Sunday, April 6, 2014

నీ వల్లే... నీ వల్లే ....

అన్నవరం సినిమా లో ఒక పాట ఉంది " నీ వల్లే ... నీ వల్లే... నీ వల్లే ... నీ వల్లే... నా గుండెలలో దడ దడలే నీ వల్లే....". ఈ పాట  నన్ను చాలా ఆలోచింప చేసింది.  ఎందుకంటే మనం చేసే తప్పులు బట్టి మనకు కోపం లేదా భయం కలగదు కానీ ఎదుటవారు ఎవరైనా మనకు నచ్చని పని చేస్తే మనకు ఎక్కడా లేని కోపం, ఆందోళన  పడతాం. అందుకేనోమో ఒక కుటుంబంలో ఒక తగాదా జరిగితే, ఆ తగాదా ఎందుకు జరిగింది అని అడిగితే అది "నీ వల్లే....." అని ఎదుటవారిని చూపిస్తారు కానీ ఆ తగాదాకు గల మూలకారణం మాత్రం చెప్పరు. ఇలా ఒక ఆఫీసులో తగాదాలు అయినా, ఒక సంస్థలో తగాదాలు అయినా ఏమి జరిగిందని అడిగితే మొదట వినిపించేది   "నీ వల్లే.....". ఇలా ప్రతి మనిషి జీవితంలో జరిగిన తప్పును సరిదిద్దుకోకుండా, ఎదురైనా సమస్యను విశ్లేషించకుండా... అన్నింటికీ ఒకే ఒక సమాధానం " నీ వల్లే.....".  ఏమిటో ఆలోచిస్తే చిత్రమనిపిస్తుంది చివరికి ప్రేమైన .., పగైన.., కోపమైన...., కరుణైన...., పంతమైన..., పట్టుదలైన దానికి కారణం " నీ వల్లే....." అని చెప్పడం అంటే చాలా విడ్డూరం   అనిపించింది. నేను కూడా ఇలానే కొన్ని సార్లు చేసాననిపిస్తుంది అందుకే ఈ బ్లాగ్ ను వ్రాయదలచాను.

మనకు నచ్చినట్టు జరగదనిపిస్తే అది సమస్య, మనం అనుకున్నది జరగకపోతే కోపం, మనకు ఇష్టం లేదు అని తెలిసిన కూడా అదే పనిని చేస్తే చిరాకు ఇలా సందర్భాన్ని బట్టి మనకు భావ ఆవేశాలు కలుగుతాయి. అయితే పైన చెప్పిన ప్రతి సందర్భంలో మన గురించి మన కోణంలో ఆలోచిస్తాం కాని అదే సంఘటనను ఎదుటివారి కోణంలో ఆలోచించం. ఇలా ఆలోచించక పోవడమే అసలు సమస్యకు కారణం. నిజంగా ఆలా ఆలోచించక పోవడమే తప్పు అని చెప్పడానికి కారణం నేను చాల కాలం క్రిందట "పోతురాజు" అనే సినిమా చూసాను. అందులో హీరోకి, విలన్ ల మధ్య గొడవని ముందు విలన్ చెబుతాడు తరువాత అదే గొడవని హీరో చెబుతాడు. విలన్ చెప్పిన విధానం చూస్తే అసలు హీరోనే చెడ్డవాడు అనిపిస్తుంది, తరువాత హీరో చెప్పిన విధానం చూస్తే విలన్ చెడ్డవాడు అనిపిస్తుంది. ఇంతకీ నేను చెప్పవచ్చినిదేమిటంటే ప్రతివాడు సంతోషంగా  ఉండాలనే తపనతో ఏదైనా పనిని చేస్తాడు కాని ఇతరులకు ఇబ్బంది పెట్టాలని కాదు. వాళ్ళు చేసే పనిని మనం సరిగ్గా అర్ధం చేసుకోలేక పోవడమే సమస్యని అనిపిస్తుంది. అసలు అర్ధం చేసుకోవడం అంటే జిడ్డు కృష్ణమూర్తి  చెప్పారు   

"When we talk about understanding, surely it takes place only when the mind listens completely - the mind being your heart, your nerves, your ears - when you give your whole attention to it."
నిజంగా జిడ్డు కృష్ణమూర్తి చెప్పినట్టే మనం ఆలోచిస్తే ఈ లోకంలో ఎవరు తప్పు కాదు, మనం ఎదుటవాళ్ళని సరిగ్గా అర్ధం చేసుకోలేక పోవడమే అసలు కారణం అనిపిస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే అందరి గమ్యం (సంతోషం) ఒక్కటే, అది పొందడానికి వాళ్ళు అనుసరించిన విధానాలు మాత్రమే వేరు. అయితే ఇతరులు చేసే విధానం వలన సంతోషం పొందగలం అని ఎలా నమ్ముతాము అంటే దానికి నేను ఒక మాట చెప్పదలచాను " Life needs Love but Love needs Confidence...." 

ఈ మధ్యన నేను ఒక తత్వవేత్త ప్రసంగం విన్నాను. అందులో అయన ఒక ఉదాహరణ చెప్పాడు. " సమాజంలో ఉన్నత స్తాయిలో ఉన్న ఇద్దరు భార్యభర్తలు రోజు తమ మధ్యన జరిగిన గొడవలు పడలేక, వారు న్యాయస్తానాన్ని ఆశ్రియించారు. ఇలాంటి కేసులలో న్యాయస్తానం ముందుగా మరొకసారి వారిని  ఆత్మ పరిశీలన చేసుకొని మంచి నిర్ణయం తీసుకొనేందుకు వీలుగా ఒక మానసిక నిపుణుడు దగ్గరకి పంపారు. ఆ మానసిక నిపుణుడు ఇలాంటి సమస్యలకు సరియిన సమాధానం ఇచ్చి వారికి మంచి ఆలోచనతో ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచిన మానసిక నిపుణుడు దగ్గరకి ఈ కేసుని అప్పగించారు. భార్యాభర్తలిద్దరూ సమాజంలో ఉన్నత స్తాయిలో ఉన్నవాళ్లు కావడం వలన ఆ మానసిక నిపుణుడు ఎంతో జాగ్రత్తగా ఆలోచించి ఇంకా మీరు విడి విడిగా బ్రతకడం మంచిదని సూచించారు. ఎన్నో కేసులను పరిష్కారం ఆయన ఈ విధంగా స్పందించడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఆ మానసిక నిపుణుడు ఒక వార్త పత్రిక వారు ప్రశ్నించగా అయన ప్రతి ఇద్దరి మధ్య సమస్యకు ఒక సమాధానం ఉంటుంది కానీ ఈ తప్పు నీ వల్లే జరిగిందని అని అనుకునేవారికి మాత్రం ఎప్పటికి వారికీ సమాధానం దొరకదు, వారికీ సంతోషం ఉండదు. "

ప్రాణం ఖరీదు సినిమాలో జాలాది గారు వ్రాసిన ఒక పాట నాకు ఎప్పుడు గుర్తుకు చేసుకుంటాను ఆ పాటలో ఒక చరణం .....
                    " అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే
                     సీమునెత్తురులు పారే తూము ఒక్కటే
                     మేడమిద్దెలో ఉన్నా
                     సెట్టు నీడ తొంగున్నా
                     నిదర ముదర పడినాక పాడె ఒక్కటే
                     వల్లకాడు ఒక్కటే ..... "

పై పాటలో చెప్పినట్లు సంతోషంగా నిద్ర పోయామా లేదా అనేది ముఖ్యం కానీ ఏలాంటి ప్రదేశంలో నిద్రించామన్నది కాదు. అలాగే మనం ఏదీ  ఏమైనప్పటికీ అందరం సంతోషంగా ఉన్నామా? లేదా ? అనేది ముఖ్యం కానీ ఎలా చేసాం? ఎక్కడ చేసాం? ఇవన్ని మనకు అనవసరమే.  

 అందుకే   నేను అనుకుంటాను ఈ లోకంలో ఎవరు తప్పు కాదు, ఇతరులు అనుసరించే విధానాలనే మనం తప్పుగా అనుకుంటాం.  విధానాలు వారి అలవాట్లని బట్టి,  ఆ అలవాట్లు వాళ్ళు పెరిగే వాతావరణం బట్టి వస్తాయి. ఇలా జీవితపు మూలల్లోనికి వెళ్లి ఆలోచిస్తే ఏది తప్పు కాదు. అందుకే ఏదైనా పని చేసేటప్పుడు ఏది మంచి పద్ధతి ఏది చెడ్డ పద్ధతి అని ఆలోచించడం కన్నా ఏది ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందో అని అలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. అయిన మనిషి జీవితమే రెప్పపాటు కాలం అయినప్పుడు ఇంకా ఇందులో తప్పోప్పులను విశ్లేషించుకొని ఇతరులకు దూరంగా ఉండడం కన్నా ప్రేమతో  వారి సంతోషాన్ని కోరుకోవడం మిన్నా.