Monday, April 8, 2013

జీవితం....

జీవితం అంటే కలల సమూహం, నెరవేరిన కలల గురించి చెబితే అది మన జీవిత చరిత్ర అదే నెరవేరని వాటి గురించి చెబితే అది మన జీవిత అనుభవం. అందుకే నేను కూడా జీవితం అంటే ఎలా ఉండాలని ఎప్పుడు కలలు కనే వాడిని కానీ దాని కోసం ఏమి చేయాలో మాత్రం ఆలోచించేవాడిని   కాను. నేను కనిన  కలలును కనక రాసుకొని ఉంటె ఏకంగా పుస్తకం అయ్యేది, అలాగే  తీరిన కలలు ఒక రాస్తే అవి ఒక పుట కూడా పూర్తికాదు. గంతించిన జీవితాన్ని చూస్తే చెప్పుకోదగ్గ విజయాలు లేవు అలా అని ఓడిపోయినా అనుభవం లేదు. ఎందుకంటే నేను అసలు ప్రయత్నం చేయలేదు ఒక వేళ ప్రయత్నం చేసిన, నా లోని శక్తీ సామర్ధ్యాలను పూర్తిగా వినియోగించక పొవటమే.


నేను ఒక్కసారి  జీవితం లో వెనిక్కి చూసుకుంటే మిగిలింది శూన్యం మాత్రమే. నాకు నా జీవితం  మీద ఇలా ఆలోచన ఉంటె, ఇంకొకరికి మరోలా ఉండవచ్చు. ఇంతవరకు నేను చదివిన లేదా నాకు తెలిసిన జీవిత నిర్వచనాలలో మొదటిగా జీవితమనేది ఒక చదరంగం
" ఈ భూమి ఒక చదరంగపు బల్ల అయితే ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషి ఒక పావులాంటివాడు, అయితే విధి ఆడే వింత ఆటలో ప్రతి మనిషి పావుల కదులుతూ తన జీవితాన్ని ముగిస్తాడు ..."
రెండవది గా జీవితమనేది ఒక నాటకం.....
" ఈ భూమి అనేది ఒక రంగస్థలం అనుకుంటే ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి మానవుడు ఒక పాత్రదారుడే, అయితే దేవుడు చేసే కధనం లో ఎవరి పాత్రలలో వారు జీవించి చివరికి తనువు చాలిస్తారు ..."
పైన చెప్పినట్లు మనిషి కొన్ని సార్లు నటిస్తూ..., మరి కొన్ని సార్లు ధనం కోసం, ఆస్తి కోసం ఎత్తుకి పైఎత్తులు వేస్తూ తమ జీవితాల్ని వెలిబుస్తారు. అందుకే కొన్ని సార్లు జీవితమంటే నాకు ఒకే ఒక మాట గుర్తుకువస్తుంది. అదే " జీవితమంటే జీతం" అందుకేనోమే జీవితం అనే  పదంలో జీతం అనే పదం చక్కగా ఇమిడిపోయింది. మనిషి ఎలాంటి సంఘ పరిస్థితలలొ పెరిగిన, లేదా జీవించన, ఎలాంటి మత పరమైన ఆచార వ్యవహారాలను కలిగి వున్నా,  ఈ భూమి మీద ఏ ప్రదేశాలలో నివసిస్తున్నప్పటికి, చివరికి వారు డబ్బు కోసం, డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటారు. అందుకేనోమో ఈ సమాజంలో జీతం ఎక్కువ ఉన్నవారికి, అలాగే డబ్బు ఉన్నవారి జీవితాలను ఈ సమాజంలో జీవితాలుగా గుర్తిస్తున్నారు, వారినే గౌరవిస్తున్నారు, వారినే అనుసరిస్తున్నారు.

" విజయం సాధించిన ఎవరి చరిత్ర చదివిన, అంటే గొప్పవాళ్ళ కన్నా గొప్ప వాళ్ళు, గొప్ప సాహసవంతులు, గొప్ప శాస్త్రవేత్తలు, వారు ఏమి సాధించిన డబ్బుని ఆశించి చేయలేదు. అందుకే ఈ భూమి మీద మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా, థామస్ అల్వ ఎడిసన్ వారిని ఈ ప్రపంచం గుర్తించుకున్నట్టు టాటా, బిర్లా, అంబానీ లను ఈ ప్రపంచం గుర్తించుకోదు." డబ్బు మనిషికి సౌకర్యాలను, తాత్కాలిక సంతోషాలను అందివ్వగలదు కానీ మనిషికి సంతృప్తి మాత్రం ఇవ్వలేదు. అందుకే జీవితం అంటే జీతం కాదు, జీవితం అంటే జీవం, జీవం అంటే మన శక్తీ సామర్ధ్యాలను పూర్తి స్తాయిలో ఉపయోగించి జీవించడం అలా ఉపయోగించప్పుడు మనం మనుషులగా బ్రతికి ఉన్న మరణించినట్లే... 

సాధారణంగా అందరు నాకు అంత శక్తీ సామర్ధ్యాలు లేవు, మనం ఇంత కష్టమైనవి సాధించలేము అని కుంటారు. కానీ నిజానికి మనం ప్రతి ఒక్కరం మెధవులమే... కానీ విచారకరమైన విషయం ఏమిటంటే అందరం అతి సాధారణ మైన వ్యక్తిగా మరణిస్తాము. ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పదలచుకున్నను. సాధారణంగా పంది బ్రతికినంత కాలం క్రిందకి చూస్తూ బురదలలోను, మురుకి కాలువల లోను తిరిగుతూ బ్రతుకుతుంది. ఎప్పుడయితే ఆ పంది కాళ్ళని కట్టివేసి, తలక్రిందులుగా వేలాడదీసి చంపడానికి తీసుకేల్తున్నప్పుడు అది మొదట సారి ఆకాశాన్ని చూస్తుంది. అప్పుడు ఆ పంది మొదట సారి బాధ పడుతుంది, ఇంతవరకు ఇంత గొప్ప లోకంలో ఏమి చూడకుండా, ఏమి అనుభవించకుండా, ఏమి సాధించకుండా  చనిపోతున్నాని   చివరి నిమిషంలో చింతుస్తుంది. మనిషి చనిపోతున్నని తెలిసిన చివర ఐదు నిమిషాలలో ఉన్నప్పుడు, తను సాధించిన విజయాలు గుర్తుకు రావు, తనలో శక్తీ, సామర్ధ్యాలు కలిగిన పనులు చేయలేకపోయానని చింతిస్తాడు. 
అందుకే జీవితమంటే జీతంతో బ్రతకడం కాదు. మన శక్తీ సామర్ధ్యాలతో బ్రతకడం, అయితే అన్ని సందర్భాలలో మన శక్తీ సామర్ధ్యాలను ఉపయోగించలేక పోవచ్చును. అయినంత మాత్రాన  మనం ఓడినట్టు కాదు. అయితే ప్రతి పనిని ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ, నవ్వుతు, నవ్విస్తూ, జీవితంలో ప్రతి క్షణం సంతోషిస్తూ ముందుకు వెళితే మన జీవిత చివరి ఘడియలలో ఆలోచించాల్సిన అవసరం ఉండదు, అలాగే బాధ పడాల్సిన పని ఉండదు. జీవితం మాటలలో చెప్పడం సులువే, కాని ఆచరణలో కష్టమే, అందుకే  ఆగండి..., అర నిమిషం ఆలోచించండి...., మీకు ఆనందమైతే  ఆచరించండి..... 

Tuesday, March 19, 2013

నా 'నీ'రు ఇచ్చెదెవరు....


                                                  నారు పోసేవాడు పోయడా నీరు ?
                                  అలాగైతే మరెందుకు మన నీరు - మీరు 
                                    బావి బోరులలో నిండుకున్నది నీరు... 
                                   జన జీవనావలికి అండనున్నదెవరు ... 
                                 అడగకుండానే అమృతం అందించగలరు ... 
                                  కానీ అడిగిన అప్పుగానైన ఇవ్వరు నీరు... 

                               దిక్కు దిక్కున ఉన్న నీటి చుక్క చుక్కను
                       నిలకడ చేసి నిరంతరం కొరత కోరలను కట్టడి చేయండి ... 
                              లేకపోతే ముందున్నది బహు నీటి కొరత.... 
                                అప్పుడు పెట్టక తప్పుడు నీటికి కొలత... 
                            అలాగైతే జన జీవన చక్రం పడక తప్పదు బోల్తా..... 

                         చేయి చేయి కలిపి నడుమ కట్టాలి మనమంతా .... 
                   చినుకు చినుకుతో చెలిమి చేసి కలిమి కావలి చేరువులంత..
           నీరు కారిపోవాలి నీ నా బలహీనత, నీరు నిలబెట్టాలి నీ చేయూత 
                               ఇక కొరత చింతలు ఉండవు మీ చెంత...... 

(గమనిక: నీరు- మీరు అనేది ఒకప్పటికి ప్రభుత్వ పధకం,)






Monday, February 11, 2013

ప్రేమంటే....

ప్రేమంటే...ఒక మాటలోనో ఒక పాటలోనో అలాగే ఒక పూటలోను, ఒక పుటలోను చెప్పలేమని తెలిసిన ప్రేమను  పుటలోను రాయడానికి ప్రయత్నం చేశాను...

ప్రేమంటే ప్రేమించిన వారి చుట్టూ ప్రదర్శన చేయడం కాదు,
పరవశంతో పదునైన పదాలతో కవితలు రాయడం కాదు,
ప్రేమంటే పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకోవడం కాదు,
అది విఫలమైతే పురుగల మందు తాగి జీవితాన్ని ముగించడం కాదు....
అసలు ప్రేమంటే....
"ప్రేమంటే ప్రేమించిన వారికి స్వేచ్చని ఇవ్వాలి.....
కొన్ని సార్లు చెడు స్నేహలనుండి వారిని బంధించాలి....
వారికోసం  త్యాగంతో కొన్ని వదులుకోవాలి...
వారికోసం కష్టపడి కొన్ని సాధించాలి..
ఆపదలో వారి కోసం ఆసరాగా నిలబడాలి....
అపవాదులతో హేళనపాలైతే వారి కోసం కలబడాలి...
ప్రేమించిన వారిపైన శ్రద్ధ చూపాలి...
ప్రేమించిన వారికి సమయాన్ని కేటాయించాలి...
ఇంకో ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమంటే ఒక పవిత్ర ప్రమాణం...
ఆ పవిత్ర ప్రమాణం ఉంటె జీవితం ఒక సంతోష ప్రయాణం...."






Monday, January 7, 2013

పురుషోత్తమలకు ఒక మనవి....

గోరుముద్దలు పెట్టి గోరింతవాడిని కొండంత వాడిని చేసిది ఒక ఇంతియే...
 బుడి బుడి అడుగులు నుండి వడివడిగా అడుగులు నేర్పేది ఒక వనితనే....   
అక్షరాల నేర్చిన నుండి అత్యున్నత స్తాయి చేరే వరకు మన వెనుక అమ్మలా                                                                                           ఉండేది ఒక అబలనే.....
నిరంతర నిర్విరామ పనులతో నిదురలేక అలసినప్పుడు తన చల్లని ఒడిలో నిద్రపుచ్చేది                                                                             ఒక నారిమణి నే...
ఆనందంతో తన అక్కున చేరుచుకొని మనల్ని ఆనందతీరాలకు చేర్చేది ఒక అపురూప ఆడదినే...
అనారోగ్యంతో అడుగు కూడా వేయలేనప్పుడు అహర్నిశలు మనకు సేవచేసేది ఒక స్త్రీ మూర్తినే...
ఇలా మగవాడి ప్రతీ ప్రగతి లోను ప్రక్కనుండేది ఒక పడతియే...                                               కష్ట కడలి లో కంటికి కనురెప్పలా  కాపాడేది ఒక కాంతామణియే...
అలాంటి స్త్రీ జాతి పైన పురుషోత్తమల  దారుణ అసాంఘిక చర్యలు....                                          అలాంటి ఆడ జాతి పైన అమానుష అత్యాచార ఘటనలు....                                           అలాంటి కన్నతల్లుల మీద ఈ కీరాతకమైన కీచక రాచ క్రీడలు...                                         ఇటువంటి మగ జాతిలో పుట్టినందుకు..మధనపడుతూ...
మగసిరితో మురిసిపోతున్న మృగ మహారాజులకు నా మనవి              

         " బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తలచుకో.....                                                                             నవ సమాజపు నది ఒడ్డున ముద్దు బిడ్డలా నిల్చున్న నేడు తలచుకో....                               అది గొడ్డు కాదు ఆడదని నిజం ఇప్పటికైనా తెలుసుకో...." 

మృగాల వలె  కాకా మనుషులవాలే జీవిస్తూ..... మగసిరితో కాకా మానవత్వంతో ముందుకు సాగుతూ, ఇకనుండి అయిన స్త్రీ జాతి సమస్తం కిరాతుకల కబంద హస్తాలలో అస్తమయం కాకుండా పాటుపడదాం. నవ స్త్రీ జాతిలో ధైర్యాన్ని నింపుదాం ..మన భారత దేశ గౌరవాన్ని కాపడుకొందాం ....

   



Monday, December 31, 2012

లక్ష్యం...



అనుష్కనే  లక్ష్యంగా చూసుకొని 'లక్ష్యం' సినిమా చూసి వచ్చాక అలోచించా నా జీవిత లక్ష్యమేంటి అని...?. ఏమో ఏమీ అర్ధం కాలేదు. అలగే డ్యాన్సులను లక్ష్యంగా చేసుకొని ఒక స్తాయికి చేరుకున్న చిరంజీవి గారు  ఇంటర్వ్యూ లో తన జీవితంలో 'ఖైది' సినిమా ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్పినప్పుడు అప్పుడు ఆలోచించ నా జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటి అని...?. కానీ నాకు దీనికి సమాధానం దొరకలేదు. వింతగా ఉంది ఇంతవరకు నా దశను దిశను మార్చే 'లక్ష్యం' ఇంతవరకు లేదు అలాగే  అంతటి విజయం కూడా లేదు. ఇప్పటికైనా నా జీవితంలో నేను ఎటువంటి లక్ష్యాలతో ముందుకు సాగాలని  సారమే ఈ బ్లాగ్. అయితే ముందుగా నా గతించిన జీవితం వెనిక్కి చుస్తే...

నేను పదవ తరగతి వరకు కూడా ఉన్నత మైన లక్ష్యాలు లేకపోయినా, సాధారణ పరీక్షలయిన పోటి పరీక్షలయిన ఒక ప్రణాళికతో చదివే వాడిని. అందుకే నేను పదివ తరగతి వరకు మంచి ఆత్మ విశ్వాసంతో ఉండేవాడిని. కానీ నా వయసు పెరుగుతున్న కొద్ది చదువు తగ్గింది అలానే నాలోని ఆత్మ విశ్వాసం కూడా తగ్గింది. దీనికి కారణం నా అభిరుచులు మారడమే మరియు అలగే చదువు కన్నా ఇతర విషయాలమీద మక్కువ పెరగాడమని అనుకుంటున్నాను. దానీ వలన నాలోన నాకు తెలియకుండానే లేని పోనీ భయాలు కూడా పెరిగాయి. సరే ఇలాంటి భయాలు మధ్య నేను బి. టెక్ పూర్తి చయగానే, నాకు అనుకోకుండా ఉద్యోగం వచ్చింది.  
అప్పుడు కూడా నేను దేవుడు కరుణించాడని అలాగే అదృష్టం కొద్ది ఈ ఉద్యోగం నన్ను వరించింది అని అనుకున్నాను కానీ నేను ఎదో సాధించనని అనుభూతి కలగా లేదు. నాకు ఉద్యోగం వచ్చి నేను పదవ యేట అడుగుపెట్టిన తరువాత పని చేసేది కొద్ది పరాకు, అలాగే జీవించే కొద్ది చిరాకు వచ్చింది తప్పే ఎదో సాధించాన అనుభూతి మాత్రం కలగలేదు. అసలు.. " నేను నిజమైన కలలు కనలేదా...? లేక కలల్ని నిజం చేసుకొనే ప్రయత్నం చేయలేదా...? 

నా హృదయం ఒక కోర్టు అనుకొంటే, నా అంతరాత్మే న్యాయమూర్తి  అయితే, నా లక్ష్యం లాయరుగా వాదిస్తే నా శరీరం మొదట ముద్దాయి అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే నా శరీరానికి అలసత్వం అలవాటుగా చేసుకుంది.  అందుకే ఆలోచనలలో ఉన్న ఆవేశం ఆచరణలో లేదు. ప్రణాళిక రచనలో పక్కగా పద్ధతి అనుసరించే వాడిని, కానీ ఆ పని మొదలు పెట్టాక పక్క మీద పవళించి ప్రక్క తోవలో వెళ్ళిపోవడం నా జీవితంలో సహజం అయిపొయింది.ఏ మంచి అలవాటు కూడా ఈ అలసత్వంనే అలవాటును నెగ్గలేకపోయింది. ఇలా ఆలోచిస్తే నేను ఎక్కడో చదివిన మాట గుర్తుకు వస్తుంది. " వసంతం వెళ్లి గ్రీష్మం వచ్చింది, గ్రీష్మం వెళ్లి శిశిరం వచ్చింది. కానీ నేను పాడాలనుకున్న పాట మాత్రం ఇంకా అలాగే ఉంది పోయింది - నా రోజులన్నీ నా వాయిద్యాన్ని శృతి చేయటంలోనే అయిపోతున్నాయి. ఇలా నా కాలాన్నివృధా చేస్తు గడిపాను. దీనికి కారణం నేను గమ్యాన్ని ప్రేమించినంతగా ఆ గమ్యాన్ని చేరుకోవడానికి గల గమనాన్ని ప్రేమించలేదు అనడం సబబు అనిపిస్తుంది.  నేను ఇలా ఆలోచించ బట్టే ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉంది, అలానే ఏదో సాధించామన్న అనుభవం కానీ, అనుభూతి కానీ పొందలేకపోయాను. 


ఈ నూతన సంవత్సర సందర్భంగా ఒక నూతనంగా అలోచించి ఒక నూతన నిర్ణయం (లక్ష్యం)  తీసోకొందామని ఆలోచనతో ఈ బ్లాగ్ రాయడానికి ముఖ్య ఉద్దేశ్యం . సిమెంటు లేని గోడ సింద్ధాంతాలు లేని మనిషి ఎంతో కాలం నిలబడవు. ప్రతి మనిషికి కొన్ని సింద్ధాంతాలు ఉంటేనే జీవితంలో ఆటు పోటులలో తడబడక ముందుకు సాగాగలం. అందుకే నిర్దిష్టమైన సింద్ధాంతాలు (నియమాలు) కలిగి ఉంటూ.., నాలో నిరుపయోగం ఉన్న అలవాటులు  ఇంకా మంచి అలవాటులతో నన్ను నేను మార్చు కుంటూ ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకొన్నాను.  ఎందుకంటే ముల్లుని ముల్లుతోనే తీయాలి కాబట్టి  నాలోని అలసత్వం లాంటి అలవాటులను నన్ను నుతనపరిచే మరియు నన్ను ఉత్సాహపరిచే అలవాటులతో  మార్చుకొని ముందుకు వెళదామనుకున్నాను. చివిరిగా ఒక సామెతతో ముగిస్తా ..." ఒక ఆలోచన నాటు నాటు ఒక చర్యను పొందు, ఒక చర్యను నాటు ఒక అలవాటును పొందు, ఒక అలవాటును నాటు, ఒక పరివర్తన పొందు, ఒక పరివర్తన నాటు ఒక లక్ష్యాన్ని పొందు...". అందుకే ఈ నూతన సంవత్సరంలో నా లక్ష్యం "నన్ను నేను మార్చుకుంటూ, నన్ను నేను గెలుచుకొంటు, సంతోషంతో సంతృప్తిగా జీవించాలని  అనుకున్నాను. చివిరిగా ఈ నూతన సంవత్సరంలో  నా లక్ష్యం నన్ను నేనే ఓడించుకోవాలి అలాగే నన్ను నేనే గెలుచుకోవాలి
WISH YOU A HAPPY NEW YEAR....

Wednesday, November 14, 2012

ఎందుకీ ఈ ఆరాటం...


అన్నం లేక ఆకలితో అలమటిస్తున్నారు....
నీరు నీడ లేక నిరాశ్రయలవుతున్నారు....
పట్టా పట్టుకొని పొట్టకోసం పట్నం వెళ్లి 
ఫలించక రైలు పట్టాల మీద తల పెడుతున్నారు....
ఆ మాటకొస్తే...మనీకే మకుటం లాంటి మహారాజులున్నారు...
మెదడుకే మరుపెరగని జిజ్ఞానులున్నారు...
మంచిని, మానవత్వాలను మనుషులకు చాటిచెప్పిన వారున్నారు...
అయిన ఎందుకీ ఈ దారిద్ర్యం...ఎందుకీ దారుణ మరణాలు...
డబ్బుకోసం, శాంతి అన్న గాంధిజీ గుండెకే గాయం చేస్తున్నారు...
కులమతాలు లేవన్న అంబేద్కర్ ఆశయానికే ఆటంకం కలిగిస్తున్నారు...
మనవ సేవ మాదవ సేవ అని అన్న మదర్ తెరిసాకే మచ్చగా                                             నిలుస్తున్నారు...
అయినా...! డబ్బుకోసం ఎందుకీ ఈ మనిషికి ఆరాటం...?
ఎందుకీ తన మనసుతో  ఈ  పోరాటం....?

Thursday, November 1, 2012

నా క'సి రా'ల్చిన 'సిరా'....


ఖ'నిజం' లా దాగున్నది 'నిజం'..
క'నికరం' లో లేకున్నది 'నికరం'...
క'సాయం' తో కలిసిపోయింది 'సాయం'....
మమ'కారం' లో పెరిగిపోతున్నది 'కారం'...
అ'న్యాయం' నకు ఆహుతి అయినది 'న్యాయం'....
రాజకీయ సం'గ్రామం' తో సతమతమగుచున్నది 'గ్రామం'...
కలహాభో'జనం' తో బ్రతుకుచున్నది 'జనం'....
'జగ'డ'ము' తో జంతర్ మంతర్ అయినది 'జగము'....
'మని''షీ'...! మరువాలి 'మని' మరియు 'షీ' లేకపోతే 
ఓ మ'నిషా'..! నీ బ్రతుకులో పెరగక తప్పదు 'నిషా'...
వి'శ్రాంతి' తో మనసు పొందగలదా నిజమైన 'శాంతి' ?...
'యింత' యింత కొండనతైన చివరకు నీ వెనుక వచ్చిన'దెంత'...?
హృ'దయ'ము లో ఉదయంచాలి 'దయ'
స'హాయ'ము తోనే సంపాదించగలం నిజమైన 'హాయి'... 
వి'నయం' తోనే మనసు గల రోగన్ని 'నయం' చేయగలం...
వి'శ్వాస'మే మనిషికి మంచి 'శ్వాస' అయితే...
అప'జయం' పోక తప్పదు, రాక తప్పదు 'జయం'...
సం'సారం'లో యిదే సిసలైన 'సారం'...