అల్లరిగా... 
         ఆ గాలో లేదో తెలియదంటే చెల్లదుగా....  

  పైన చెప్పినట్టు మన జవాబు కోసం  ఇంకొకరు స్పందించారు. అందుకే నేను అనుకుంటాను  ఏ సమస్యకైన సమాధానం మన అంతరాలాలో నిక్షిప్తమై ఉంటుంది దానిని వెలికితీసే ప్రయత్నమే తెలియక ఈ సమస్యలు. అంటే మామిడి చెట్టు క్రింద నిల్చొని నారింజ పండు కావాలంటే దొరకదు. అందుకే ఏ పండు (సమాధానం) కావాలో మనకు తెలిసినప్పుడు అది ఎక్కడ ఉందొ ముందు వెతకాలి, ఆ తరువాత దానిని మన చేతికి ఎలా చేజిక్కుంచుకోవలో మార్గం కనుగొనాలి.  

అన్ని పైన చెప్పినట్టే చేసి ముందుకు పోయిన ఫలితం లేదు, అలాగే దాని వలన కలిగిన బాధ తప్పదు. దీనికి నేను ఏకీభవించినప్పటికీ, ఇక్కడ బాధపడటం సంతోషమర్గాన్ని వెతుక్కోవడమే మిన్న. ఈ  సందర్భంలో కూడా నేను 'సిరివెన్నల' గారి పాటను గుర్తుచేయకుండా ఉండలేకపోతున్నాను.
"ఎండలను దండిస్తామా, వానలను నిందిస్తామా 
చలినేతో తరిమేస్తామా ఛీ పోమ్మని 
కస్సుమని కలహిస్తమా, ఉస్సురని విలపిస్తామా 
రోజులతో రాజీపడమా సర్లేమ్మనీ, సాటి మనుషులతో 
 మాత్రం సాగానని ఎందుకు పంతం.. ఎక్కిల్లె ఏడుస్తుంటే 
                                                     కష్టం పోతుందా మరెందుకు గోలా, అయ్యొయ్య పాపం 
                                                     అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాలా... "
రాజీ పడటం కన్నా ఉత్తమమైన మార్గం  ఇంకొకటి లేదు, దీనినే కొంత మద్ది సర్దుకుపోవడం లేదా అర్ధం చేసుకోవడం అంటారు. అందుకే మనల్ని మనం ప్రశ్నించుకొందాం, మన తప్పులను మనమే సరిదిద్దుకొందాం, మన సమస్యలకు మనమే మార్గం వెతుక్కొందాం. ఒకవేళ మనమే ఇంకొకరికి బదులు ఇవ్వాల్సిన సమయం వస్తే అబద్దం మాత్రం చెప్పకుండా  ఉండటమే మంచిది .... 

Sunday, April 6, 2014

నీ వల్లే... నీ వల్లే ....

అన్నవరం సినిమా లో ఒక పాట ఉంది " నీ వల్లే ... నీ వల్లే... నీ వల్లే ... నీ వల్లే... నా గుండెలలో దడ దడలే నీ వల్లే....". ఈ పాట  నన్ను చాలా ఆలోచింప చేసింది.  ఎందుకంటే మనం చేసే తప్పులు బట్టి మనకు కోపం లేదా భయం కలగదు కానీ ఎదుటవారు ఎవరైనా మనకు నచ్చని పని చేస్తే మనకు ఎక్కడా లేని కోపం, ఆందోళన  పడతాం. అందుకేనోమో ఒక కుటుంబంలో ఒక తగాదా జరిగితే, ఆ తగాదా ఎందుకు జరిగింది అని అడిగితే అది "నీ వల్లే....." అని ఎదుటవారిని చూపిస్తారు కానీ ఆ తగాదాకు గల మూలకారణం మాత్రం చెప్పరు. ఇలా ఒక ఆఫీసులో తగాదాలు అయినా, ఒక సంస్థలో తగాదాలు అయినా ఏమి జరిగిందని అడిగితే మొదట వినిపించేది   "నీ వల్లే.....". ఇలా ప్రతి మనిషి జీవితంలో జరిగిన తప్పును సరిదిద్దుకోకుండా, ఎదురైనా సమస్యను విశ్లేషించకుండా... అన్నింటికీ ఒకే ఒక సమాధానం " నీ వల్లే.....".  ఏమిటో ఆలోచిస్తే చిత్రమనిపిస్తుంది చివరికి ప్రేమైన .., పగైన.., కోపమైన...., కరుణైన...., పంతమైన..., పట్టుదలైన దానికి కారణం " నీ వల్లే....." అని చెప్పడం అంటే చాలా విడ్డూరం   అనిపించింది. నేను కూడా ఇలానే కొన్ని సార్లు చేసాననిపిస్తుంది అందుకే ఈ బ్లాగ్ ను వ్రాయదలచాను.

మనకు నచ్చినట్టు జరగదనిపిస్తే అది సమస్య, మనం అనుకున్నది జరగకపోతే కోపం, మనకు ఇష్టం లేదు అని తెలిసిన కూడా అదే పనిని చేస్తే చిరాకు ఇలా సందర్భాన్ని బట్టి మనకు భావ ఆవేశాలు కలుగుతాయి. అయితే పైన చెప్పిన ప్రతి సందర్భంలో మన గురించి మన కోణంలో ఆలోచిస్తాం కాని అదే సంఘటనను ఎదుటివారి కోణంలో ఆలోచించం. ఇలా ఆలోచించక పోవడమే అసలు సమస్యకు కారణం. నిజంగా ఆలా ఆలోచించక పోవడమే తప్పు అని చెప్పడానికి కారణం నేను చాల కాలం క్రిందట "పోతురాజు" అనే సినిమా చూసాను. అందులో హీరోకి, విలన్ ల మధ్య గొడవని ముందు విలన్ చెబుతాడు తరువాత అదే గొడవని హీరో చెబుతాడు. విలన్ చెప్పిన విధానం చూస్తే అసలు హీరోనే చెడ్డవాడు అనిపిస్తుంది, తరువాత హీరో చెప్పిన విధానం చూస్తే విలన్ చెడ్డవాడు అనిపిస్తుంది. ఇంతకీ నేను చెప్పవచ్చినిదేమిటంటే ప్రతివాడు సంతోషంగా  ఉండాలనే తపనతో ఏదైనా పనిని చేస్తాడు కాని ఇతరులకు ఇబ్బంది పెట్టాలని కాదు. వాళ్ళు చేసే పనిని మనం సరిగ్గా అర్ధం చేసుకోలేక పోవడమే సమస్యని అనిపిస్తుంది. అసలు అర్ధం చేసుకోవడం అంటే జిడ్డు కృష్ణమూర్తి  చెప్పారు   

"When we talk about understanding, surely it takes place only when the mind listens completely - the mind being your heart, your nerves, your ears - when you give your whole attention to it."
నిజంగా జిడ్డు కృష్ణమూర్తి చెప్పినట్టే మనం ఆలోచిస్తే ఈ లోకంలో ఎవరు తప్పు కాదు, మనం ఎదుటవాళ్ళని సరిగ్గా అర్ధం చేసుకోలేక పోవడమే అసలు కారణం అనిపిస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే అందరి గమ్యం (సంతోషం) ఒక్కటే, అది పొందడానికి వాళ్ళు అనుసరించిన విధానాలు మాత్రమే వేరు. అయితే ఇతరులు చేసే విధానం వలన సంతోషం పొందగలం అని ఎలా నమ్ముతాము అంటే దానికి నేను ఒక మాట చెప్పదలచాను " Life needs Love but Love needs Confidence...." 

ఈ మధ్యన నేను ఒక తత్వవేత్త ప్రసంగం విన్నాను. అందులో అయన ఒక ఉదాహరణ చెప్పాడు. " సమాజంలో ఉన్నత స్తాయిలో ఉన్న ఇద్దరు భార్యభర్తలు రోజు తమ మధ్యన జరిగిన గొడవలు పడలేక, వారు న్యాయస్తానాన్ని ఆశ్రియించారు. ఇలాంటి కేసులలో న్యాయస్తానం ముందుగా మరొకసారి వారిని  ఆత్మ పరిశీలన చేసుకొని మంచి నిర్ణయం తీసుకొనేందుకు వీలుగా ఒక మానసిక నిపుణుడు దగ్గరకి పంపారు. ఆ మానసిక నిపుణుడు ఇలాంటి సమస్యలకు సరియిన సమాధానం ఇచ్చి వారికి మంచి ఆలోచనతో ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచిన మానసిక నిపుణుడు దగ్గరకి ఈ కేసుని అప్పగించారు. భార్యాభర్తలిద్దరూ సమాజంలో ఉన్నత స్తాయిలో ఉన్నవాళ్లు కావడం వలన ఆ మానసిక నిపుణుడు ఎంతో జాగ్రత్తగా ఆలోచించి ఇంకా మీరు విడి విడిగా బ్రతకడం మంచిదని సూచించారు. ఎన్నో కేసులను పరిష్కారం ఆయన ఈ విధంగా స్పందించడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఆ మానసిక నిపుణుడు ఒక వార్త పత్రిక వారు ప్రశ్నించగా అయన ప్రతి ఇద్దరి మధ్య సమస్యకు ఒక సమాధానం ఉంటుంది కానీ ఈ తప్పు నీ వల్లే జరిగిందని అని అనుకునేవారికి మాత్రం ఎప్పటికి వారికీ సమాధానం దొరకదు, వారికీ సంతోషం ఉండదు. "

ప్రాణం ఖరీదు సినిమాలో జాలాది గారు వ్రాసిన ఒక పాట నాకు ఎప్పుడు గుర్తుకు చేసుకుంటాను ఆ పాటలో ఒక చరణం .....
                    " అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే
                     సీమునెత్తురులు పారే తూము ఒక్కటే
                     మేడమిద్దెలో ఉన్నా
                     సెట్టు నీడ తొంగున్నా
                     నిదర ముదర పడినాక పాడె ఒక్కటే
                     వల్లకాడు ఒక్కటే ..... "

పై పాటలో చెప్పినట్లు సంతోషంగా నిద్ర పోయామా లేదా అనేది ముఖ్యం కానీ ఏలాంటి ప్రదేశంలో నిద్రించామన్నది కాదు. అలాగే మనం ఏదీ  ఏమైనప్పటికీ అందరం సంతోషంగా ఉన్నామా? లేదా ? అనేది ముఖ్యం కానీ ఎలా చేసాం? ఎక్కడ చేసాం? ఇవన్ని మనకు అనవసరమే.  

 అందుకే   నేను అనుకుంటాను ఈ లోకంలో ఎవరు తప్పు కాదు, ఇతరులు అనుసరించే విధానాలనే మనం తప్పుగా అనుకుంటాం.  విధానాలు వారి అలవాట్లని బట్టి,  ఆ అలవాట్లు వాళ్ళు పెరిగే వాతావరణం బట్టి వస్తాయి. ఇలా జీవితపు మూలల్లోనికి వెళ్లి ఆలోచిస్తే ఏది తప్పు కాదు. అందుకే ఏదైనా పని చేసేటప్పుడు ఏది మంచి పద్ధతి ఏది చెడ్డ పద్ధతి అని ఆలోచించడం కన్నా ఏది ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందో అని అలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. అయిన మనిషి జీవితమే రెప్పపాటు కాలం అయినప్పుడు ఇంకా ఇందులో తప్పోప్పులను విశ్లేషించుకొని ఇతరులకు దూరంగా ఉండడం కన్నా ప్రేమతో  వారి సంతోషాన్ని కోరుకోవడం మిన్నా. 

Wednesday, January 22, 2014

స్ఫూర్తి...


కీర్తిగాంచిన వారి నోటినుండి  వచ్చిన ప్రతీ మంచి మాట మిగతా వారికి స్పూర్తిని ఇస్తుంది. అందుకే ఆ స్పూర్తినిచ్చిన ప్రతీ మంచి మాట ఆచరిస్తే మనం కొన్ని సార్లు కీర్తిని పొందవచ్చును. అయితే నేను  ఇక్కడ చెప్పదలచుకున్నది స్పూర్తి గురించే కాని కీర్తి గురించి  కాదు. సరిగ్గా సంవత్సరం ముందు  అంటే జనవరి 2013 లో ఒక పుస్తకంలో ఒక భాగం నాకు ఎంతో స్పూర్తినిచ్చింది. ఈ సందర్భంగా ఆ భాగాన్ని మీ ముందు ఉంచదలచాను.
"ఈ లోకంలో ప్రతీ దానికి ఒక వెల ఉంటుంది అది చెల్లించకుండా దానిని మనం పొందలేము. ఉదాహరణకు ఒక సినిమా అయినా ఒక సుందరప్రదేశమైన, ప్రయాణమైన పోటిగా ఆడుతున్నఆటకైనా... ఇలా పూలకో ఒక వెల, పాలకో వెల నిర్ణయించి మన జీవితంలో పొందుతున్న ప్రతీ అనుభూతికి, ఆనందానికి ఎంతో కొంత వెల చెల్లించి వాటిని పొందగలుగు చున్నాం. చివిరికి మనం పొందుతున్న ఆనందానికి కుడా ప్రభుత్వానికి ప్రత్యక్షంగానో పరొక్షంగానో కొంత సుంకాన్ని చెల్లిస్తున్నాం.  



అలాంటప్పుడు ఈ అద్భుతమైన, అందమైన ప్రపంచంలో మనల్ని ఒక అపురూపమైన మనిషిగా  సృష్టించి ఎల్లప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి  కారణమైన దేవుడే  కనక మన ముందు ప్రత్యక్షమై ఇన్ని రోజులు ఈ ప్రపంచంలో జీవించిన దానికి నాకు నువ్వు ఏ మూల్యం చెల్లించగలవు అని అడిగితే మనం ఆ మహా దేవునికి ఏమి చెల్లించగలము..... ?"
 నిజంగానే దేవుడు కనక ప్రత్యక్షమై నన్నే ఆ ప్రశ్న అడిగితే నేను ఏమి ఇవ్వగలను అని ఆలోచించడం మొదలుపెట్టాను ముందు నాకు ఆశ్చర్యం వేసింది ఇలాంటి ప్రశ్నను నా మనసుకి సంధించుకున్నందుకు, తరువాత బాధ వేసింది నా దగ్గర సమాధానం లేనందుకు, అయిన నేను ఎప్పుడు ఇంకా దేవుడు దయలేదు ఇంకా నేను అనుకున్నట్లు జరగలేదు అని తిరిగి దేవుణ్ణి నిందిస్తూ ఉంటాను. చివరకు ఆ పుస్తకంలో చదవడం ప్రారంభించాను అందులో వ్యాసకర్త మాత్రం ఒక మంచి మాటను చెప్పి ముగించాడు. ఆ మాట " మనం దేవునికి తిరిగి ఏమి ఇవ్వనవసరం లేదు కానీ ఒక రోజు ఈ ప్రపంచంలో ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి ఒక మంచి పని చేస్తే చాలు ". ఇది చదివాకా చాలా సంతోషం వేసింది. ఇక నేను కూడా రోజుకొక మంచి పని చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడో పుస్తకంలో చదివిన మాట గుర్తుకు వచ్చింది. 
" నేను ఈ రోజు ఈ మనిషికి ఎంతో కొంత నేర్పగలిగాను లేదా ఏదో ఒక మంచి పని చేశాను అని పిల్లలకు చెప్పకుండా నిద్రపొవద్దు ..... "   - చార్లెస్ కింగ్స్ ల్ 

ఏదో ఒక మంచి పని చేయాలని ఉద్దేశ్యంతో ముందుకు సాగాను, వారం రోజులు గడిచాయి ... తరువాత ఇంకో వారం రోజులు గడిచాయి ... అయిన నేను ఎలాంటి మంచి పని చేయలేకపోయాను. అప్పుడు అనుకున్నాను పైన చెప్పిన మాట ఆలోచనకి బాగుంది కాని ఆచరణలో కష్టం అని అర్ధం అయ్యింది. ఇలా నేను ఏమి చేయలేనని తలచి,  అవకాశం వచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుంటాను అని మనసు మార్చుకొని అలాగే రోజుకి ఒక మంచి వాక్యం నేర్చుకుందామని నిశ్చయించుకొని అప్పటినుండి డైరీలో వ్రాయడం మొదలుపెట్టాను. అయితే సంవత్సరం పొడుగునా నేను 30 నుండి 40 వాక్యాలని మాత్రమే నా డైరీలో వ్రాయగలిగాను. 

ఇలా ఈ అలచోనలతో సంవత్సరం అంతా ముందుకు సాగి  చివరిలో ఒక ఆలోచనతో వచ్చాను. పైన చెప్పిన మాటలు అమలు చేయడం అసాధ్యం అని తలచి మంచి పని చేయలేకపోయిన ఒక మంచి వ్యక్తిగా మెలగడానికి ఈ క్రింది నిర్ణయం తీసుకొన్నాను 
" నా ప్రేమ వలన ఇంకొకరికి ఇబ్బంది కలగకూడదు 
   అలాగే నా కోపం వలన ఇంకోకరు  బాధ పడకూడదు ..... "
మనం చూపే ప్రేమ వలన ఎదుటవారు వారి స్వేచ్చను కోల్పోకూడదు, అలాగే మనకు నచ్చని పనిని చేసేటప్పుడు కోపాన్ని ప్రదర్శించ కూడదు తప్పుడు పని చేసేటప్పుడు మాత్రం కోపాన్ని ప్రదర్శించాలి.  
చివిరగా నేను ఒక మాట చెప్పి ముగించాలి అనుకుంటున్నాను " మనం చేసే పని కీర్తి కోసం కాదు కేవలం స్ఫూర్తి కోసం మాత్రమే అని నేను ముందే చెప్పాను, మరి ఆ స్ఫూర్తి ఎవరికీ యివ్వాలి అంటే మన పిల్లలకు లేదా మన భావి తరాలు వారికి. నేను ఇలా చెప్పడానికి కారణం ఈ క్రింద మాట నాకు ఎప్పుడు స్పూర్తినిస్తుంది కాబట్టి .... 
" నిలకడైన జీవితానికి అర్ధం వృత్తిలో గెలుపు కాదు, మన పిల్లలను విలువలతో తీర్చిదిద్దడంలో ఉందని నాకు 25 ఏళ్ళ ముందు నాకు చెప్పుంటే బాగుండునని తలస్తున్నాను.... " - రబ్బీ హరోల్డ్ కుషనర్