Saturday, August 22, 2015

కాకిలో కాకినై తోకలో ఈకనై .....


"కాకిలో కాకినై తోకలో ఈకనై" ఇది చదవడానికి హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ, ప్రతీ మనిషి ఇలానే జీవిస్తున్నాడనిపిస్తుంది. జీవరాసులు అన్నింటిలోనూ 'కాకి' ప్రత్యేకం కాకపోయినా మనిషి జీవితాన్ని మాత్రం అందరు 'కాకి' తోనే పోలుస్తారు. ఉదాహరణకి " కాకిలా కలకాలం బ్రతకడం కన్నా హంసలా ఆర్నెళ్ళు బ్రతకడం మిన్న" ఇలానే ఒంటరి జీవితానికి 'ఏకాకి' అని, కాకులు 'కావు' 'కావు' అని అరుస్తుంటే " ఈ లోకంలో మనకు ఏవీ శాశ్వతం 'కావు' అని ఇలా సందర్భాన్ని బట్టి మన పెద్దలు మనిషి జీవితాన్ని 'కాకి' తోనే పోల్చారు. అందుకనే  నేను కూడా మనిషి జీవితాన్ని 'కాకి' తో పోల్చి ఈ బ్లాగ్ కి  "కాకిలో కాకినై తోకలో ఈకనై ...." అని పేరు పెట్టాను. ఆలోచిస్తే ఇది నాకు నిజమే అనిపిస్తుంది, ఎందుకంటే మనిషి బ్రతికినంత కాలం " కాకులలో కాకి లాగా జీవించి ...., చివరికి ఏకాకిలా మిగిలి ..., మరణించిన తరువాత తోకలో ఈకలా మిగిలిపోవడం.  అయితే కాకిలా కాకుండా హంసలా బ్రతకాలంటే మనం ఏమి చేయాలి? అసలు మనం జీవిస్తున్న విధానం కాకిలా ఉందా? లేదా హంసలా ఉందా అని తెలుసుకోవడం ఎలా? అని నా మనసులో ప్రశ్న మొదలైంది.

మొదట ప్రశ్నకి సమాధానంగా నేను " ఆస్తులు అమ్ముకొని ఆత్మ సోధనకై ఒక యోగి  ప్రస్తానం ( The Monk Who Sold his Ferrari)" పుస్తకంలో చదివినది మీ ముందు ఉంచదలచాను. " పూర్వం మన దేశంలో ఒక రాజు ఉండేవాడు, ఆ రాజు ప్రతీ రోజు ఉదయాన్నే లేచి అదేరోజు  అతనికి  ఈ లోకంలో చివరి రోజుగా భావించి, తన పిండ ప్రదానం తనే చేసుకునేవాడు. అందుకు ఆ రాజు నిజంగా తన జీవితంలో చివరి రోజని భావంచి  తన భార్యతో, పిల్లలతో, స్నేహితులతో అలాగే ప్రజలతో ఎలా ఆనందంగా గడపాలి? ఎవరితో ఎంతకాలం గడపాలో సమయస్పూర్తిగా మెలిగి తన రాజ్యంలో మంచి పేరు సంపాదించుకున్నాడు." ఇలా ఆలోచిస్తే చాల మంచిది అనిపిస్తుంది ఎందుకంటే మన జీవితంలో అదే చివరి  రోజు అని తెలిస్తే నిజంగా మనల్నిబాధ పెట్టినవాల్లని క్షమించాలనిపిస్తుంది, తప్పు చేసినవాల్లని సరిదిద్దాలనిపిస్తుంది అలాగే మన పట్ల ప్రేమగా ఉన్నవారికోసం త్యాగం చేయాలనిపిస్తుంది. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే  ఆశ, దుఃఖం తగ్గి మన జీవితం సంతొషంగా ముందుకు సాగుతుంది.
మనం బ్రతికినంత కాలం ఎలా బ్రతికామని ఆలోచిస్తే నాకు యండమూరి గారి పుస్తకంలో ( పుస్తకం పేరు సరిగ్గా గుర్తులేదు) మనం చనిపోయిన తరువాత మన గురించి మన కుటుంబసబ్యులలో ఒకరు, మన స్నేహితులలో ఒకరు, మనతో పని చేసేవాళ్ళు ఒకరు ఇలా ఒక్కొక్కర్నీ మన గురించి రెండు నిముషాలు మాట్లాడమంటే నిజానికి, నా గురించి మంచిగా మాట్లాడడానికి ఎంత మంది ముందుకు వస్తారన్నది నాకు పెద్ద సందేహమే. అయితే ఇలా ఆలోచించడం వలన కూడా మనం ఇకపైన మంచిగా ఉండగలమా? నిజానికి ఈలాంటి ఆలోచనలు మనిషిని మార్చగలదా? అంటే తప్పక మనిషి ఆలోచన మారి మంచి విధానంలో నడుస్తాడనే చెప్పాలి. దీనికి ఒక నిజసంఘటన, ఒక ఆద్భుతమైన సంఘటన మీ ముందుంచదలచాను. ఈ విషయం చాల మందికి తెలిసిన సందర్భానుసారం మరొక సారి గుర్తు చేయదలచాను.
ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ బహుమతి అందిరికి తెలుసు అయితే నోబెల్ బహుమతిని  ఇవ్వడానికి గల కారణం అలాగే అందులో అంతర్యం ఏమిటి? అని ఒక్కసారి ఆలోచిస్తే..... " అల్ఫ్రెడ్ నొబెల్ 1833 సంవత్సరంలో స్వీడన్ దేశంలో ఒక ధనవంతుని కుటుంబంలో జన్మించాడు. ఈయన రసాయన శాస్త్రంలో మంచి ఆరితేరిన ఇంజినీర్, ఈయన సుమారు 355 కొత్తవి కనుగొన్నాడు. అందులో 'డైనమేట్' ఈయనికి మంచి పేరుతెచ్చి పెట్టింది. దురదృష్టవత్తు నొబెల్ సహోదరుడు 1988 మరణించాడు, ఈయన సహొదురుని పేరుకి చివర నొబెల్ అని పేరు ఉండటం వలన అల్ఫ్రెడ్ నొబెల్ మరణించాడని బయట ప్రచారం సాగింది. అప్పటిలో సమాచార వ్యవస్థ అంతంత మాత్రంగా ఉండటం వలన, ఒక ఆంగ్ల పత్రిక అల్ఫ్రెడ్ నోబెల్ మరణించాడని భావించి అల్ఫ్రెడ్ నోబెల్ మీద ఒక సంపాదకీయం ప్రచురించింది. నోబెల్ డైనమేట్ కనుగొనడం వలన, ఆ సంపాదకీయంలో ఆయనను ఒక " The Merchant of Death" గా ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఆ సంపాదకీయాన్ని బ్రతికి ఉన్న అల్ఫ్రెడ్ నోబెల్ చదివి నేను మరణించిన తరువాత ఈ ప్రపంచం నన్ను ఈ విధంగా గుర్తుచేసుకుంటుంది అని తెలిసి చాల బాధపడ్డాడు. ఈలాంటి పేరు నేను ఎలాగైనా మార్చుకోవాలని భావించి తను మరిణించె ముందు తన మొత్తం ఆస్తిని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దానిమీద వచ్చే ఆదాయంతో ఈ ప్రపంచంలో శాంతి స్థాపన కోసం కృషి చేసినవారికి మరియు మానవాళికి ఉపయోగకరమైన వాటిని కనిపెట్టిన వారికీ నోబెల్ బహుమతిని ప్రకటించమని తన వీలునామాలో  పొందుపరిచి మరణించాడు. నొబెల్ కధ చదివాక ఇలా ఆలోచించడం మంచిది అనిపిస్తుంది.
పుట్టినవాడు గిట్టక తప్పదు. పుట్టుక చావుల మధ్య ప్రయాణమే జీవితం, సాధారంగా మనిషి బాల్యంలో అల్లరి చేయడం, యవ్వనంలో కామించడం, నడివయస్సులో సంపాదించడం, చివరికి వృద్ధాప్యంలో - చనిపోయే రోజు సమీపించినకొలదీ మంచిగా జీవించాలి..., మన జీవితానికి సార్ధకత ఉండాలని ఇలా చాలాకాలం బ్రతకాలి అనే ఆశతో జీవిస్తారు. శ్రావ్యంగా పాడేవాడికి, ఆ పాట రాసేవాడికి ఒకే హృదయం ఉంటుంది. "నీ కంటే గొప్పవాడిని" అనటానికి ఎవరికీ హక్కు లేదు. ఒకరికి కవిత్వం రాయటంలో, ఇంకొకరికి ప్రకృతిని ఆనందించటంలో శక్తీ ఉంటుంది. ఎవరి ప్రత్యేకత వారిది, ఎవరి జీవితం వారిది. కానీ ప్రతీ జీవితం ఒక ప్రత్యేక జీవితం. ఆశకు అంతు లేదు, కానీ అంతానికి ఆశ కారణం. ఇదే జీవితం, ఇదే ప్రపంచం.నేను పైన వివరించినట్లు మనం ఈ ప్రపంచం మొదటి పదిమంది గొప్పవాల్లలొ మనం ఒకరిలా ఉండాలని నా ఉద్దేశ్యం కాదు, కానీ మన ఆత్మీయ ప్రపంచంలో ఉన్న పదిమందితో సంతోషంగా జీవించాలంటే అలాంటి గొప్ప ఆలోచనలతో ముందుకు సాగాలన్నిది నా ఉద్దేశ్యం.... మన ఆలోచనలే మన జీవిత ప్రమాణాలు... ఆ ప్రమాణాలే మన జీవితానికి సార్ధకతనిస్తాయి... 




No comments:

Post a Comment