Wednesday, September 18, 2013

నా కోపం.... !

 కోపం మీద రాసిన బ్లాగ్ ఇది అంతే కానీ కోపంతో రాసినది కాదు. ఎందుకంటే సంతోషం లేదా బాధ గురించైనా చెప్పవచ్చు అలాగే మనకి ఎదురైనా సమస్య  లేదా మనసులోని సంఘర్షణ గురించైనా చెప్పవచ్చు. కారణం వీటితో మనిషి కొంత కాలం ప్రయాణం చేస్తాడు. అదే కోపం గురించి మాత్రం చెప్పలేము ఎందుకంటే కోపం వచ్చినప్పుడు మనిషి తన అదుపులో తను ఉండలేడు, అందుకే మనిషి జీవితంలో అతి తక్కువ కాలం ఉంటుంది, కాని దానివలన వచ్చిన అనర్ధం అతి ఎక్కువ కాలం ఉంటుంది. అందుకే కోపంతో రాసిన బ్లాగ్ మాత్రం కాదు ఇది, కోపం మీద రాసిన బ్లాగ్ ఇది.  జల్సా సినమా లో మొదటిలో ఒక డైలగ్ ఉంది, అది నన్ను బాగా ఆలోచింపచేసింది.
               " మన దేశంలో లక్ష మందిలో ఒకరికి సొంత బంగ్లా ఉంది... 
                 1000 మందిలో ఒకరికి సొంత కారు ఉంది .... 
                 100 మందిలో ఒకరికి సొంత కంప్యూటర్ ఉంది... 
                 కానీ ప్రతి 10 మందిలో ఇద్దరి దగ్గర తుపాకి కానీ కత్తి కానీ ఉంది... 
                 అంటే ఇక్కడ మనకి బ్రతికే అవకాశం కంటే చచ్చే సౌకర్యం ఎక్కువ..."

పైన చెప్పిన మాటలు ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు కానీ ఈ దేశంలో ఆకలి ఉన్నవాళ్ళకన్నా, ఆయుధాలు ఉన్నవాళ్ళ సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని అనేది మాత్రం వాస్తవం. దీనికి నిదర్శనం తేది 26-08-13 న హైదరాబాద్ SR నగర్ లో జరిగిన సంఘటన దీనికి ఉదాహరణ. తుపాకి టెస్టింగ్ కోసం రోడ్డు మీద చెప్పులు కుట్టుకునే వ్యక్తిని (పి. అశోక్) నిర్ధాక్ష్యణంగా కాల్చివేసారు.  నేను ఈ సంఘటన గుర్తుచేయడానికి కారణం, సరదా  కోసం ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొంటే, అదే ఆ వ్యక్తి కోపంలో ఉంటె ఇంకా ఎంత అనర్ధం జరుగుతుందో చెప్పనవసరం లేదు. అందుకే  ఆవేసమున్న వాడికి ఆకలి వేస్తె ఆకలి తీరుతుంది. అదే ఆవేసమున్న వాడకి ఆయుధం ఉంటె మాత్రం అనర్ధం జరుగుతుంది. నేరస్తులందరూ మొదట ఆవేశంతో తప్పు చేసినవారే, తరువాత ఈ సమాజం వారిని ఇంకా నేరస్తులుగా తయారు చేస్తుంది. అందుకే నేను అనుకుంటాను ఆవేశం కోపంగా మారకముందు దానిని తగ్గించుకోవాలి అలాగే కోపం కసిగా  ముందే దానిని తగ్గించుకోవాలి, లేదంటే ఆ కసే ఆ మనిషిని కసాయి వాడిగా చేస్తుంది చివరికి ఆ కసాయివాడే ఏదో ఒక రోజు కరుడగట్టిన నేరస్తుడు అవుతాడు. అయితే ఈ లోకంలో కోపం రాని మనిషి ఉండడు, అలాగే కోపం తెప్పించే సంఘటన ఎదురుకాని జీవితం ఉండదు. అందుకే నేను ఈ బ్లాగ్ లో వచ్చిన కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో మాత్రం రాయదలచుకున్నను.

సహజంగా నాకు కూడా కాస్త కోపం ఎక్కువగా ఉండేది. కాలంతో పాటు ఆ కోపాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేసాను. అయితే ఉద్యోగం జాయిన్ అయిన తరువాత కొన్ని సందర్భాలలో కోపాన్ని ప్రదర్శించవలసి వచ్చింది. ఎందుకంటే మనం కొన్ని పనులు చేయించు కోవడానికి లేదా ఆ పని జరగకపోవడం వలన మనకు కలిగిన వత్తిడిని క్రిందస్తాయి ఉద్యోగులకు తెలయచేయడానికి కోపం ప్రదర్శించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే నాకు ఇది తాత్కాలికంగా పని వత్తిడిని తగ్గించవచ్చు కానీ శాస్వతంగా మాత్రం నా ఆరోగ్యాన్ని అలాగే నా చుట్టూ ఉన్న ఆరోగ్యకరమైన సంబంధాలు పైన మాత్రం ప్రభావం చూపింది. అందుకే మనం ఏ పనైనా ప్రేమతో చేయించుకోవాలి కానీ కోపంతో మాత్రం కాదు.

నేను ఒక పుస్తకంలో చదివాను,  మనిషి మనసు ఒక తోట లాంటిది, ఆ మనసుకి కనక మనం నీరు పోసి, విత్తనాలు మొక్కలు నాటి ఓకే తోటను పెంచినట్లు పెంచి పోషిస్తే మనం ఊహించనదాని కంటే ఎక్కువ ఎక్కువ ఫలితాలను రాణిస్తుంది. అదే మనం కలుపు మొక్కలను రానిస్తే మనకు శాశ్వత మనశ్శాంతి, అంతరంగిక సామరస్యం అన్నవి ఎప్పటికి అందనివే అయిపోతాయి. నిజమైన తోటమాలి తన తోటను మాత్రం సైనుకుడిలా కాపాడుకుంటాడు, బయట నుంచి ఎలాంటి కాలుష్యం లోనికి రాకుండా. కాని మనషి మాత్రం నిత్యం తన మనసనే సారవంతమైన తోటలోకి ఎన్నో విషపదార్ధాలను రానిస్తాడో. ఆందోళనలు, విచారాలు, గతించిన జ్ఞాపకాలు ఇలా ఎన్నో తన అంతర ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసి అనవసరమైన భయాలతో పాటు అవి ఎవరి వలన కలుగుతున్నాయో వారి మీద కోపాన్ని అలాగే కసిని పెంచుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే "కోపం లేదా ఆందోళనకరమైన ఏ ఆలోచన అయిన పిండం లాంటిది. అది చిన్నదిగానే ప్రారంభమవుతుందిగానీ క్రమంగా పెద్దదవుతుంది, చివరకు ఒక ప్రాణిగా రూపుదిద్దుకొని ఆ మనిషినే తినేస్తుంది."   

అందుకే నేను కోపం వచ్చే ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని ఇంకా మంచి ఆలోచనలతో లేదా నాకు సంతోషం కలిగించే ఆలోచనలతో మార్చుకొని (Replace) నా మనసులోని భావ ఆవేశాలను కంట్రోల్ చేసుకుంటాను. అలాగే ఎవరైనా నాకు కోపం తెప్పిస్తే వాళ్ళు ఇంతకు ముందు నాపట్ల చేసిన మంచి పనులను కానీ వారు చూపిన ప్రేమాభిమానాలను గుర్తుచేసుకొని నాలో రగిలిన కోపావేశాలను తగ్గించుకొనే ప్రయత్నం చేస్తాను. ఇలా అన్ని సందర్భాలలో సఫిలికృతం కాలేకపోవచ్చు కానీ కొన్ని సమయాలలో కోపం తగ్గించుకొనే ప్రయత్నం చేసాను. కోపం మనిషికి ఒక శాపం కావచ్చు, కానీ అది ప్రదర్శించి పాపాన్ని మూట కట్టుకోవద్దు. మన జీవితంలో ప్రేమ అనే పునాదితో ఇల్లును కట్టుకోండి, ఆ ఇల్లు నిజంగా ప్రశాంతనిలయంగా మారుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.