Saturday, November 23, 2013

పెద్దల మాట సద్ది మూట


"పెద్దల( తల్లిదండ్రులు ) మాట సద్ది మూట" ఈ మాట చిన్నప్పుడే విన్న ఒక గొప్ప సామెత. అయితే వయసు పెరిగే కొద్ది వృద్ధాప్యం రాకూడదు, పెద్దరికం రావాలి అంటారు. అయితే మరి అలాంటి పెద్దిరికపు మాటలను నేటి పిల్లలు చాదస్తం అని అంటున్నారు . అలాగే పిల్లల కోరికలే పెద్దల సమస్యలు అంటారు, మరి పిల్లల కోరికల పట్ల పెద్దల ఆశక్తి చూపడం లేదు ఎందుకంటే అది తరాలు మధ్య గల అంతరాలు అని అంటున్నారు. మొత్తానికి పెద్దలకి పిల్లలకి మధ్య అంతరాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. వాటి ఫలితమే రోజురోజుకి నేటి సమాజంలో వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి.  అసలు దీనికి మూల కారణం ఏమిటని నేను ఎప్పటి నుండో ఆలోచిస్తున్నాను అయిన నాకు కారణం అంతు చిక్కడం లేదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది " తనని తాను తగ్గించికునేవాడు జీవితంలో హెచ్చించబడతాడు." అలాగే  నేను ఈ మధ్యన విడుదలైన "అత్తారింటికి దారేది" చిత్రంలో ఒక మాట నన్ను బాగా అలోచినంప చేసింది. ఆ మాట " ఎక్కడ నెగ్గాలోకాదురా , ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పవాడు". ఇలాంటి ప్రశ్నలకు కారణాలు అన్వేషించడం కన్నా పిల్లల ఎదుగుదలకు కారకులైన పెద్దలని గౌరవంచడం నిజమైన ప్రేమని అనుకోని ఈ బ్లాగ్ రాయడానికి ముందుకి వెళ్తున్నాను.

నాకు తెలిసి ప్రతీ మనిషి సాధారణంగా పదేళ్ళు వయసు వరకు తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడుపుతారు, పదేళ్ళ నుండి ఇరవై ఏళ్ళ వయసు వరకు ఎక్కువ సమయం స్నేహితులతో గడుపుతారు. ఇరవై ఏళ్ళ నుండి ముప్పై ఏళ్ళ వయసు వరకు ప్రియరాలు తోనే లేదా తన భార్యతోనే ఎక్కువ సమయం గడుపుతారు. ముప్పై ఏళ్ళ నుండి నలబై ఏళ్ళ వరకు తన పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. నలబై నుండి యేభై ఏళ్ళ వరకు తన ఉద్యోగ కార్యకలాపాలతో ఎక్కువ సమయం గడుపుతారు. యేభై ఏళ్ళ నుండి అరవై ఏళ్ళ వరకు పిల్లల పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. ఇంకా మిగిలిన జీవితం ఆధ్యాత్మకంతో గడిపి తనువు చాలిస్తారు. ఇలా ఆలోచిస్తే ప్రతి మనిషి తను ఎదుగుతున్న మొదటి ముప్పై సంవత్సరాలలో మొదటి పది సంవత్సరాలు మాత్రమె తన తల్లిదండ్రులతో గడుపుతాడు. మిగతా కాలం అంతా తన స్నేహితులతోనే అలాగే తనకు కాబోయే భార్యతోనే ఎక్కువ సమయం గడుతాడు. అందుకేనోమో  తల్లిదండ్రులకి పిల్లల యొక్క వ్యక్తితత్వం కాని అలాగే వారి అభిరుచులను అంచనా వేయలేకపోతున్నారేమో అని అనిపిస్తుంది. పిల్లల పదేళ్ళ వయసు వచ్చేసరికి ఒక కంప్యూటర్, పదిహేనేళ్ళ వయసు వచ్చేసరికి ఒక సెల్ ఫోన్, వయసు ఇరవై దాటగానే ఒక మోటార్ బైక్ ఇలా వయసు తగ్గ వసుతులు కల్పిస్తున్నారు కానీ వయసుకి తగ్గట్టు వాళ్ళ మానసిక ఎదుగుదలను, వాళ్ళ అభిరుచులను తల్లిదండ్రులు గమనించడం లేదోమోని నాకు ఎప్పుడు అనిపిస్తుంది.

దీనికి అంతటికి మూల కారణం పదేళ్ల వయసు వరకు నీతికధలు, మానసిక వికాసకధలు చెప్పే తాతయ్య, నాన్నమ్మలు ఇంట్లో ఉండటం లేదు, మనిషి జీవితం అంటే ఇతరులతో కలిసి బ్రతకడం అని అర్ధం చేసుకోవడానికి ఇంట్లో అన్నదమ్ముల పిల్లలతో కలిసి ఉండటం లేదు. అవసరమైన చోట శారీరక శ్రమను తట్టుకొనే శక్తిని అలవాటు పరిచే వ్యాయమ, ఆటలతో విద్యార్ధిని అభివృద్ధి చేసే పాఠశాలలు నేడు లేవు. "మనం ఏది విత్తితే అదే కోస్తాం" అందుకే పిల్లల ముందు చేసే ప్రతిపని, ప్రతి మాట ఎప్పుడు గమనిస్తూనే వాటినుండే పిల్లలు పనిచేయడం, మాట్లాడటం నేర్చుకుంటారు. అందుకే సాధ్యమైనంతవరకు పిల్లల ముందు చెడు మాటలను, చెడు పనులకు దూరంగా ఉండాలి. ఒకవేళ ఎలాంటి తప్పిదాలు జరిగిన అవి చేతిమీద పచ్చబొట్టు వేసినట్లు పసి హృదయాలలో చెరగని ముద్రను వేస్తాయని గుర్తిస్తే పిల్లలకి, తల్లిదండ్రులకి ఇంత దూరం పెరిగి ఉండేవికాదని అనిపిస్తుంది. 

ఇక పిల్లల విషయానికి వస్తే మనకన్నా వయసు మళ్ళిన వాళ్ళని ఎప్పుడు గౌరవించాలని తెలుసు, అయిన నేటితరం వాళ్ళు తమయొక్క తల్లిదండ్రుల విషయంలో కూడా వారు పట్టించుకోకపోవడం చాలా శోచనీయం. ఇలాంటి సమయాల్లో చాలా మంది చెప్పినమాట నాకు తీరిక లేకపోవడం, కానీ దీనికి నేను ఏకీభవించను ఎందుకంటే వారికి తీరిక లేదు అనడం కన్నా వాళ్ళ తల్లిదండ్రుల పట్ల ప్రేమగా వ్యవహరించాలన్నా ఆలోచన లేకపోవడమే అని అనిపిస్తుంది . ప్రతి మనిషికి వృద్ధాప్యం వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి, కాని నేటి తరం పిల్లలు అసలు వృద్ధులనే ఒక సమస్యగా పరిగనించడం వలన నేడు వృద్ధాశ్రమాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. నేను తొమ్మిదవ తరగతిలో ఇంగీష్ ఉపవాచకంలో ఒక పాఠం ఇప్పటికి నాకు బాగా గుర్తు, ఆ పాఠం పేరు నాకు గుర్తు లేదు కానీ, ఆ పాఠం సారాంశాన్ని మాత్రం మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను.
ఒకానొక దేశంలో ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యం చక్రవర్తి ఆకస్మిక మరణం వలన, యువరాజుని ఆ రాజ్యానికి చక్రవర్తిగా పట్టాభిషేకం చేస్తారు. కొద్ది రోజులలో, యవ్వనంలో ఉన్న ఆ చక్రవర్తి దేశంలో అందరు యవ్వనస్తులే ఉండాలి, ఎల్లప్పుడూ ఈ రాజ్యం యవ్వనస్తులతో మంచి ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలని ఆ రాజ్య ప్రజలకి ఆజ్ఞాపించాడు. రాజ్యంలో ఎక్కడైనా ముసలివాళ్ళు కనిపిస్తే వాళ్ళని వెంటనే చంపిస్తానని ఆజ్ఞాపించాడు. దీనితో రాజ్యంలో ఉన్న ప్రజలు భయభ్రాంతులకి లోనై ఎవరింట్లో నున్న ముసలివాళ్ళను ఆ రాజ్యాన్ని దాటించారు. అప్పటినుండి ఆ రాజ్యం అంతా యవ్వనస్తులతో కూడి ఎంతో సంతోషంగా జీవించసాగారు. ఇలా ఒక అయిదు సంవత్సరాలు గడిచిన తరువాత ఆ రాజ్యంలో పెద్ద కరువు వచ్చింది, ఆ రాజ్యంలో ఎక్కడ పంటలు పండలేదు, ఇక తరువాత సంవత్సరం కూడా పంటలు ఎక్కడ పండలేదు. ఇక రాజ్యంలో ఉన్నవాళ్ళు ఎలా బ్రతకాలని మేధోమధనం చేయగా అందులో ఒకరు రాజుగారికి " అయ్యా! ఇంత కరువు కాలంలో కూడా మన రాజ్యంలో ఒకతను మాత్రం పంటలు చక్కగా పండించాడు". మనం అతనిని విచారించి మన రాజ్యంలో ఇక పంటలు ఎలా పండించాలో తెలుసుకుందాం అని వివరించగా, ఆ చక్రవర్తి పంటలు పండించిన యువకుడుని పిలిపించమని తన మహామంత్రికి చెబుతాడు. మొత్తానికి ఆ పంటలు పండించే వ్యక్తిని అడగగా, నేను ఇంత బాగా పంటలు పండించడానికి కారణం నేను నా తండ్రిని నా ఇంట్లో దాచిపెట్టాను. అయన యొక్క అనుభవాల సారంతోనే  నేను పంటలు పండించ గలిగాను అని చెప్పిన తరువాత ఆ చక్రవర్తి తను చేసిన తప్పును తెలుసుకొని మరల ఆ రాజ్యానికి చెందిన ముసలి వాళ్ళందర్నీ మరల వెనుకకు పిలుపించుకొని అందరు కలిసి సంతోషంగా జీవనం సాగించారు.
నేను పై కధనుండి ఒక విషయం మాత్రం నేర్చుకున్నాను. "ప్రతీ యువకలు కొత్త టెక్నాలజీని చాలా సులభంగా నేర్చుకోనగలరు, అదే కొత్త మనుషులతో సత్సంబంధాలు ఏర్పురచు కోవాలంటే మాత్రం కొన్ని సార్లు తడబడుతారు, మనం కొన్ని పనులే చేయాలంటే కొన్ని సార్లు శాస్త్రీయ పద్ధతులను అవలంభించాలి, దీనికి మాత్రం అనుభవం కావలి. అలాంటి అనుభవాలనే మన తల్లిదండ్రులు మనకు ఎప్పుడు చెబుతారు అది వినడానికి కొన్ని సార్లు చాదస్తం కావచ్చు కానీ ఆలోచిస్తే మాత్రం అందులో చాల నేర్చుకోదగ్గ విషయాలు ఉంటాయనేది మాత్రం నగ్నసత్యం"  

నేను చివిరిగా ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను " మనం చిన్నతనంలో ఎంత మారం చేసిన వాళ్ళు ప్రేమతో మనల్ని, మన అల్లర్ని భరిస్తారు అలాగే వాళ్ళు ముసలివాళ్ళు అయిన తరువాత వాళ్ళు చేసిన పనులు, మాటలు మనకు చాదస్తం అనిపించినా మనం కూడా అంతే ప్రేమతో వాళ్ళని ప్రేమించాలి. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే తల్లిదండ్రులకు వృద్ధాప్యం వచ్చేకొద్దీ మన పిల్లలగానే భావిస్తే ప్రతీ ఇల్లు స్వర్గాధామమే....