Friday, October 19, 2012

పెళ్ళి ...


 నేను చిన్నతనంలో ఈ పాటను చాలా ఎక్కువగా వినేవాడిని " పెళ్ళంటే  పందిళ్ళు.. సందడులు,  తప్పిట్లు.. తాళాలు తలంబ్రాలు మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిపితే నూరేళ్ళు..." అందుకేనోమో నేను చిన్నతనంలో పెళ్ళంటే ఆ పాటలాగా పందిళ్ళు...సందడలు అనేకునేవాడిని. సరే మరి నాకు వయసొచ్చింది, అది నా మనసుకి తెలిసొచ్చింది అప్పుడు నా ఊహలకీ పెళ్ళంటే "పెళ్ళంటే ఒక పవిత్రత, పందిరిలో పదిమంది పెద్దల సమక్షంలో పట్టు వస్త్రాలతో, పసుపుతాడు ముడులేసి, పచ్చని కాపురానికి ఆహ్వానం పలికే సమయం.  పెళ్ళనేది జీవితంలో ఒక మధురఘట్టం, భార్యా భర్తలుగా  ముడి వేసిన  చట్టం, ఆలుమగలుగా అల్లుకుపోయే ఒక ఆనంద లోకం, ఆ ప్రపంచంలో పరులు కనిపించరు...పరులున్న ప్రపంచం వీళ్ళకి కనిపించదు". 
             నాకు మూడు పదుల వయసొచ్చింది, కానీ పెళ్లి కాలేదు. నా మిత్రులకి పెళ్లి చేసుకొని వారు వాళ్ళ జీవితాలలో ముందుకు సాగరు. వారిని పెళ్లి గురించి వాళ్ళ అభిప్రాయాన్ని అడిగినప్పుడు అందరు ఒకేలా చెప్పకపోయిన అందరు   ఒకే అర్ధం వచ్చేలా చెప్పారు. అది " పెళ్లి అనేది ఒక బస్సు ప్రయాణం లాంటిది. క్రిందున్న ప్రతివాడు బస్సు ఎక్కాలని ప్రయత్నం చేస్తాడు  అదే బస్సులో ఉన్నవాడు కిందకి దిగాలని ప్రయత్నం చేస్తాడు". ఈ మాటలు విన్నాక నాకు చాల విచిత్రం వేసింది. ఒక్క సారి నన్ను నేను వెనిక్కి చూసుకుంటే నేను చిన్నతనంలో పెళ్ళంటే ఒక వేడుక,  సంతోషించడానికి ఒక వేదిక, మొత్తానికి కుటుంబంలో జరిగే ఒక పండగ అనుకునేవాడిని. ఒక యుక్తవయసు వచ్చే సరికి పెళ్ళనేది ఇద్దరి మనసులకి సంబందించినది, కేవలం వాళ్ళది ఒక ప్రపంచం అది అతి అందమైన ప్రపంచం. ఆ ప్రపంచం ఎంతో అందంగా అలంకరించబడిన ప్రపంచం, అందుకే ఇది అంత్యంత సంతోష సమయం, కానీ ఎక్కువ కాలం నిలువదని తరువాత అర్ధం అయ్యింది. ఇక మూడు పదులు వయసొచ్చే సరికి  పెళ్ళంటే రెండు కుటుంబాల కలయిక,  అలాగే రెండు వేరు వేరు ఆలోచనల కలయిక. అందుకే ఒకర్ని ఒకరు అర్ధం చేసుకోవడానికి ఓపిక కావలి, అలాగే సర్దుకు పోవడానికి కొంత కాలం కావలి. కానీ అంతవరకు వేచి చూడని వాళ్ళకి విసుగు...దానివలన పెళ్లి ప్రయాణినికి విరామం ఇచ్చి మద్యలో దిగడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అనిపించింది. 
             ఇప్పటికీ నా మిత్రులు కొంతమంది ఇప్పటికి ఒక మాట చెబుతారు, అది ఏమిటంటే " ఇప్పుడు నీవు సంతోషంగా ఉంటె ఇక కొత్తగా పెళ్లి చేసుకొని కొత్త బాధలు కోరి తెచ్చుకోవడము ఎందుకు ?". అయిన నేను పెళ్లి వైపు అడుగులు వేయడానికి కారణం నాకు పెళ్లి మీద ఒక మంచి అభిప్రాయం ఉండటమే. అయితే నా మిత్రులను తప్పుపట్టాలని కాదు ఎవరి అనుభవాలను బట్టి ఆలోచనలు, వారి ఆలోచనలు బట్టి వారి అభిప్రాయాలు, సిద్ధాంతాలు ఉంటాయి. ఇది ఎవరికైనా నచ్చకపోతే ఇది సిద్ధాంత విభేదన తప్ప ఎవర్ని తప్పు పట్టాలని నా ఉద్దేశ్యం కాదు.

"ప్రాణం ఉన్నదేది ఏకాంతంగా జీవించదు, అలాగే తన కోసమే జీవించదు  - విలియం బ్లేక్"

         ఇలాంటి మాటలు కధలలో వ్రాసుకోవడానికి, సభలలో చెప్పుకోవద్దనికి బాగానే ఉంటాయి, కానీ నిజజీవితంలో ఆచరించడానికి కొంత కష్టమే. అయిన కూడా ఆ వాక్యం రాయడానికి కారణం అది నిత్య సత్యం. సృష్టిలో ఏ మనిషి కూడా  ఒంటరిగా బ్రతకలేడు. అందుకే పెళ్లి లోనే ఉంది అసలు సృష్టి రహస్యం. ఎందుకంటే మనల్నిఎంతో అపురూపంగా పెంచిన తల్లిదండ్రులను మనం వదిలి ఉండలేము. అయితే ఎప్పటికైనా విడిచి వెళ్ళాల్సిందే... పోయినవరితో మనం అంతరించిపోకుండా ప్రతివాడికి ఒక కుటుంబాన్ని దేవుడు సృష్టించాడు, అది పెళ్ళితోనే పూనది వేసాడు. మనిషి అసలు జీవితం పెళ్ళితోనే ప్రారంభం అవుతుందేమో అని అనిపిస్తుంది. పోనీ పెళ్లి చేసుకున్న వచ్చిన వారు మనల్ని సంతోషంగా పెట్టాలి, అలాగే వారుకూడా సంతోషంగా ఉండాలి. అలా సంతోషంగా ఉండాలి అంటే ఒకే ఒక మార్గం నచ్చకపోతే సర్దుకుపోవాలి, తప్పు అయితే సరిదిద్దుకు పోవాలి. ఇరువురి మధ్యన జరిగే ప్రతి గొడవ ఒక గుణపాటమే, ఎదురైనా ప్రతి సమస్య ఇరువురి గెలుపుకి ఒక అవకాశమే. అయిన వేరు వేరు కుటుంబాలలో పెరిగిన వారు, వేరు వేరు ప్రదేశాలలో పెరిగిన వారు, వేరు వేరు పరిస్తితులలో పెరిగిన వారు ఒకే రకమైన భావాలను కానీ, అలవాట్లును కానీ, ఆచారాలను కలిగి ఉండరు. ఎందుకంటే 
                 " కడలి ఒక్కటే....కానీ కెరటాలు అనంతం...
                    తూర్పు ఒక్కటే... కానీ కిరణాలు అనంతం...
                    మనసు ఒక్కటే... కానీ భావాలు అనంతం..."
             
                మనసులు వేరు, అలాగే వారి ఆలోచనలు వేరు, దాని వలన వారి భావాలు వేరువేరుగా ఉండవచ్చు. అయినంత మాత్రాన ఎవరు తప్పుకాదు. కాబట్టి మొదట మాటలు వేరుగా ఉండవచ్చు కానీ ఒకే బాటలో వెళ్ళితే జీవితానికి చేటు రాదు. అలవాట్లు వేరుగా ఉండవచ్చు, కానీ మన జీవిన విధానానికి కొత్త రూట్లుగా భావిస్తే ఇక అగచాట్లు ఉండవు. మనుషులగా ఒక ఇంట్లో ఒక కాపురం చేసిన, మనసులు మాత్రం ఒక ఒంట్లో కాపురం చేస్తే ఆ కాపురంలో ఓటమే ఉండదు. చివిరిగా ఒక్క మాట పెళ్ళంటే సఖ్యత, పవిత్రత, ఒక బాధ్యతని అనుకుంటే జీవితమంతా ఇక ఆనందమే..

Tuesday, October 16, 2012

మంచి...



మంచి అన్నది పంచు మన్న....
చెడు కంచె  అన్నది తుంచు మన్న...
మంచి కుంచెని రంగదీసి...
మనిషి మదిలో మంచి ముగ్గని గీసి...
మంచి లంచం మూటగట్టు...
బ్రతుకు కంచమగును ఒక భాగ్యచెట్టు..
మంచి మల్లెల మాల కట్టు...
పేద బాధల సంకెళ్ళ చెదరగొట్టు...
ఈ 'నా మంచి' మీ మనసులలో వికసించి 
మంచికి మించినది లేదని ప్రపంచానికి 
చాటించి, మంచిని పాటించి, అంచెలంచెలుగా
పురోగమించి, నీలో మంచిని కరగని 
మంచువలె పెంచి తరించండి.





Thursday, October 11, 2012

న్యాయమా...నీవెక్కడ ....?


నింగి నేలలను అడిగా న్యాయమా నీవెక్కడని ...
నవ్వుతుచెప్పాయి... అలాంటి నామమే వినలేదట...
కొండ కోనలకు కబురుపంపి అడిగా...
కలహాలతో కుళ్లిపోయి కంటికి కానరాలేదట...
వాగువంకలతో వంతపాడి అడిగా...
వాన వరదలొచ్చి ఉండలేక వలసపోయిందట...
ఊరుకొని ఉండలేక ఊరూరు వెళ్లి అడిగా...
ఉతలేక ఊబి ఉచ్చులోకి చిక్కికొని పోయిందట...
మనసాగక మనిషి మనిషిని అడిగా...
మంచిమిత్రుడు లేక, తనని కించపరచుకొనలేక మూగపోయిందట..
నాలుగు గోడల మధ్యనున్న న్యాయాన్ని 
నాలుగు దిక్కుల మధ్యన నాటేవారెవరు...?
నీతి నీరు పోసి నేలతల్లి ఒడిలో నిలబెట్టేవారెవరు...?


Monday, October 1, 2012

నా మధనం...


ఓ మనుషులారా...
మానవత్వం లేని మృగాల్లారా ....
మనీ మత్తులో మునిగి తేలుతూ...
మాదీ మాదీ అని మాన్యంను మీ ముని మనవలు వరకు కూడబెట్టి,
మిగుల రోక్కంతో మైసభాలాంటి మేడను కట్టి, 
మాటిమాటికి మందు ముక్కలతో ముచ్చటించి,
మాకు ఎదురు లేదని మీసాలు మెలేసే మగ మహారాజుల్లారా...
మనసులోని మలినలాను మరిచి, మీ ముంగిట 
మధన ముళ్ళతో, మాసిన బ్రతుకులతో నున్న 
మంచి మనసులో మండే మంటలను చుడండి....
మేను పైన ముతక గుడ్డ ముక్క లేక, మొదలు వారి ముద్దు ముచ్చటను   నోచుకోక 
ముష్టి అయిన ముప్పావలా మించక, పొట్ట ఉట్టిని మట్టితో నింపుతున్న
మా మూడేళ్ళ మిత్రులను చుడండి...
మురికి వాడల మార్గాలలో మసలుతూ.. ముక్కి ముక్కిన మెతుకులను 
మూటకట్టుకొని, మింగ లేక మింగుతున్న మా మూడు కాళ్ళ ముదుసలిని చుడండి...
మనీ, మాగాణిలు మనషికి మాయ మకుటం...
మానవత్వ, మమకారాలు మంచి మనసుకి మణి మకుటం...
నా మాటల మసాజ్ మీ మదికివ్వాలి మేలుకొలుపు....
మరి మురికి వాడల, ముష్టి బ్రతుకలలో మెరవాలి మమతల మెరుపు....