Tuesday, February 21, 2012

ఓడియమ్మ జీవితం....

నాకు బాగా కష్టం వచ్చినప్పుడు " ఒడియమ్మ  జీవితం...." ఇట్టా జరిగిందేటి అని అనుకుంట...అలాగే బాగా ఆనందం కలిగిన " ఓడియమ్మ జీవితం.... " జీవితం అంటే ఇట్టా ఉండాలిరా అని అనుకుంటా...అందుకే జీవితమంటే ఒంట్లో సత్తువయిన వుండాలి లేదా అమ్మనాన్నలు సంపాదించినా సోమ్ముయిన వుండాలి. అప్పుడు ఉంటుంది జీవితమంటే మజా...కానీ నాకు ఎప్పుడు నవ్వు తెప్పించే సంఘటన ఒకటి " నేను పని చేసేది పవర్ ఆఫీసులో కానీ ఇంత ఇంటికి వెళ్లేసరికి పవర్ మాత్రం కొన్ని సార్లు వుండదు" నిజంగా నాకు అప్పుడు అనిపిస్తుంది ఓడియమ్మ ఇదేమి జీవితం. ఇలా ఆలోచిస్తే నా జీవితంలో జరిగిన చిన్న చిన్న సంతోషాలు వాటికన్నా ముందు నేను చుసిన చిన్న కష్టం లేదా చిరాకుల సమాహారమే ఈ బ్లాగ్.

చిన్నతనంలో వాన అంటే సరదా అలాగే వాన తరువాత వచ్చే నీరు వరద అన్న మహా సరదా...దాని తరువాత ఊరిలో ఉండే బురదంటే మాత్రం...చిరాకు..స్కూల్ చదువుకునేటప్పుడు పాఠాలు వినాలి అంటే మాత్రం విసుగు...అదే కధలు వినాలంటే వినయం, ఆటలు అంటే ఆనందం...అదే ఆసనాలు వేయమంటే మాత్రం హడలు...అప్పుడనుకోనేవాడిని " ఓడియమ్మ ఇదేమి స్కూల్ జీవితం.. త్వరగా పూర్తి అయితే కాలేజిలో మనకు  నచ్చినట్టు ఉండవచ్చు అని "

పదహారేళ్ళ వయసు...ఆ వయసుతో వచ్చిన సొగసు...ఆ సొగసును సరిగ్గా ఉంచుకొనే మనసు...ఆ మనసుకి ఇంకొకరి మనసులో స్తానం కోసం తాపత్రయపడే మనసు...అలా ప్రయత్నం చేస్తే అందరిముందు అవుతామేమో అలుసు... అలా ఆలోచించడం అర్దం లేదని తెలుసు...అయిన ముందుకు అడుగు వేయని మనసు..ఎందుకంటే అందరి కళ్ళలో పడతానేమోని భయం. అన్నటు కళ్ళు అంటే ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. నేను ఇంటర్ చదుతున్నప్పుడు కాలేజికి వెళ్ళే మార్గం మద్యలో కిటికీలో నుండి రోజూ ఒక అమ్మాయిని చూసేవాడిని. కిటికీ పై రెక్కలు మాత్రమే తెరచి వుండడం వలన తనని కళ్ళనుండి ఫై భాగం రోజూ చుస్తేనేవాడిని. ఈ కళ్ళు ఆ కళ్ళని రోజూ చుస్తాన్నాయని ఆ కళ్ళకి తెలుసు. ఈ కళ్ళు ఆ కళ్ళని చూడగానే నా ముఖంలో చిరు దరహాసం మరి ఆ కళ్ళలో ఒక ఆనందం అది చూసి నా హృదయంలో ఒక మధురమైన అనుభూతి..ఇలా చాలా రోజులు మా కళ్ళు మాకు తెలియకుండానే మాటలడుకున్నాయి. అయితే ఒక రోజు ఎలా అయిన ఆ అమ్మాయిని చూడాలని నిశ్చయించు కొని
తన ఇంటిముందు కాపు కాసాను. మొదటి రోజు నా సమయం వృధా అయ్యింది మొత్తానికి తను బయటికి రాలేదు మరల రెండవ రోజు కూడా ఆ అమ్మాయి ఇంటిముందు కాపు కాసా... చివిరికి  ఆ అమ్మాయి రానే బయటికి వచ్చింది... ఇంకేంటి ఆ అమ్మాయని చూసాను.."ఒడియమ్మ  జీవితం..." అనుకున్నాను ఎందుకంటే అప్పుడు కూడా ఆ అమ్మాయి కళ్ళని మాత్రమే చేశాను...ఆ అమ్మాయి ముస్లిం అమ్మాయి..అయినా ఇంకా ఒక రెండు రోజులు వెంటబడ్డాను తన బురఖా తీయలేదు అలా ఆ తరువాత తను చూసే ప్రయత్నం చేయలేదు. ఇలా మొత్తానికి నా యవ్వనం అంతా " ఒడియమ్మ  జీవితం మిలటరీ బ్రతుకు "అయిపోయందిని అనుకున్నాను. కానీ లే ఉద్యోగం వచ్చాక ఉదయ్ C/o ఉత్సాహం అనేలా ఎంజాయ్ చేద్దామని అనుకున్నాను.

సరే చివిరికి ఒక ఉద్యోగం వచ్చింది. మొదట్లో పని నేర్చుకోవాలని  ఉత్సాహమో.. అలాగే ఇప్పుడు పని నేర్చుకోకపోతే ఫై స్తాయికి వెళ్ళాక ఇబ్బంది పడతానని భయమో తెలియదు కానీ... అందరికన్నా ఎక్కవ కాలం ఆఫీసులో పని చేసేవాడిని. దాని వలన కొన్ని సార్లు నా వ్యక్తిగత పనులు అలాగే వ్యక్తిగత సంతోషాన్ని కూడా కోల్పోయాను. మా ఆఫీసులో చాల మంది చెప్పేవారు " ఆడది తిరిగి చెడిద్ది.. మగాడు తిరగక చెడతాడు" ఇంకా ఒక నా ఫై అధికారి " మందు తాగని వాళ్ళు వెయ్యల్లేమి బ్రతకరు అలా అని మందు తాగిన వాళ్ళు వందేల్లోపు చనిపోరు " అయిన నా మనసు ఎందుకో అటు ప్రక్క వెళ్ళలేదు. నాకు కొన్ని సార్లు చిరాకు వచ్చినప్పుడు అనిపించేది ఏదో ఒకటి చేయాలనీ ఎందుకంటే " మనిషి అన్నాక కాస్తంత కళాపోషణ వుండాలని ..." కానీ అది కూడా ఆ క్షణమే..తరువాత ఏదో పని చేసుంటూ ముందుకు పోయాను. మొత్తానికి "ఒడియమ్మ  బ్యాచలర్ జీవితం ఇంతకన్నా ఎంజాయ్ చేయలేము ఇక పెళ్లి చేసుకుంటే మంచిది" అని అనుకున్నాను.


కానీ నా ముప్పై సంవత్సరాల జీవితాన్ని ఒక్కసారి వెనక్కి చూసుకుంటే నా బాల్యంలో కానీ, నా యవ్వనంలో కానీ, నా ఉద్యోగ జీవితంలో నేను కోల్పోయింది ఏమి లేదు. ఆ సమయానికి " ఓడియమ్మ జీవితం.... " ఇలా జరిగింది ఏంటి అని అనుకున్న అది తాత్కాలికం మాత్రమే. దీనిని బట్టి నాకు అర్ధం అయ్యింది ఒక్కటి చాల మందిలా నేను కూడా జీవితాన్ని అనుభవించకుండా ప్రేక్షకుడిలా చూస్తూ ఏదో మిస్ అవుతున్నామని అనుకుంటారు. అలా ఏదో మిస్ అవుతున్నామని ఎలాంటి తొందరపాటు పని చేయకపోవడం వలన నేను ఈ రోజు సంతోషంగా మరియు ఇబ్బంది పడకుండా ఉన్నాను. అందుకే ఈ బ్లాగ్ చదివే మిత్రులకు ఒక విన్నపం " పక్కవాడు ప్రేమలో పడ్డాడని మనం కూడా వేరొక అమ్మాయి కోసం ట్రై చేయడం  అనేది అర్ధం లేని విషయం" ఒక వేల అలా చేస్తే దాని వలన మనం తాత్కాలికంగా సంతోషంగా ఉండగాలమో గాని ఏదో ఒక రోజు మనం ఇబ్బంది పడే రోజు అయితే వస్తుంది అప్పుడు మనం అనుకోకూడదు "ఒడియమ్మ  జీవితం...." ఇట్టా జరిగిందేటి అని.  అందుకే  ప్రేక్షకుడిలా పక్కవాడిని గమనించి ఏదో మిస్ అవుతున్నామనే తొందరపాటే ఏదైనా అనుభవానికి పురికొల్పుతుంది తప్ప అందులోంచి ఆనందాన్ని ఆస్వాదించేది ఏమి ఉండదు, మనకు ఒక నిర్దిష్టమైన ఆలోచనతో జీవితాని ఆస్వాదిస్తూ ముందుకు సాగండి ఒక వేల కష్టమైన, సుఖమైన ఎదురైతే అది మన జీవితంలో   చివరికి సంతోషాన్ని ఇస్తేందే కానీ సమస్యలు మాత్రం ఎదురు కావు. 

Monday, January 23, 2012

సంతోషం సహజ బలం...

        2011 వ సంవత్సరం గడిచింది. 2012 నూతన సంవత్సరం లో ఎంతో ఆనందంగా అడుగుపెట్టం. మరి 2011 వ  సంవత్సరాన్ని ఒక్కసారి వెనిక్కి తిరిగి చూసుకుని ఎంత సంతోషంగా గడిపాం అని ఆలోచిస్తే... ఆ ఆలోచనలతో పుట్టిన బ్లాగ్ ఇది. "ప్రతి మనిషి కూడా సంసారమనే సాగరంలో తన జీవిత పడవను కష్టాలనే కెరటాలు ఎదురు కాకుండా ఆనందమనే అలల పైనే సంతోషంగా  సాగి చివరిగా సంతృప్తి అనే  ఒడ్డుకు చేరుకోవాలని అనుకుంటారు. జీవితం సంతోషంగా సాగాలని కోరుకోవడం తప్పు లేదు కానీ సంతోషంగా జీవితాంతం ముందుకు మాత్రం సాగలేము. దానికి కారణం లాభ నష్టాలను, గెలుపు ఓటమిలను, కష్టసుఖాలను ఒకే లాగా తీసుకోకపోవడమే..."
       అసలు సంతోషమంటే ఏమిటి అని ఒక్కసారి ఆలోచిస్తే " సమస్యలు లేకపోవడం లేదా సమస్యల్లో విజయం సాధించడం.."   మరి సమస్య అంటే మనకు నచ్చినట్టు జరగకపోవడం.  అలాగే మనకు నచ్చినట్టు  చేయనివాడు సమస్యలను సృష్టించిన వాడు అవుతాడు, వాళ్ళే చివరికి  శత్రువులగాను మరియు సమస్యల్లో సహాయపడ్డవాళ్ళు మిత్రులు గాను మిగులుతారు. దీనిని ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే మనలో ఇష్టాలు మిత్రులగాను అయిస్టాలు  శత్రువులగాను వుంటారు. అందుకే నేను అనుకుంటున్నాను "మనం  సంతోషంగా ఉండడానికి లేదా సంతోషంగా లేకపోవడానికి మన ఆలోచనల సరలే మూల కారణం".
        ఇకపోతే మనవల్ల ఇతరులు ఎంతవరకు సంతోషంగా ఉంటున్నారని ఆలోచిస్తే....మనం పుట్టినప్పుడు తల్లికి ప్రసవ వేదన పోయినప్పుడు అయినవాల్లికి శోకవేదన ఇలా మనిషి జీవితం ఆది మరియు అంతం వేదనతోనే ముడిపడి వుంది, అందుకేనేమో మనిషి పుట్టుక చావులు అంటే వేదాంతం అంటారు అనుకుంటా... మరి మిగిలిన జీవుతకాలంలో మనం ఎలా జీవిస్తున్నామంటే నాకు ఒక చిన్న కధ గుర్తుచ్చోంది. " దేవుడు ఈ లోకంలో అన్ని జీవులను సమాన అయుషకాలంతోనే శ్రుస్టించాడు. కానీ కోతి, గాడిద మరియు కుక్క మాత్రం మేము అంత జీవితకాలం బ్రతకలేము తమ  అయుషకాలంను తగ్గించమని దేవుణ్ణి వేడుకుంటాయి. అది విని  మనిషి దేవుడు దగ్గరకి వెళ్లి వాటి  అయుషకాలంను తన జీవితకాలంనకు ప్రసాదించమని వేడుకొనగా అలా దేవుడు మనిషి యొక్క జీవితకాలంను మిగతా జేవులకంటే ఎక్కువ కాలం జీవించేలా చేసాడు . అందుకేనేమో మనిషి జీవితకాలం లో ఆ జీవుల ( కోతి, గాడిద మరియు కుక్క) పోలినట్లే జీవిస్తున్నాడు."మనిషి యుక్త వయస్సు వచ్చు వరకు కోతి వలె చేష్టలను చేస్తును... మధ్య వయస్సులో గాడిద వలె సంసారాన్ని మోస్తూ.. ఇంకా ముసలితనంలో తను సంపాదించినా ఆస్తులను తమ పిల్లలకి చెందాలని కుక్కలా కాపలా కాస్తూ గడుపుతున్నాడు"
        మరి సంతోషంగా వుండాలంటే ఏమి చేయాలి... ఎలా ఉంటె మనం సంతోషంగా ఉండగలం...అని ఆలోచిస్తే ఒక సామెత గుర్తుకు వస్తుంది. "పుర్రోకో బుద్ధి జిహ్వకో రుచి..." అన్నారు పెద్దలు. సంతోషమనేది వారి వారి అభిరుచులను బట్టి మారిపోతుంది. అందుకే సంతోషమంటే ఇలానే వుండాలి అని నేను అనను కానీ ఇలా వుంటే వాళ్ళ జీవితంలో సంతోషంగా ముందుకు సాగ గలరని అనుకుంటున్నాను.మొదటిగా మన జీవితంలో మేలు జరిగితే అది మన మంచితనం మరి కీడు జరిగితే పక్కవాడు పగపట్టాడు అంటాం..విజయం వరిస్తే మన ప్రతిభ అదే ఓటమి అయితే ఒక్కడినే వదిలేసారు అంటాం...నిజానికి మన జీవితంలో ఎదురైన కీడు అయిన ఓటమి అయిన మనలో గల లోపాలు వల్లే  కానీ వాటిని గుర్తుంచకుండా మనం ఎదుటవాళ్ళ వాళ్ళ జరిగాయని వాళ్ళని ద్వేషిస్తాము. అందుకే మన జీవితంలో ఎదురైన సంఘటనలకు మనమే కారణం కావున ఎదుటవాల్లని ద్వేషించడం కానీ వారికి తిరిగి కీడు తలపెట్టకుంటే వారిని మనం ప్రేమించినవల్లమే. రెండవదిగా లాభ నష్టాలను, గెలుపు ఓటమిలను, కష్టసుఖాలను ఒకే లాగా తీసుకోకపోవడమే, ఈ మూడును కూడా ఉదయించే సూర్యడు లాంటివి ఎందుకంటే మన జీవితంలో ఉదయం రాదు అనుకోవడం ఎంత నిరాశో... కానీ ఆ ఉదయం ఉండాలనుకోవడం అంతే దురాశా. అందుకే మనిషి జీవితంలో ఓటమి మరియు కష్టనష్టాలు  లేకుండా సాగదు కానీ వాటితో కూడా మనిషి సంతోషించడం మరియు కొత్త విషయాలను నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. ఒక వేళ మనం లాభాలలో వుంటే పదిమందికి ఉపయోగపడండి అదే నష్టాలలో వుంటే ఎంత పొదుపుగా జీవుతం గడపాలో నేర్చుకోండి..అదే విజయం అయతే నెంబర్ వన్ గా వుంటారు మరి ఓడితే ఇంకొరికి మార్గదర్శిగా నిలుస్తారు..మరి సుఖలతో వుంటే జీవితంలో ఉన్నత స్థానం ఎలా అధిరోహించాలో ఆలోచించండి మరి కష్టాలలో ఉంటె మిమ్మల్ని మీరు ఒక్కసారి సరి చేసుకోండి. ఇలా ఆలోచిస్తే ప్రతీది కూడా మనషి యొక్క మంచికే జేరిగేవే. అందుకే అంటారు ఒక గెలుపు జీవిత గమ్యం కాదు ఒక ఓటమి జేవితనికి ముగింపు కాదు. మనిషి ఆరోగ్యంగా జీవించడానికి ఉశ్వాస నిశ్వాస ఎంత అవసరమో మనిషి సంతృప్తిగా జీవించడానికి లాభనష్టాలు,  కష్టసుఖాలు , గెలుపు ఓటమిలు అంతే అవసరం. అందుకే నేను అంటాను సంతోషమే మనిషికి సగం బలం ఇవ్వగలదు కానీ దానికి ముందు మనిషి ఒక విషయం గమనిచాలి 
                          "సంతోషం మనిషికి ఒక సహజ బలం..
                            సంతోషం మనిషికి సంపూర్ణ ఆరోగ్యం..
                            సంతోషం మనిషి సకల పనులకు సంకల్పం..."




Monday, November 21, 2011

ప్రేమ తో...


ప్రేమ తో...ప్రేమ గా.. ప్రేమిస్తూ...ప్రేమ కోసం... ప్రేమ మీద రాస్తున్న బ్లాగ్ ఇది. ప్రేమ లో ఆనందం వుంది, బాధ వుంది అలాగే ప్రేమతో భయం పుడుతుంది, ధైర్యం పుడుతుంది.  ప్రేమ కోసం ఉప్పెనలా ఉరకలేస్తారు నేటి యువతరం, దానిని సాధించుకోవడనికి ఎవరెస్టు శిఖరాన్ని అయినా ఎక్కుతారు..అఘాదల అంచులు వరకు కూడా వెళ్తారు. మరి ప్రేమ అంటే మంత్రమో లేక మాయో తెలియదు కానీ మానవాళికి మాత్రం ప్రేమ అంటే మధురం. నాకు తెలిసినప్పటినుండి అనుకుంటూనే వున్నాను నేను కూడా ప్రేమ వివాహం చేసుకుందామని. ఇలా అనుకోవడానికి కారణం నేను అతి ఎక్కువగా చుసిన సినమాలె. కానీ కాలంతో పాటు నేను మారానో...లేక ప్రేమికులు మారారో తెలియదు కానీ నేను ప్రేమ లేకుండానే పెళ్లి వైపు అడుగులు వేసాను.


నేను తొలినాళ్ళలో చుసిన ప్రేమ సినమాలు " అభినందన", "మరోచరిత్ర" మరియు " గీతాంజలి " నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. అవి చూసాకే అనిపించింది జీవితంలో ఎవర్నైనా ప్రేమించాలి,ఆ ప్రేమ ని ఆస్వాదించాలి, ప్రేమలో ఆనందించాలి అది ఇంకా  నా  చుట్టూ ఉన్నవారికి పంచాలి అలాగే ప్రేమించిన వారికోసం ప్రాణాలు సైతం లెక్క చేయకూడదు అనుకునేవాన్ని.  అయితే నేను ఎవర్ని ప్రేమించాలి ఎలాంటి వాళ్ళని ప్రేమించాలి, ఎవర్ని ప్రేమిస్తే జీవితం అందంగా మరియు ఆనందంగా ఉంటుందని అలోచిన్స్తున్న సమయం లో నేను ఒక నవలలో చదివిన మాట నన్ను బాగా ఆలోచింపచేసింది. ఆ మాట " Love is most weakness of the mind, it has no reason and no season. 

మనం కారణం లేకుండా ప్రేమిస్తే ఆ ప్రేమ ఎంతవరకు నిలబడదని నాకు అనిపించింది. అప్పటినుండి నేను సమాజం లో జరిగిన సంఘటనలు మరియు సినమాలు కూడా నన్ను బాగా ప్రభావితం చేసాయి. చాలా వరకు ప్రేమకి కులం మత భేదాలు, అంతస్తులు తేడాలున్నాయని  ప్రేమ కోటకు బీటలు వేస్తాయి. అందుకే ప్రేమికుడు, సైనికుడు భయ పడకూడదని అంటారు. కాలం మారుతున్నకొద్దీ ప్రేమ ఫలించలేదని ప్రాణాలు కూడా త్యాగం చేసుకొని తనువు చాలించు కొన్నవారిని  చూసాం. కానీ నేటి తరం ప్రేమ పొందలేదని ఎదుటవారి ప్రాణాలును బలి తీసుకుంటున్నారు. మరికొంతమంది ప్రేమలో ప్రే అంటే ప్రేమించడం తరువాత మ అంటే మరిచిపోవడం అన్నట్టుగా తీసుకుంటున్నారు. వీరు మొదటిది ఎంత త్వరగా చేస్తున్నారో రెండవది కూడా అంత త్వరగా చేస్తున్నారు. అయినా నా జీవితంలో నన్ను కన్నవారినుండి ఒక రకం ప్రేమను నా తోబుట్టవలనుండి ఇంకోరకం ప్రేమను మరియు నా స్నేహితులు నుండి ఇంకా మంచి ప్రేమను పొందాను. అలాంటప్పుడు ఆ ప్రేమను ఇంకా నిలబెట్టుకొని జీవితాన్ని ఆనదించడం కన్నా వేరొక ప్రేమ కోసం ఆరాటం లో అర్ధం లేదనిపించింది. నేను ఒక పుస్తకం లో చదివిన మాట గుర్తు..." నీకు మంచి లైఫ్ పాట్నర్ రావాలనుకోవడం కన్నా నీవు ఇంకొకరికి మంచి లైఫ్ పాట్నర్ గా వుండడం మంచిది". అందుకే నా జీవితంలోకి వచ్చినవారిని ప్రేమతో ఆహ్వానం పలికి, వారినే ప్రేమించడం మంచిదనిపించింది. అందుకే  నేను  ప్రేమ లేకుండానే నేను పెళ్లి వైపు అడుగులు వేసాను అనిపిస్తుంది.  
అయితే నా దృష్టిలో ప్రేమ అంటే
                                 కళ్ళు వేరువేరుగా వుంటాయి కానీ ఒకే కలనే కంటాయి
                                 పెదవులు వేరువేరుగా వుంటాయి కానీ ఒకే మాటను పలుకుతాయి...
                                 కళ్ళు వేరువేరుగా వుంటాయి కానీ ఒకే గమ్యాన్ని చేరుతాయి..
పైన చెప్పినట్లు ప్రేమికులు మనుషులుగా వేరువేరుగా వున్నా వారు ఒకే కలను (Dream) కలిగివుండాలి.  అలాగే  వారి మాటలు వేరువేరుగా వున్నా సమస్యల్లో ఒకే మాటతో ( Decision) ముందుకు పోవాలి. అలాగే వారు నడిచే మార్గాలు వేరైనా వారి ఒకే గమ్యం (Destination) కలిగివుండాలి. అందుకే నేను అనుకుంటాను " ప్రేమ అంటే ఒకరి కళ్ళలోకి మరొకరు చూడటం కాదు... ఒకరి మార్గంలో ఇంకొకరు చూడటం". అలాంటి ప్రేమను పొంది మరియు మనంకూడా అలానే ప్రేమిస్తూ ప్రేమలో పవిత్రంగా అలాగే ప్రేమకు ప్రతిరుపంగాను జీవించకలిగితే ఆ జీవితంలో సంతృప్తి, సంతోషం వెల్లివిరుస్తాయి..
అందుకే ప్రేమించండి...ఆ ప్రేమను పదిమందికి పంచండి...ఈ ప్రపంచంలో ప్రేమను పెంచండి...నిజంగా మీరు ప్రేమికులు అయతే...
                              మీరు ప్రేమికులు అయితే సంతృప్తికి కారకులే...
                              మీరు ప్రేమికులు అయితే శాంతికాముకలే...
                              మీరు ప్రేమికులు అయితే సమసమాజ నిర్మాతలే...
                                                                                                          


Monday, October 24, 2011

అ.....అ.....అ....

నేను రాసిన మొదటి బ్లాగ్ కి సహకరించిన మిత్రులకు మరియు వారి అభిప్రాయాలను తెలియ చేసిన మిత్రులకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటు, వారిచ్చిన స్పూర్తి తోనే నా రెండవ బ్లాగ్ ని వ్రాయడం మొదలపెట్టాను. నా మొదటి బ్లాగ్ లో రాసిన మొదట సంఘటన లో ఆకలి లో ఏడుస్తున్న కుర్రవాడికి రెండు రూపాయలు ఇస్తే సరిపోతుంది అనుకున్నాను. కానీ అది తాత్కాలిక ఉపసమనమే కానీ  శాశ్వత పరిష్కారం కాదు. మరి శాశ్వత పరిష్కారం కావాలంటే వారి యొక్క రోజూ వారి లేక నెలసరి ఆదాయం పెరగాలి, అంటే వారు ఏదైనా వృత్తిని లేక విద్యను నేర్చుకోవడం ద్వారానే ఆదాయం పెరుగుతుంది.

అసలు విద్య అంటే ప్లాటో మహాసయాడు చెప్పినట్టు " మనిషని మానసిసంగాను, శారిరకంగాను, విజ్ఞాన పరంగాను అభివృద్ధి చేసేది విద్య ". అలాంటి విద్యను నేర్చుకోవడం ద్వార మనిషి సుఖంగా జీవించడమే కాకుండా నిత్య జీవితంలో ఎదురైనా సమస్యలను కూడా విశ్లేషించుకొని సరైన పద్ధతి లో ఎదుర్కొని జీవితంలో మరింత ముందుకు సాగిపోవడానికి దోహద పడుతుంది.
ఈ ప్రపంచాన్ని పరిపాలించేది మూడు " అ " లు...
                                                        అ -----> అమ్మ
                                                        అ -----> అన్నం
                                                        అ -----> అక్షరం ( విద్య)
అమ్మ ప్రేమ చూడని వారు ఈ లోకం లో ఎవరు వుండరు, అలాగే అన్నం విలువ తెలియని వాళ్ళు కూడా ఎవరు వుండరు. కానీ ఈ లోకం లో విద్య విలువ తెలియని వాళ్ళు చాల మంది వున్నారు. ఒక మనిషి ఏ దేశంలో నైన ఏ ప్రదేశంలో నైన స్వేచ్చగా మరియు సంతోషంగా విద్య అనేది ఎంతో అవసరం. విద్య నేర్చినవాడు  ఈ ప్రపంచంలో ఈ చోటనైన ఉద్యోగం చెయగలడు మరియు ఎలాంటి ఉన్నత స్థాయికి  చేరుకోగలడు. అందుకే నేను అనుకుంటాను " పేదవాడి నిజమైన ఆస్తి మరియు నేస్తం విద్య".
నేను ఈ మద్య "  A SMALL ACT "  అనే డాక్యుమంటరీ ని చూసాను. ఇది నన్ను ఎంతో ఆకట్టుకుంది. హిల్డే అనే ఒక ఆమె క్రిస్ అనే వ్యక్తి చదువు కోసం నెలసరి కొంత మొత్తంను దానం చేయడం వలన క్రిస్ ఒక  గొప్ప  ఉద్యోగాన్నే సంపాదించడం కాకుండ పేద విద్యార్దుల చదువు నిమిత్తం ఒక స్వంచ్చంద సంస్థను లకొల్పడానికి 
దోహదపడింది.  మనం చేసే సహాయం సముద్రంలో ఒక నీటి చుక్కను వేయడం లాంటిది. ఆ చిన్న నీటి  చుక్కే 
ఒకరి జీవితంలో ముందుకు పోవడానికి చుక్కానిలా ఉపయోగపడుతుంది.   

ఒక మనిషిని జీవితం లో పెంచేది గెలిపించేది కూడా విద్యే. అలాంటి విద్యను ఈ సమాజానికి అందించడానికి సహకరించి ఇంకా ఎంతో మంది జీవితాలలో ముందుకు పోవడానికి దోహదపడండి. దీనికే కొంత మంది చెబుతారు విద్య అనేది పుట్టకతో అబ్బాలి లేదా సరస్వతి దేవి నోదటి మీద రాయాలని. కానీ నేను దీనికి అంగికరించాలేను ఎందుకంటే...
                      " విద్య రాదనేది వెర్రి మాట...
                        సాధనతో వుంది ప్రతీ నోటా...
                        విద్యతో చేయు చెలిమి....
                        విద్యతోనే కలుగును కలిమి...."
మన ఇంట్లో చీకటి పోవడానికి దీపం వెలిగించాలి  అలాగే జీవితంలో చీకటి పోవడానికి విద్య అనే దీపం వెలిగించాలి.
      " Education is the light of the life ..."

  

Thursday, September 15, 2011

కరుణ చూపాల్సిన తరుణమిది !!!

నేను చిన్నప్పటి  నుండి అనుకుంటూనే ఉన్నాను... ఇలాంటి టాపిక్ మీద ఒక కధ లేక ఒక 
సంపుటి రాయాలని.. మధ్యన నా మిత్రుడు ఒక బ్లాగ్ వ్రాసాడు నేను  రోజున ఆలోచించాను 
నేను కూడ బ్లాగ్  రాస్తే  బాగుంటుందని. నాకు చిన్నప్పటి  నుండి కరుణ అనే పదం చాలా ఇష్టం. అందుకే మొదట  కరుణ అనే పదం మీద బ్లాగ్ రాయడం మొదలుపెట్టాను. అందుకు కారణం కూడా లేకపోలేదు, నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు మా తెలుగు మాష్టారు 
కందుకూరివారు రాసిన "తుది విన్నపం" అనే పాఠం చెప్పారుఅందులోని కొన్ని వాక్యాలు నాకు 
ఇంకా ఇప్పటికీ నా మది అంతరాలలో మెదులుతూనే ఉంటాయి
"అశ్మదేశీయులారా సహ జన్ములారా....
     నా చర్మం ముడతలు పడుచున్నది...
     నా కంట నరాలు నశించి పోవుచున్నవి....
     కానీ నా లోన జీవ సంస్కరణ ఆశ దిన దినాభివృద్ధి చెందుతున్నది ..."
ఈ నాలుగు వాక్యాలను అప్పటి ఆంధ్ర దేశం లో వున్న యువతను  ఉద్దేశించి కందుకూరి వారు తను నడుపుతున్న ఆంధ్రా పత్రిక లో రాసిన చిట్టచివరి సంపాదకీయం. తను చనిపోవటానికి సిద్దంగా వున్నానని తెలిసి, తదనంతరం ఈ ఆంధ్ర దేశాన్ని ఆనాటి యువతకు అప్పచెప్పుతూ రాసిన మాటలవి...అరువది సంవత్సరాలు దాటినా  కందుకూరి వారి మాటలు అంత ఉత్సాహంగా వుంటే ఇంకా ఇరువది దాటని నేను ఇంకా ఎంత  ఉత్సాహంగా వుండాలని ఆలోచించా....., నేను ఆ రోజు నుండి నా జీవితంలో ఎల్లప్పుడూ ఇతురుల పట్ల దయతో మెలగాలి మరియు సాధ్యమైనంత  వరకు ఇతరులకు సహాయ పడాలని నిశ్చయంచు కొన్నాను.                      నేను ఇంటర్ చదువుతున్నప్పుడుఒక రోజు నేను కాలేజీ నుండి రూమ్ కి తిరిగి వస్తుండగా మధ్యలో ఒక పది ఏళ్ళ వయసు గల బాలుడు " అమ్మ ఆకలి ఆకలి" అని గట్టిగా కేకలు పెడుతున్నాడు అది విని  నేను  సైకిల్ దిగి నా  దగ్గర వున్నా ఒక రెండు రూపాయలు ఇద్దామనుకునే లోపు వాడి మిత్రుడు వచ్చి "సార్ వాడికి డబ్బులు ఇవ్వకండి  రోజు మెగాస్టార్ సినిమా రిలీజ్ అవుతుంది వాడు  సినిమాకి వెళ్ళడానికి  వేషమంతా  అన్నాడు". నా మనసు ఒక్కసారి చివుక్కుమని 
నేను వెంటనే  అబ్బాయి కి డబ్బులు ఇవ్వకుండా రూమ్ కి వెళ్ళిపోయానునేను రూమ్
కి వెళ్ళిన తరువాత ఆలోచించాను ఇద్దరు అబ్బాయిలు కూడా నాకు తెలియనివాల్లే అని, కానీ  వారిలో కలిఆకలి అని ఏడ్చే వాడి మాట ఎందుకు నమ్మలేకపోయాను.ఒక వేల వాడికి నిజంగా ఆకలి అయితే నేను వాడి మీద దయ చుపించాలేకపోయాను అని అనిపించింది విషయం గురించి 
చాల ఎక్కవగా అలోచినేమో...నేను బి. టెక్ లో వుండగా ఒక కవిత రాసాను...
"అరుణ కిరణాలలో లేదు కరుణ...
      దప్పిక గొన్న ధరణిని చూసి దేవునికి కలగలేదు కరుణ...
      ఆకలితో అలమటిస్తున్న అనాధులు...
      అపురూపంగా పెంచిన అబ్బాయి నుండి ఆదరణ  లేని అమ్మ నాన్నలు...
       దారుణాలను చూసి రావాల్సింది కన్నీళ్లు కాదు...
      రాయాల్సింది కవితలు కాదు...
      హృదయంలో ఉదయంచాలి ఉప్పెనలాంటి దయ...
      మనసులో మొలకేత్తాలి మానవత్వమనే మొగ్గ..."
ప్రతి మనిషి కూడా పుట్టుకతో చెడ్డవాడు కాదు. కానీ వాళ్ళు పెరిగిన వాతావరణమే వారి స్వభావం మీద ప్రభావం చూపుతుంది. నాలో నేను ఒకటి గమనించాను, నేను పెరుగుతున్న కొద్దీ నేను ఇతరులకు  సహాయపడాలని ఆశ ఎక్కువతున్నా అది అవసరం అయినప్పుడు మాత్రం సహాయపడాలేకపోతున్నాను. దీని గురుంచి రుద్రవీణ సినిమా లో  " చుట్టుపక్కల చూడరా చిన్నవాడ..."  అనే పాట చరణం లో చక్కగా రాయబడింది.
 

 "కరుణను మరిపించేదా చదువు సంస్కారమంటే....
  గుండె బండగా మార్చేదా సంప్రదాయమంటే...
..............................
  ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా..
  తెప్ప తగలబెట్టేస్తావా యేరు దాటగానే..."



ఫైమాటలు అక్షరాల నిజం ఎందుకంటే చాల మంది సహాయం చేయవలిసిన సమయంలో వెనకకు తగ్గి మరల దానిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా సమర్ధించు కొంటారు నేను కూడా ఒక సందర్భంలో వెనిక్కి    తగ్గాను అది గుర్తు వచ్చినప్పుడల్లా నన్ను కలచి వేస్తుంది.నాకు బాగా గుర్తు మార్చి 16వ తేది 2003  సంవత్సరంలో నేను నా స్నేహితులతో కలిసి వైజాగ్ నుండి రాజంకి ట్రైనులో వెళ్తున్నాం.ట్రైను విజయనగరంలో ఆగితే నేను అలా బయటకు వచ్చిమరల ట్రైను కదిలిన సమయంలో ఎక్కుతుండగా మంది గుంపుగా వుండడం గమనించాను.నేను కూడా అక్కడికి వెళ్ళగా ఒక మూడేళ్ళ  పాపని తన తల్లి అక్కడ వదిలి అప్పుడే ట్రైను దిగి వెళ్లిందని చెప్పారు.అందరు తనను వింతగా చూస్తున్నారు కానీ ఎవరు కూడా తనిని రక్షించే ప్రయత్నం మాత్రం చేయలేదునేను ఎంతబాగా ఆలోచించినా అవసరమైన చోట దానిని ఆచరణ లో పెట్టలేక  పోయానునాలో వున్నా కొంత భయం నన్ను వెనక్కి నెడితే ఇంకొక విషయం ఎవరికీ లేని బాధ నాకు ఎందుకులే అని..ఇలా మొత్తానికి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అర్ధం అయ్యింది.అందుకే మనం ఒకరికి ఉపయోగ పడాలంటే మనీ కాదు మనసుంటే చాలు అనిపించింది. మన దేహం కి  మలినలే పడితే  దానిని ఎప్పటికప్పుడు సుద్ది చేసుకుంటున్నాం అదే మరి మన మనసుకి మలినాలు పడితే  అవి ఎలా తొలగించుకోవాలి, ఎలా మన మనసుని చేసుకోవాలి. ఇలా నా మది మధనం  నుండే పుట్టింది నా "ధనం".  కవితను తలచుకున్నప్పుడల్లా నాకు కొంత ధైర్యం మరియు    ఉత్సాహం వస్తుంది.
     "మనసులోని మలినాలను వదిలి మండుటెండల్లో 
  మాసిన బ్రతుకలతో వున్న మంచి మనుషుల్ని చూడండి..
 మేను పైన ముతక గుడ్డ లేక మొదటి వారి ముద్దు ముచ్చటను నోచుకోక 
         ముష్టి అయిన ముప్పావల మించక పొట్ట వుట్టని మట్టితో నింపుతున్న 
         మా మూడేళ్ళ చిన్నారులని  చూడండి.."
ఫై కవిత ఎప్పటికప్పుడు నన్ను నాకు గుర్తు చేస్తూవుంటుంది.ఒక విధంగా నేను కొన్ని మంచి 
పనులు చేయడానికి స్పూర్తినిచ్చింది. అయితే ఇలాంటి పరిస్తితులు ఎందుకు ఎదురవుతున్నాయని 
ఒక సారి పునరాలోచన చేస్తే. దీనికి కారణం మనిషిలో రోజు రోజుకు పెరుగుతున్న స్వార్ధం. 
అసలు మనిషి సేద్యం చేయడం నేర్చుకోక ముందు  పూట ఆహారం కోసం  పూట సంపాదించు 
కొనేవాడు. మనిషి సేద్యం చేయడం తెలిసిన తరువాత రేపటి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. 
అప్పుడు అలా రేపటి కోసం కూడబెట్టిన మనిషి నేడు కూడబెట్టడం కోసం మాత్రమే బ్రతుకు తున్నాడు అందుకేనేమో ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు పేదవాళ్ళు ఇంకా పేద వాళ్ళు అవుతున్నారు.  
       అయితే ఈ సమస్య నుండి బయట పడటం ఎలా...? ఏమి చేస్తే మనం సమాజం లో ఆర్ధిక అసమానతలు తగ్గించగలం ..?. ఇలా అడిగితే దీనికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా సమాధానం చెబుతున్నారు, ఒకరు ప్రభుత్వాలు మారాలంటే ఇంకొకరు మహాత్మా గాంధీ లాంటి కారణ జన్ములు పుట్టాలి అంటున్నారు. వాస్తవానికి మారాల్సింది ప్రభుత్వాలు కాదు...ముందు మనం మారాలి..  పుట్టాల్సింది మహాత్మ గాంధీ లాంటి కారణజన్ములు కాదు.. వారి యొక్క గొప్ప ఆశయాలు మన హృదయంలో పుట్టాలి. అప్పుడే మనం అనుకునే సమ సమాజం లేదా అసమానతలు లేని నవ  సమాజం  ఏర్పుడుతుంది. ఎందుకంటే మనం ఏది విత్తి తే అది కోయగలం. అందుకే నేను కోరుకునేది ఒక్కటే మన భావి తరాలలో నైన మంచి, మానవత్వమనే మల్లెలను వారి పసి హృదయాలలో నాట గలిగితే వారి నుండి వికసించు పరిమళాలతో ఒక సమ సమాజం సృష్టించు కొందాం.  
"ముల్లులు నాటి చూసాక మల్లెలు పూస్తాయా...?
     మల్లెలు నాటి చూసాక ముల్లులు పూస్తాయా...?"
 అందుకే ఆగండి ...ఆలోచించండి 
    "మంచి అనిపిస్తే మారండి...
     ఇక  సమాజాన్ని మార్చండి...
     భావి తరాలకు ఒక మంచి భవిష్యత్ ను అందిచండి...."