Tuesday, July 29, 2014

బదులు దొరకదే....?


 బదులు  అంటే సమాధానం లేదా జవాబు. ప్రతి మనిషి జీవితంలో జవాబు దొరకని ప్రశ్నలు ఎన్నో ఉంటాయి, వాటినే సమస్యలుగా మనిషి ఉహించుకుంటాడు. అలాగే మనతో నిత్యం కలిసుండే కుటుంబ సభ్యులు, సహచరులు మరియు మిత్రులు మనతో కొన్ని సందర్భాలలో అనుకూలంగా ప్రవర్తించక పోవచ్చు లేదా మనల్ని దూరంగా ఉంచవచ్చు. అప్పుడు మనం బాగా ఆలోచిస్తాం నా వాళ్ళని అనుకునేవాళ్లు నాపట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు. అలాగే నాకే ఎందుకిలా ఎప్పుడూ జరుగుతుందని అనుకుంటాం. ఒక వేల సమయం సందర్భం కుదిరితే కొన్నిసార్లు  ప్రశ్నిస్తాం కుడా. అయితే  వాళ్ళు మన మనస్సుకి నచ్చని  సమాధానం చెబితే  వాళ్లకి బాగా పొగరు అని అనుకుంటాం అదే అసలు సమాధానమే చెప్పకపోతే వాళ్ళని శత్రువులుగా అనుకుంటాం. నిజానికి ఇలాంటి  సందర్భాలలో  సమాధానం దొరకలేదని మీరు గోడకేసి తల బాదుకున్న మన తలనుండి రక్తం కారడం మొదలుపెట్టవచ్చు కానీ ఆ గోడ ఎప్పటికి విరిగి మీకు దారినివ్వదు. చాల కుటుంబాలలో ఆలుమొగలు మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ సమధానం ఉండదు. సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నామంటే ఇంకో వాదాన్ని మనం బలంగా ఎదుటవారికి చేపుతున్నట్టే అని ఉహించుకుంటాం .అసలు నిజంగా సమాధానం ఎవరికీ అవసరం?, మరి దాని నిమిత్తం ఎవరు వెతకాలి ? ఎవరు ప్రయాసపడాలి? అని ఆలోచిస్తే మనం ఎప్పుడు ఎదుటవారి నుండే దానిని కోరుకుంటాం మరల మనం మనకు సమాధానం దొరకలేదని బాధపడతాం. కాని వాస్తవానికి ప్రశ్న ఎక్కడుందో అక్కడే సమాధానం ఉంటుందని నా భావన.

నా జీవితంలో కుడా ఇలాంటి సందర్భాలు చాలా  ఉన్నాయి. అయితే మనకు ఎదురయ్యే ప్రశ్నలేదా మనం అడిగే ప్రశ్నలకు  సమాధానం లేకపోయినా పరవాలేదు కానీ అది సరైన  ప్రశ్న  అవునో కాదో అని మాత్రం మనం ఆలోచిస్తే మనకు సగం బాధలు తీరినట్టే. ఎందుకంటే నేను చాల సార్లు సరిగ్గా ఆలోచించ లేకపోయాను. ఉదాహరణకు నాకు సముద్ర తీరంలో ఉండటం అంటే నాకు చాల ఇష్టం. అందుకే నేను వైజాగ్ వెళ్ళినప్పుడల్లా నేను వైజాగ్ లో నేను ఎందుకు పుట్టలేదా? అని అనుకునేవాడిని. అలాగే తరువాత మా ఊరు వచ్చకా అయ్యో! మా ఊరికి సముద్ర తీరం ఎందుకు లేదు? అని  అనుకునేవాడిని. ఇలా చాలా సార్లు సమాధానం లేని నిరుపయోగమైన ప్రశ్నలను సందించుకొని అనవసరంగా బాధ పడుతుంటాం. ఇలాగే ఒక మునీశ్వరుడి దగ్గరకు ఒక శిష్యుడు వచ్చి " గురువుగారు మంచి వాళ్ళకే ఎందుకు చెడు జరుగుతుంది?" అని అడిగాడట. దానికి ఆ గురువు ఆ ప్రశ్నకి సమాధానం చెబుతూ " ఆ ప్రశ్నే తప్పుగా ఉన్నప్పుడు దానికి నేను జవాబు చెప్పాలని ఎలా అనుకుంటావు. అసలు నీ ప్రశ్న ఇలా ఉండాల్సింది " మంచి వాళ్ళకి చెడు జరిగితే ఏమవుతుంది?, దానికి నేనిచ్చే జవాబు " వాళ్ళు ఇంకా మెరుగైన వాళ్ళల తయారవుతారు" అని ఆ మునీశ్వరుడు చెప్పాడట. అందుకే మన జీవితంలో ఎప్పుడు కూడా సరైన ప్రశ్నలతోనే ముందుకు సాగితే సమాధానాలు దొరకక పోయిన కొత్త సమస్యలు మాత్రం రాకుండా ఉంటాయి.
నేను ABN లో 'సిరివెన్నల' గారితో ముఖా ముఖి చుసాను. అయన చిన్నతనం నుండి ఎక్కువుగా తనని తను ప్రశ్నించుకోనేవారట. అందుకే ఆయన రాసిన పాటలు చాలా  మందిని ప్రశ్నించే నట్టే ఉంటాయి. 'కొత్త బంగారులోకం' లో రాసిన ఈ పాట చూడండి
   
         నీ ప్రశ్నలు నీవే ఎవ్వరు బదులివ్వారుగా .... 
         నీ చిక్కులు నీవే ఎవ్వరు విడిపించారుగా .... 
         ఏ గాలో నిన్ను నిన్ను తరుముతుంటే అల్లరిగా... 
         ఆ గాలో లేదో తెలియదంటే చెల్లదుగా....  

  పైన చెప్పినట్టు మన జవాబు కోసం  ఇంకొకరు స్పందించారు. అందుకే నేను అనుకుంటాను  ఏ సమస్యకైన సమాధానం మన అంతరాలాలో నిక్షిప్తమై ఉంటుంది దానిని వెలికితీసే ప్రయత్నమే తెలియక ఈ సమస్యలు. అంటే మామిడి చెట్టు క్రింద నిల్చొని నారింజ పండు కావాలంటే దొరకదు. అందుకే ఏ పండు (సమాధానం) కావాలో మనకు తెలిసినప్పుడు అది ఎక్కడ ఉందొ ముందు వెతకాలి, ఆ తరువాత దానిని మన చేతికి ఎలా చేజిక్కుంచుకోవలో మార్గం కనుగొనాలి.  

అన్ని పైన చెప్పినట్టే చేసి ముందుకు పోయిన ఫలితం లేదు, అలాగే దాని వలన కలిగిన బాధ తప్పదు. దీనికి నేను ఏకీభవించినప్పటికీ, ఇక్కడ బాధపడటం సంతోషమర్గాన్ని వెతుక్కోవడమే మిన్న. ఈ  సందర్భంలో కూడా నేను 'సిరివెన్నల' గారి పాటను గుర్తుచేయకుండా ఉండలేకపోతున్నాను.
"ఎండలను దండిస్తామా, వానలను నిందిస్తామా 
చలినేతో తరిమేస్తామా ఛీ పోమ్మని 
కస్సుమని కలహిస్తమా, ఉస్సురని విలపిస్తామా 
రోజులతో రాజీపడమా సర్లేమ్మనీ, సాటి మనుషులతో 
 మాత్రం సాగానని ఎందుకు పంతం.. ఎక్కిల్లె ఏడుస్తుంటే 
                                                     కష్టం పోతుందా మరెందుకు గోలా, అయ్యొయ్య పాపం 
                                                     అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాలా... "
రాజీ పడటం కన్నా ఉత్తమమైన మార్గం  ఇంకొకటి లేదు, దీనినే కొంత మద్ది సర్దుకుపోవడం లేదా అర్ధం చేసుకోవడం అంటారు. అందుకే మనల్ని మనం ప్రశ్నించుకొందాం, మన తప్పులను మనమే సరిదిద్దుకొందాం, మన సమస్యలకు మనమే మార్గం వెతుక్కొందాం. ఒకవేళ మనమే ఇంకొకరికి బదులు ఇవ్వాల్సిన సమయం వస్తే అబద్దం మాత్రం చెప్పకుండా  ఉండటమే మంచిది .... 

Sunday, April 6, 2014

నీ వల్లే... నీ వల్లే ....

అన్నవరం సినిమా లో ఒక పాట ఉంది " నీ వల్లే ... నీ వల్లే... నీ వల్లే ... నీ వల్లే... నా గుండెలలో దడ దడలే నీ వల్లే....". ఈ పాట  నన్ను చాలా ఆలోచింప చేసింది.  ఎందుకంటే మనం చేసే తప్పులు బట్టి మనకు కోపం లేదా భయం కలగదు కానీ ఎదుటవారు ఎవరైనా మనకు నచ్చని పని చేస్తే మనకు ఎక్కడా లేని కోపం, ఆందోళన  పడతాం. అందుకేనోమో ఒక కుటుంబంలో ఒక తగాదా జరిగితే, ఆ తగాదా ఎందుకు జరిగింది అని అడిగితే అది "నీ వల్లే....." అని ఎదుటవారిని చూపిస్తారు కానీ ఆ తగాదాకు గల మూలకారణం మాత్రం చెప్పరు. ఇలా ఒక ఆఫీసులో తగాదాలు అయినా, ఒక సంస్థలో తగాదాలు అయినా ఏమి జరిగిందని అడిగితే మొదట వినిపించేది   "నీ వల్లే.....". ఇలా ప్రతి మనిషి జీవితంలో జరిగిన తప్పును సరిదిద్దుకోకుండా, ఎదురైనా సమస్యను విశ్లేషించకుండా... అన్నింటికీ ఒకే ఒక సమాధానం " నీ వల్లే.....".  ఏమిటో ఆలోచిస్తే చిత్రమనిపిస్తుంది చివరికి ప్రేమైన .., పగైన.., కోపమైన...., కరుణైన...., పంతమైన..., పట్టుదలైన దానికి కారణం " నీ వల్లే....." అని చెప్పడం అంటే చాలా విడ్డూరం   అనిపించింది. నేను కూడా ఇలానే కొన్ని సార్లు చేసాననిపిస్తుంది అందుకే ఈ బ్లాగ్ ను వ్రాయదలచాను.

మనకు నచ్చినట్టు జరగదనిపిస్తే అది సమస్య, మనం అనుకున్నది జరగకపోతే కోపం, మనకు ఇష్టం లేదు అని తెలిసిన కూడా అదే పనిని చేస్తే చిరాకు ఇలా సందర్భాన్ని బట్టి మనకు భావ ఆవేశాలు కలుగుతాయి. అయితే పైన చెప్పిన ప్రతి సందర్భంలో మన గురించి మన కోణంలో ఆలోచిస్తాం కాని అదే సంఘటనను ఎదుటివారి కోణంలో ఆలోచించం. ఇలా ఆలోచించక పోవడమే అసలు సమస్యకు కారణం. నిజంగా ఆలా ఆలోచించక పోవడమే తప్పు అని చెప్పడానికి కారణం నేను చాల కాలం క్రిందట "పోతురాజు" అనే సినిమా చూసాను. అందులో హీరోకి, విలన్ ల మధ్య గొడవని ముందు విలన్ చెబుతాడు తరువాత అదే గొడవని హీరో చెబుతాడు. విలన్ చెప్పిన విధానం చూస్తే అసలు హీరోనే చెడ్డవాడు అనిపిస్తుంది, తరువాత హీరో చెప్పిన విధానం చూస్తే విలన్ చెడ్డవాడు అనిపిస్తుంది. ఇంతకీ నేను చెప్పవచ్చినిదేమిటంటే ప్రతివాడు సంతోషంగా  ఉండాలనే తపనతో ఏదైనా పనిని చేస్తాడు కాని ఇతరులకు ఇబ్బంది పెట్టాలని కాదు. వాళ్ళు చేసే పనిని మనం సరిగ్గా అర్ధం చేసుకోలేక పోవడమే సమస్యని అనిపిస్తుంది. అసలు అర్ధం చేసుకోవడం అంటే జిడ్డు కృష్ణమూర్తి  చెప్పారు   

"When we talk about understanding, surely it takes place only when the mind listens completely - the mind being your heart, your nerves, your ears - when you give your whole attention to it."
నిజంగా జిడ్డు కృష్ణమూర్తి చెప్పినట్టే మనం ఆలోచిస్తే ఈ లోకంలో ఎవరు తప్పు కాదు, మనం ఎదుటవాళ్ళని సరిగ్గా అర్ధం చేసుకోలేక పోవడమే అసలు కారణం అనిపిస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే అందరి గమ్యం (సంతోషం) ఒక్కటే, అది పొందడానికి వాళ్ళు అనుసరించిన విధానాలు మాత్రమే వేరు. అయితే ఇతరులు చేసే విధానం వలన సంతోషం పొందగలం అని ఎలా నమ్ముతాము అంటే దానికి నేను ఒక మాట చెప్పదలచాను " Life needs Love but Love needs Confidence...." 

ఈ మధ్యన నేను ఒక తత్వవేత్త ప్రసంగం విన్నాను. అందులో అయన ఒక ఉదాహరణ చెప్పాడు. " సమాజంలో ఉన్నత స్తాయిలో ఉన్న ఇద్దరు భార్యభర్తలు రోజు తమ మధ్యన జరిగిన గొడవలు పడలేక, వారు న్యాయస్తానాన్ని ఆశ్రియించారు. ఇలాంటి కేసులలో న్యాయస్తానం ముందుగా మరొకసారి వారిని  ఆత్మ పరిశీలన చేసుకొని మంచి నిర్ణయం తీసుకొనేందుకు వీలుగా ఒక మానసిక నిపుణుడు దగ్గరకి పంపారు. ఆ మానసిక నిపుణుడు ఇలాంటి సమస్యలకు సరియిన సమాధానం ఇచ్చి వారికి మంచి ఆలోచనతో ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచిన మానసిక నిపుణుడు దగ్గరకి ఈ కేసుని అప్పగించారు. భార్యాభర్తలిద్దరూ సమాజంలో ఉన్నత స్తాయిలో ఉన్నవాళ్లు కావడం వలన ఆ మానసిక నిపుణుడు ఎంతో జాగ్రత్తగా ఆలోచించి ఇంకా మీరు విడి విడిగా బ్రతకడం మంచిదని సూచించారు. ఎన్నో కేసులను పరిష్కారం ఆయన ఈ విధంగా స్పందించడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఆ మానసిక నిపుణుడు ఒక వార్త పత్రిక వారు ప్రశ్నించగా అయన ప్రతి ఇద్దరి మధ్య సమస్యకు ఒక సమాధానం ఉంటుంది కానీ ఈ తప్పు నీ వల్లే జరిగిందని అని అనుకునేవారికి మాత్రం ఎప్పటికి వారికీ సమాధానం దొరకదు, వారికీ సంతోషం ఉండదు. "

ప్రాణం ఖరీదు సినిమాలో జాలాది గారు వ్రాసిన ఒక పాట నాకు ఎప్పుడు గుర్తుకు చేసుకుంటాను ఆ పాటలో ఒక చరణం .....
                    " అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే
                     సీమునెత్తురులు పారే తూము ఒక్కటే
                     మేడమిద్దెలో ఉన్నా
                     సెట్టు నీడ తొంగున్నా
                     నిదర ముదర పడినాక పాడె ఒక్కటే
                     వల్లకాడు ఒక్కటే ..... "

పై పాటలో చెప్పినట్లు సంతోషంగా నిద్ర పోయామా లేదా అనేది ముఖ్యం కానీ ఏలాంటి ప్రదేశంలో నిద్రించామన్నది కాదు. అలాగే మనం ఏదీ  ఏమైనప్పటికీ అందరం సంతోషంగా ఉన్నామా? లేదా ? అనేది ముఖ్యం కానీ ఎలా చేసాం? ఎక్కడ చేసాం? ఇవన్ని మనకు అనవసరమే.  

 అందుకే   నేను అనుకుంటాను ఈ లోకంలో ఎవరు తప్పు కాదు, ఇతరులు అనుసరించే విధానాలనే మనం తప్పుగా అనుకుంటాం.  విధానాలు వారి అలవాట్లని బట్టి,  ఆ అలవాట్లు వాళ్ళు పెరిగే వాతావరణం బట్టి వస్తాయి. ఇలా జీవితపు మూలల్లోనికి వెళ్లి ఆలోచిస్తే ఏది తప్పు కాదు. అందుకే ఏదైనా పని చేసేటప్పుడు ఏది మంచి పద్ధతి ఏది చెడ్డ పద్ధతి అని ఆలోచించడం కన్నా ఏది ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందో అని అలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. అయిన మనిషి జీవితమే రెప్పపాటు కాలం అయినప్పుడు ఇంకా ఇందులో తప్పోప్పులను విశ్లేషించుకొని ఇతరులకు దూరంగా ఉండడం కన్నా ప్రేమతో  వారి సంతోషాన్ని కోరుకోవడం మిన్నా. 

Wednesday, January 22, 2014

స్ఫూర్తి...


కీర్తిగాంచిన వారి నోటినుండి  వచ్చిన ప్రతీ మంచి మాట మిగతా వారికి స్పూర్తిని ఇస్తుంది. అందుకే ఆ స్పూర్తినిచ్చిన ప్రతీ మంచి మాట ఆచరిస్తే మనం కొన్ని సార్లు కీర్తిని పొందవచ్చును. అయితే నేను  ఇక్కడ చెప్పదలచుకున్నది స్పూర్తి గురించే కాని కీర్తి గురించి  కాదు. సరిగ్గా సంవత్సరం ముందు  అంటే జనవరి 2013 లో ఒక పుస్తకంలో ఒక భాగం నాకు ఎంతో స్పూర్తినిచ్చింది. ఈ సందర్భంగా ఆ భాగాన్ని మీ ముందు ఉంచదలచాను.
"ఈ లోకంలో ప్రతీ దానికి ఒక వెల ఉంటుంది అది చెల్లించకుండా దానిని మనం పొందలేము. ఉదాహరణకు ఒక సినిమా అయినా ఒక సుందరప్రదేశమైన, ప్రయాణమైన పోటిగా ఆడుతున్నఆటకైనా... ఇలా పూలకో ఒక వెల, పాలకో వెల నిర్ణయించి మన జీవితంలో పొందుతున్న ప్రతీ అనుభూతికి, ఆనందానికి ఎంతో కొంత వెల చెల్లించి వాటిని పొందగలుగు చున్నాం. చివిరికి మనం పొందుతున్న ఆనందానికి కుడా ప్రభుత్వానికి ప్రత్యక్షంగానో పరొక్షంగానో కొంత సుంకాన్ని చెల్లిస్తున్నాం.  



అలాంటప్పుడు ఈ అద్భుతమైన, అందమైన ప్రపంచంలో మనల్ని ఒక అపురూపమైన మనిషిగా  సృష్టించి ఎల్లప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి  కారణమైన దేవుడే  కనక మన ముందు ప్రత్యక్షమై ఇన్ని రోజులు ఈ ప్రపంచంలో జీవించిన దానికి నాకు నువ్వు ఏ మూల్యం చెల్లించగలవు అని అడిగితే మనం ఆ మహా దేవునికి ఏమి చెల్లించగలము..... ?"
 నిజంగానే దేవుడు కనక ప్రత్యక్షమై నన్నే ఆ ప్రశ్న అడిగితే నేను ఏమి ఇవ్వగలను అని ఆలోచించడం మొదలుపెట్టాను ముందు నాకు ఆశ్చర్యం వేసింది ఇలాంటి ప్రశ్నను నా మనసుకి సంధించుకున్నందుకు, తరువాత బాధ వేసింది నా దగ్గర సమాధానం లేనందుకు, అయిన నేను ఎప్పుడు ఇంకా దేవుడు దయలేదు ఇంకా నేను అనుకున్నట్లు జరగలేదు అని తిరిగి దేవుణ్ణి నిందిస్తూ ఉంటాను. చివరకు ఆ పుస్తకంలో చదవడం ప్రారంభించాను అందులో వ్యాసకర్త మాత్రం ఒక మంచి మాటను చెప్పి ముగించాడు. ఆ మాట " మనం దేవునికి తిరిగి ఏమి ఇవ్వనవసరం లేదు కానీ ఒక రోజు ఈ ప్రపంచంలో ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి ఒక మంచి పని చేస్తే చాలు ". ఇది చదివాకా చాలా సంతోషం వేసింది. ఇక నేను కూడా రోజుకొక మంచి పని చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడో పుస్తకంలో చదివిన మాట గుర్తుకు వచ్చింది. 
" నేను ఈ రోజు ఈ మనిషికి ఎంతో కొంత నేర్పగలిగాను లేదా ఏదో ఒక మంచి పని చేశాను అని పిల్లలకు చెప్పకుండా నిద్రపొవద్దు ..... "   - చార్లెస్ కింగ్స్ ల్ 

ఏదో ఒక మంచి పని చేయాలని ఉద్దేశ్యంతో ముందుకు సాగాను, వారం రోజులు గడిచాయి ... తరువాత ఇంకో వారం రోజులు గడిచాయి ... అయిన నేను ఎలాంటి మంచి పని చేయలేకపోయాను. అప్పుడు అనుకున్నాను పైన చెప్పిన మాట ఆలోచనకి బాగుంది కాని ఆచరణలో కష్టం అని అర్ధం అయ్యింది. ఇలా నేను ఏమి చేయలేనని తలచి,  అవకాశం వచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుంటాను అని మనసు మార్చుకొని అలాగే రోజుకి ఒక మంచి వాక్యం నేర్చుకుందామని నిశ్చయించుకొని అప్పటినుండి డైరీలో వ్రాయడం మొదలుపెట్టాను. అయితే సంవత్సరం పొడుగునా నేను 30 నుండి 40 వాక్యాలని మాత్రమే నా డైరీలో వ్రాయగలిగాను. 

ఇలా ఈ అలచోనలతో సంవత్సరం అంతా ముందుకు సాగి  చివరిలో ఒక ఆలోచనతో వచ్చాను. పైన చెప్పిన మాటలు అమలు చేయడం అసాధ్యం అని తలచి మంచి పని చేయలేకపోయిన ఒక మంచి వ్యక్తిగా మెలగడానికి ఈ క్రింది నిర్ణయం తీసుకొన్నాను 
" నా ప్రేమ వలన ఇంకొకరికి ఇబ్బంది కలగకూడదు 
   అలాగే నా కోపం వలన ఇంకోకరు  బాధ పడకూడదు ..... "
మనం చూపే ప్రేమ వలన ఎదుటవారు వారి స్వేచ్చను కోల్పోకూడదు, అలాగే మనకు నచ్చని పనిని చేసేటప్పుడు కోపాన్ని ప్రదర్శించ కూడదు తప్పుడు పని చేసేటప్పుడు మాత్రం కోపాన్ని ప్రదర్శించాలి.  
చివిరగా నేను ఒక మాట చెప్పి ముగించాలి అనుకుంటున్నాను " మనం చేసే పని కీర్తి కోసం కాదు కేవలం స్ఫూర్తి కోసం మాత్రమే అని నేను ముందే చెప్పాను, మరి ఆ స్ఫూర్తి ఎవరికీ యివ్వాలి అంటే మన పిల్లలకు లేదా మన భావి తరాలు వారికి. నేను ఇలా చెప్పడానికి కారణం ఈ క్రింద మాట నాకు ఎప్పుడు స్పూర్తినిస్తుంది కాబట్టి .... 
" నిలకడైన జీవితానికి అర్ధం వృత్తిలో గెలుపు కాదు, మన పిల్లలను విలువలతో తీర్చిదిద్దడంలో ఉందని నాకు 25 ఏళ్ళ ముందు నాకు చెప్పుంటే బాగుండునని తలస్తున్నాను.... " - రబ్బీ హరోల్డ్ కుషనర్