Wednesday, July 17, 2013

ఓటమి...

                   ఓటమి అంటే విజయం వరించకపోవడం అది ఆటలోనైన, బ్రతుకుబాటలోనైన, ఓటమి అంటే చేరుకోవలేకపోవడం అది సరియైన సమయానికి  సరియైన స్థానమైన లేదా గమ్యమైన కావచ్చు, ఓటమి అంటే గెలుచుకోలేకపోవడం అది మనసైన, లేదా మనీ అయినకావచ్చు. అందుకే ఓటమి అంటే మనిషికి ఒక  కష్టం, కష్టంలోంచి  బాధని, బాధలోంచి భయాన్ని, భయంలోంచి భవిష్యత్ని చూస్తాడు, అందుకే ఓటమి వస్తే మని
షి  కృంగిపోతాడు. విజయం రాకపోతే బాధతో మనసు రగిలిపోతుంది, గుండె పగిలిపోతుంది, అందుకే మనిషికి నాకే ఎందుకు ఇలా జరిగిందని కోపం, ఆ కోపంలోనుండి ఆవేదన, ఆ ఆవేదన నుండి ఆవేశం,  ఆ ఆవేశం నుండి ఆక్రోశంతో మనిషి తల్లిడిల్లిపోతాడు. అయితే ఈ మధ్య నేను ఒక మాట చదివా " ఈ శృష్టిలో ఏ తప్పు లేదు, తప్పంతా మన దృష్టిలోనే ఉంది... ".  ఇలా ఆలోచిస్తే ఓటమి వలన గొప్ప బాధ ఉంది, అలాగే గొప్ప భవిష్యత్ ఉంది. ఓటమి వలన భయమూ పెరుగుతుంది, అలాగే మరల ఆ పని చేయడంలో భక్తి పెరుగుతుంది. ఓటమి వలన మనసుకి మధనం ఉంది, ఆలోచిస్తే ఆ మధనం నుండి గొప్ప మధురం ఉంది. అందుకే నేను అనుకుంటాను, ఓటమి వలన మనసుకి ఓర్పు, పనిలో ఒక నేర్పు, జీవన విధానంలో  ఒక మార్పు, ఇలా చివరికి జీవితంలో సంతోషాల కూర్పుతో పాటు మనకు సమాజంలో ఒక మంచి తీర్పుని ఇస్తుంది. ఇలా నేను చెప్పడానికి కారణం నిత్య జీవితంలో జరిగిన సంఘటనలే కారణం, అలాంటి కొన్ని సంఘటనలను నా మాటలలో మీ ముందు ఉంచాలని ఈ బ్లాగ్ సారంశం.
            సాధారణంగా  మనిషికి  ఓటమి ఎన్ని సార్లు ప్రయత్నించిన సఫలం కాలేకపోవడం లేదా సంతోషంగా సాగిపోతున్న జీవితంలో అనుకోని ఆకస్మిక సంఘటన ఎదురుకావడం లేదా ఆనారోగ్యంతో అనుకున్న పనిని సాధించక పోవడంలాంటివి జరుగుతుంటాయి. పై చెప్పిన మూడు సంఘటనలకు నేను చదివిన లేదా నాకు తెలిసిన సంఘటనలు మీ ముందుంచు తున్నాను.


            మొదటగా ఒక ప్రపంచ ప్రఖ్యాత ఫోటో గ్రాఫర్ని ఇంటర్వ్యులో " మీరు ప్రపంచ ప్రాచుర్యం పొందే ఫోటోలను ఎలా తీస్తున్నారు ? అని అడిగితే అయన వినయంగా నేను ఒక ఫోటోని సూమారు 1000 సార్లు తీస్తాను, అంటే నేను ఒక ఫోటో తీయడానికి 999 సార్లు ఓడిపోతాను సమాధానం ఇచ్చారట " ఇక్కడ ఆ ఫోటో గ్రాఫర్ ఫోటోని ఎలా తీయాలో తెలియక 999 సార్లు విఫలమైయుండవచ్చు కాని ప్రయత్నం చేయడంలో ఎప్పుడు అతను విఫలం కాలేదు. అందుకే అంటారు "ఓటమి విజయానికి మొదటి మెట్టు". మనం ఎన్ని సార్లు ఓడితే అన్ని మెట్లు పైకి ఎక్కగలం. ఓటమి కూడా మనిషికి గెలుపువలే ఒక సాధారణం అని గమినించి ఓటమి రావడానికి గల లోపాలను సరి చేసుకొని ముందుకు వెళితే తప్పక ఆ ఓటమి వలన మనలో ఒక మంచి మార్పుని తద్వారా ఒక చిరస్మరణీయమైన గెలుపుని సొంతం చేసుకొనవచ్చును.
       రెండవదిగా సాఫీగా సాగుతున్న జీవితంలో అనుకోని ఆకస్మిక సంఘటన ఎదురైతే మనం ఒక్కసారి మనం కుప్పకూలిపొతాం, అలాగే చేయవలిసిన పనులను వదిలేసి  విచారంతో విలపిస్తూ జీవితాని గడిపేస్తాం. కానీ దీనికి భిన్నంగా ఒక పడతి తన జీవితంలో అనుకోని ఆకస్మిక సంఘటనకి ఎలా స్పందిన్చిందో ఈ సంఘటన చదివితే తెలుస్తుంది.  డిసెంబరు 9, 1979 న అమెరికా లోని ఉత్తర ఫ్లోరిడా రాష్ట్రంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ తల్లి కళ్ళెదుటే తన 18 ఏళ్ళ బిడ్డను ప్రమాదంలో కోల్పోయింది. రోడ్డు దాటుతుండగా 19 ఏళ్ళ డ్రైవర్ తాగిన మైకంలో కారుతో గుద్ది చావుకు కారణమయ్యాడు. ఆమె పేరు Beckie Brown. తన కడుపుకోత వేదనను క్రోధంగా, కన్నీటిగా జార్చలేదు ఆ తల్లి. తాగి వాహనం నడిపే చర్యకు వ్యతిరేకంగా ఒక సంస్థను నెలకొల్పింది. అదే MADD (Mothers Against Drunk Driving). ప్రభుత్వం మీద, వ్యవస్థలో లోపాల మీద, తాగుబోతుల మీద ఒకరకంగా యుద్ధం ప్రకటించింది. ఆమె కారణం గా చట్టాలు మారాయి. మరెన్నో విజయాలతో పాటు ఇప్పటివరకూ 3 లక్షల మంది ప్రాణాలు కాపాడిన ఘనత సొంతం చేసుకుంది. ఎంతగొప్పవిషయం ఇది.. ఒక సాధారణ తల్లి కే ఇంత విజయం సాధ్యమైతే.. అందరం ఆశ్చర్యపోతాం. మెచ్చుకుంటాం.. వీలైతే చేయందిస్తాం..  కానీ అదే స్థానంలో మనం ఉంటె మాధనంతో మంచం పట్టి జీవితాన్ని నిరుపయోగంగా గడిపేస్తాం. అందుకే నేను అనుకుంటాను "గెలుపు రాదనుకోవడం నిరాశ, అలాగే ఎప్పుడు గెలుపు రావాలనుకోవడం దురాశ "



      ఇక మూడవదిగా ఎప్పుడైనా అనారోగ్యం వస్తే ఇక మన జీవితమింతే, మనకు ఇలానే రాసిపెట్టి ఉన్నాదని బాధపడుతూ కాలాన్ని గడిపేస్తాం. కానీ జీన్ - డామినిక్ బాబి కధ చదవండి " ఈయన పారిస్ లో ఎల్లె మ్యాగజిన్ కు ముఖ్య సంపాదకుడుగా ఉండేవాడు. ఒక రోజు అతని కొడుకుని కారులో ఊర్లో తిప్పుతుంటే, ఉన్నట్టుండి తీవ్రంగా గుండెపోటు వచ్చి తన కారు వెనుక సీటులో పడిపోయాడు. ఇలా మొత్తానికి అయన మూడు వారల తరువాత కొమలోంచి కోలుకున్నాడు కాని మాట పడిపోయింది, దాదాపు చెవిటి వాడయ్యాడు, చివరికి పక్షవాతం కూడా వచ్చి, తని శరీరంలో ఏ భాగం కూడా కదపలేడు ఒక్క ఎడమ కనురెప్ప తప్ప. అతనికి అంతులేని ఆశ, సానుకూల భావం, ఏదో ప్రత్యేకంగా చేయాలన్న గట్టి పట్టుదల ఉండేది. అందుకని జీన్ - డామినిక్ కదలలేకపోయినా, ఒక పుస్తకం రాసే మార్గాన్ని వెతుక్కోవాలని అనుకున్నాడు. తద్వారా దుఃఖం నుండి తను నేర్చుకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచాలని అనుకున్నాడు. చివిరికి తన ఆసుపత్రి గదిలో ఒక సంపాదకుడిని రోజుకి మూడు గంటలు కూర్చుండబెట్టుకొని, తన కనురెప్పల కదిలిక సంఖ్యని బట్టి అక్షరాలన్ని నిర్దేశిస్తూ ఒక పుస్తకం రాసాడట. పేపరు కధనం ప్రకారం 137 పేజీల పుస్తకాన్ని తయారు చేయటానికి  జీన్ - డామినిక్ 200000 సార్లకన్నా ఎక్కువే ఆడించి ఉంటాడని పేర్కొంది." ఇది నిజంగా నన్ను కదిలించిన ఉదాహరణ. ఆలోచిస్తే అనిపిస్తుంది "ఓటమి ఎప్పుడు జీవితానికి ముగింపు కాదు, విజయం ఎప్పుడు ఆ జీవితానికి గమ్యం కాదు". అందుకే మనిషి నిత్యమూ పోరాడుతూ అందులో ఓడుతూ పోతే గెలుపు తనంతట తానే మనల్ని వరిస్తుంది. ఎందుకంటే " గెలుపు గురించి అతిగా ఆలోచించనవసరం లేదు కానీ వచ్చిన అవకాశం మాత్రం సద్వినియోగం చేసుకుంటే మనం గెలుపు కోసం ప్రయత్నం చేసినట్లే "  

 అందుకే అందరు కూచొని ఆపదలు చూసేచోటే మనం అవకాశం వెదుక్కోవాలి, అందరు కూచొని దుఃఖించే చోటే మనం ఆశా భావం కలిగి ఉండాలి, అందురూ చీకటిని చూసే చోటే మనం వెలుగుని చూడగలగాలి. అప్పుడే మనకు కష్టం కూడా ఇష్టంగా ఉంటుంది, సమస్యల్లో కూడా సంతోషంగా ముందుకు సాగిపోతాం, బాధలలో కూడా ధైర్యంగా భవిష్యత్ గురించి ఆలోచించగలం. చివిరిగా నేను ఒక సినిమాలో మాట చెప్పి ముగిస్తాను" గెలుపులో ఏముందిరా...? మహా అయితే నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది, అదే ఒక్కసారి ఓడిపోయి చూడు... ప్రపంచం అంటే ఏమిటో నీకు పరిచయం చేస్తుంది."