Wednesday, September 19, 2012

నా అభి"మతం".....


నేడు మతమత్తులో మనిషి మనుగడ....
కులజాడ్యంపై కుతూహలం....
కుళ్ళు రాజకీయాల స్వార్ధంతో కుమ్ములాటలు యిలా 
మత మంటల్లో ఇంకెన్నాళ్ళు జీవన్మరణ పోరాటం....
ఎందుకీ సగటు మనిషికి ప్రాణసంకటం....
ఎప్పుడొస్తుంది సర్వ సమాన మత సమాజం...
ఇంకెన్నాళ్ళు కావాలి కులరహిత సంఘంలో సంబరానికి...
ఆగండి... ఆలోచించండి.....అభ్యర్దననుకోండి....
మతమంటూ మరవాలి మనిషన్నవాడు....
మమతంతా పంచాలి మనసున్నవాడు....
కలతంతా తీర్చాలి కలిగున్ననాడు...
విడమరచి చెప్పాలి విద్య ఉన్నవాడు....
కులకలహాలను... కలిమిలేమిలను...కుఠిల రాజకీయాలను..
కబళించి కసిరసిని కరుణతో కడిగి ఈ కలియుగంలో 
కలతలు లేని కరుణ యుగంలా కలకాలం 
కన్నలపండుగగా కలిసిపోవాలి.....

Tuesday, September 18, 2012

నేనొక కవితను....

                                       నేనొక కవితను....                                      
తొలకరి మాసంలో వచ్చే చిరుజల్లును....
ఆకాశంలో కనిపించే చక్కని హరివిల్లును....
వసంతంలో కూసే కోకిల మృదు మధురగానంను....
ప్రకృతి పులకరింపుకి పలికే పద్యాన్ని...
మనసులో ఉండే మమతను....
అమ్మలో ఉండే అనురాగాతను....
స్నేహంలో ఉండే సఖ్యతను...
ప్రేమలో ఉండే పరవశంను...
సత్యాన్ని అన్వేషించే శ్రమశక్తిని...
మతోన్మాదాన్ని మంట కలిపే మంచి మల్లెను...
దరిద్రుల దప్పిక తీర్చే ధనిక సంద్రాన్ని ....
భావ ఆవేశాలతో భారతావనికి 
చూపించగల భవితను...కవితను....
నేనొక కవితను.....

Saturday, August 4, 2012

స్నేహం కోసం....

నా అభిప్రాయాలతో ఆకారాలను గీసి, నేను సంతోషంగా ఉన్నప్పుడు నా కళ్ళల్లో మెరిసే పెరుపులతో మెరిగులు దిద్ది  నా పదాలతో ప్రాణాలు పోస్తే...ఖచ్చితంగా పుట్టిన వారు నా మిత్రులలో ఎవరో ఒకరి పోలికలను కలిగి ఉంటాడని అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే "Don't follow any one but learn from every one" అన్నట్టుగా నేను తెలుసుకున్న మంచి విషయాలు లేదా నా లోవున్న మంచి గుణాలు అయిన నా మిత్రుల దగ్గర నుండి ఎక్కువుగా నేర్చుకున్నాను. అందుకేనేమో ఒక మనిషి గురించి తెలిసి కోవాలి అంటే ముందు వాడి మిత్రులగురుంచి తెలుసుకోమంటారు. ఇలా నా జీవితంలో అనేక విషయాలను నేర్పిన ప్రతి మిత్రుడకు, నాకు స్పూర్తిగా నిలిచినా ప్రతి స్నేహితుడకు అంకితమిస్తూ... స్నేహితుల దినోత్సవం సందర్భంగా  రాస్తున్న బ్లాగ్....అయితే నా  స్నేహితులతో ఉన్న అనుభవాన్ని ఈ చిన్న బ్లాగ్ లో రాయడం కష్టం అయిన సముద్రాన్ని మర చెంబులో ఇమిడ్చినట్టు నా అనుభవాన్ని ఈ బ్లాగ్ లో ఇమిడ్చి రాస్తున్న....

నేను చిన్నప్పటి నుండి హాస్టల్ లో చదువుకోవడం వలన నేను ఎక్కువుగా స్నేహితులతో కలిసి ఉండే అవకాసం లభించింది. చిన్నతనంలో తిండికైన, తిరగాడనికైన, చదువుకైన లేదా సాహసానికైనా, ఆటకైన...పాటకైన ఇలా అల్లరిగా చిల్లరిగా చెట్టపట్టాలు వేసుకొని... జట్టు కట్టుకొని సరదాగా గడిపిన రోజులు ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. కానీ ఎంత అల్లరి చిల్లరిగా తిరిగిన ఒకరికోసం ఒకరికి పని చేయడంలో సహాయం చేయడాన్ని, వేచిచూడటం లో ఓర్పుని, చదువులో కొంత నేర్పుని ఇలా మాకు తెలియకుండానే నేర్చుకునన్నాను. నా చిన్నతనంలో నాకు మంచి మిత్రులు ఉండటం వలన, అలాగే వాళ్ళు నా మదిలో మొదట వేసిన స్నేహమనే "విత్తు" నేటికి వృక్షమై..... నా జీవితంలో వినోదభరితం కావడానికి మూలం అయ్యింది. 


ఇక యవ్వనంలోకి వస్తే...ఇవి నా జీవితంలో ఎంతో మధురమైన క్షణాలు ఉన్నాయో అంతే మధనపడ్డ క్షణాలు ఉన్నాయి. ఏదైనా కాలేజి రోజులలో ...అడుగేస్తే నవ్వు.. విజలేస్తే కెవ్వు...అనుకోకుండా ఎదురైనా అమ్మాయిల నవ్వులు...దాని వలన పుట్టిన లవ్వులు...  లవ్వులు గెలవడానికి ఇచ్చిన పువ్వులు... ప్రేమ గెలిస్తే పార్టీలు...ఓడితే వాళ్ళమీద కార్టూన్లు ఇలా ఆద్యంతం ఆనందమే.  ఇక నా విషయానికి వస్తే కాసింత అమాయకత్వం, ఏమి చేయాలో తెలియని అయోమయం, ఎదుట నిలిచే ఆకర్షణలు, దాని వెనుకనున్న అలజడలు, ఏదో అందుకోవాలని ఆలోచన, అడ్డుగా నిలిచినా అవరోధాలు, సన్నగిల్లిన ఆత్మ స్థైర్యం, సర్దుకోలేని ఆర్ధిక ఇబ్బందులు... ఇలా ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా నేను ఓటమి కోరలలో చిక్కుకోలేదు ఎందుకంటే నా మిత్రుల దగ్గరనుండి పొందిన ఆదరణ, వారిచ్చిన ఆత్మ స్థైర్యం, ఆపదలో వెంట నిలిచిన ఆప్తమిత్రులు, వారు చూపిన సన్మార్గం  నన్ను నా జీవితంలో ముందుకు సాగనిచ్చాయి. నా మిత్రులు చేసినది ఒక్క మాటలో చెప్పాలంటే " నేను ఏ పని తలపెట్టిన నా ముందు వెనుక లోటు కనిపించేది, కానీ నా జీవితంలో ఎప్పుడూ...  ఎక్కడా...  లోటు జరగలేదు" అని నేను సంతోషంగా చెప్పగలను.


చివిరిగా నా మిత్రుల గురించి ఒక్క మాట చెప్పాలి. ఇప్పటకి మా అమ్మ నేను కొంత మంది స్నేహితులను కలవడానికి వెళ్తానంటే ఎంతో సంతోషంగా పంపుతుంది. ఎందుకంటే మా అమ్మ నన్ను ఎంత అపురూపంగా, అప్యాయతగా  చూసుకుంటుందో అంత కన్నా నా మిత్ర్హులు బాగా చూసుకుంటారని ఆమె నమ్మకం. పైన నేను చెప్పినట్లు తోబుట్టువులు దగ్గర నుండి పొందని తోడునీడను... , అన్నదమ్మల దగ్గరనుండి పొందని ఆదరణను, నాన్న దగ్గర దొరకని స్వేచ్చను, మా అమ్మ దగ్గర లేని అనురాగాన్ని పొంది ఇలా నా మిత్రుల వలన నేను నా జీవితంలో సమస్యలున్న  సంతోషంగాను, బాధలున్న నిర్భాయంగాను, కలతలున్న కంగారుపడకుండా  నిశ్చంతాగాను నిలకడగా ముందుకు సాగుతున్నాను. అందుకే నా మిత్రుల విషయంలో ఒక బలమైన నిర్ణయం తీసుకోనాను. అది " నాకు నా మిత్రులతో ఏదైనా సమస్య వస్తే, ఆ సమస్యను సరిదిద్దు కోలేనప్పుడు సమస్యనే విడిచిపెడతాను కానీ ఎట్టి పరిస్థితులలోను ఆ మిత్రుడను విడిచి పెట్టను, ఒక వేళ  ఏ మిత్రుడనైన విడిచిపెట్టినట్టయితే  ఇరువరిలో ఎవరో ఒకరు ఈ లోకాన్ని విడిచినట్టే.. ...."

రోజులు గడుస్తున్న నేను నా జీవితంలో సంతోషంగా ఉండటానికి కారణం...మా అందరి హృదయాలు స్నేహమనే సున్నితమైన దారంతో ఎంతో అపురూపంగా కలసిపోయాయి. అందుకే స్నేహమనే దారమే నా జీవితానికి ఆధారం అది లేక పోతే నిరాదరం. ఇలా చెప్పుకుంటే పోతే ఎంతయినా రాయగలం. అయిన అమితమైన ప్రేమున్న మిత్రుల కొరకు మితంగా రాయడం నా వల్ల కాదు గాని, ఇక పైన జీవితంలో కూడా స్నేహాన్ని ఆస్వాదిస్తూ... ఆనందిస్తూ...దానిని నిలబెట్టు కోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ....ఉంటానని సంతోషంగా తెలియచేస్తూ...  స్నేహితులకు మరి స్నేహ ప్రపంచానికి స్నేహితుల దినోత్సవం సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియయచేస్తూ.....
                    " Friendship isn't how to forget but how to forgive
                      Not how you listen, but how you understand
                      Not how you see, but how you feel
                      Not how you let go, but how you hold on! "
                     HAPPY FRIENDSHIP DAY.... 

Thursday, July 5, 2012

సెల్లు ....సొల్లు...

నాకు మొదటి నుండి ఫోన్ అన్నా ఫోనులో మాటాడటం అన్నా మహా సరదా అయితే ఆ కోరిక నాకు ఉద్యోగం వచ్చిన తరువాత తీరింది. కొత్తగా ఉద్యోగం... కొత్త ప్రదేశం... కొత్తవాళ్ల మధ్యలో ఉండడం వలన రోజు సాయింత్రం అయితే చాలు ఇక సెల్ పట్టుకొని కాలక్షేపం కోసమో... మరి కమ్యునికేషన్ కోసమో...తెలియదు కానీ నేను కాస్తా  సెల్ లో ఎక్కువగా మాటాడేవాడిని. చివరికి కస్టమర్ కేర్ నుండి కాల్ వచ్చిన దానిని మిస్సిడ్ కాల్ చూడటమే కానీ ఏనాడూ నేను మాటాడిన పాపాన పోలేదు. ఇది చూసి నా మిత్రులు ఎప్పుడైనా కలిసేటప్పుడు ఈ రోజు "సెల్లు - సొల్లు" ప్రోగ్రాములో ఎంత మందిని టచ్ చేసారు అందులో వింతలూ విశేషాలు మాకు ఒకసారి వివరించండి అని సరదాగా అడిగేవారు...అందుకేనేమో ఈ "సెల్లు-సొల్లు" బ్లాగ్  రాయడానికి కారణం. కానీ కాలం గడుస్తున్నకొద్ది నాకు అనిపించేది నా చుట్టూ జరిగే సంఘటనల  వలన  కావచ్చు నేను సెల్లో మాటాడేటప్పుడు నన్ను జనాలు చూసే విధానమో వలనో కాస్త  నేను కూడా ఈ  సెల్లో మాటలాడటం తగ్గించాను, అయిన ఇంతవరకు దీనిపై నాకున్న  అనుభవాన్ని ఈ  బ్లాగ్ లో పొందిపరచాను.

ముందుగా  సెల్ గురించి చెప్పాలంటే ..... గల్లిలో ఉన్న గడుగ్గాయి చేతిలో చుసిన సెల్లే.... డిల్లీ లో ఉన్న డీసెంట్  బాయ్ చేతిలో చుసిన  సెల్లే... . అత్యాధునిక నగరాలలో తిరిగే అమ్మాయి చేతులలో ఉండేది  సెల్లే......కనీస సదుపాయాలు లేని అరణ్యలలో నివసిస్తున్న ఆడపడుచు చేతిలో ఉండేది  సెల్లే... ...ఆవేశంలో ఎక్కువగా పగలకేట్టేది  సెల్లే... ఆనందం కోసం అందరు ఉపయోగించేది  సెల్లే... సెల్ అనేది ఒకప్పుడు మనిషికి సోకు కానీ నేటి మనిషికి సెల్ అనేది నిత్యావసర సరుకు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే నేడు భారత దేశంలో జనాభా 107 కోట్లు అయితే అందులో సెల్ ఉపయోగించిన వారి సంఖ్య సుమారు 82 కోట్లు అని ఒక టి.వి ప్రోగ్రాంలో చూసాను.  సెల్ వచ్చాక ఎంత దూరంలో ఉన్నావారితో మాట్లాడం చాలా సులభం కావడంతో " ప్రపంచం చాలా చిన్నది అయ్యింది కానీ సెల్ వలన రోజు రోజుకి మనుషుల మధ్య మాత్రం దూరం పెరిగింది"

అసలు సెల్ తెలియక ముందు ఉత్తరాలను ఉపయోగించేవారు. ఉత్తరం అంటే నేను సంఘటన గురించి చెప్పాలి... నేను పదవ తరగతి వరకు గురుకుల పాఠశాలలో చదువుకున్నాను. నేను ఇంటర్ చదువు తున్నప్పుడు పదవ తరగతి మిత్రుడు నాకు ఒక ఉత్తరం రాసాడు. ఆ ఉత్తరం ఒక సరి సారి చదివాక... చదివి ఒకసారి ఆలోచించక... అలోచించి నా గతాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నాక...మా ఆరేళ్ళ స్నేహం  గురించి ఒక అరటావు ఉత్తరంలో చదివాకా నాకు కలిగిన అనుభూతిని మాటలలో మాత్రం చెప్పలేను. ఎప్పుడైనా వాడి మీద కోపం వచ్చినప్పుడు ఆ  ఆ ఉత్తరం చదివితే చాలు ఆ కోపం అర నిమిషంలో పోయేది అలా ఆ ఉత్తరం మా స్నేహం మరింత బలపడటానికి దోహదం చేసింది. మరి సెల్ వచ్చకా ఉత్తరం ఉనికిని కోల్పోయింది కానీ సెల్ అనేది  మనుషల సంతోష సాధనం అయ్యింది కానీ మనిషి జీవితంలో  మధురానుభూతులను మాత్రం నింపలేదు. మరి సెల్ ని మాత్రం ఒకర్ని బాధపెట్టడానికి, భయపెట్టడానికి, బ్లాకు మెయిల్ చేయడానికి ఇలా ఎన్నో అసాంఘిక చర్యలను చేయడానికి సెల్ ఒక గొప్ప సాధనం అయ్యింది కానీ మనషి సంతోషానికి, సమస్యల పరిష్కారానికి, ఉపయోగించడం తక్కువే అని చెప్పాలి. అందుకే నేను కోరుకునేది ఒక్కటే " సెల్ ని వాడండి అవసరాలకే కానీ అనర్ధాల కోసం కాదు... సెల్ ని వాడండి బంధాలు బలపడడానికి  కానీ బాధ పెట్టడానికి కాదు .. సెల్ ని వాడండి అపాయంలో ఉన్నప్పుడు అత్యవసర  సేవలకోసమే కానీ అపాయాలను కలిగించడం కోసం కాదు... "


ఇక సొల్లు గురించి చెప్పాలంటే....భారత దేశంలో వాక్కు స్వాతంత్ర్యం ను ఉపయోగించుకోనేది ఆది నుండి ఆంధ్రులని   చెప్పనవసరం లేదు అలాగే మా మిత్రబృందంలో అయితే నేను మొదటి వాడినే అని చెప్పాలి. ప్రతి మనిషికి తను చెప్పే మాటలు ప్రక్క వాళ్ళు వినాలని, విని వినోదం పొందాలని కోరుకుంటారు. నేను కూడా అలాగే మాట మాటకి పొంతన లేకపోయాన...ఓటమికి వాటం ఇవ్వకుండా పోటిగా మాటడుతుంటాను. దీనివలన ప్రక్కవాల్లికి  వినోదం మాట పక్కన పెడితే విసుగు మాత్రం వస్తుంది. అలాంటిది సెల్ వచ్చాక జేబులు నిల్  అయిన తోటివారు బోర్  ఫీల్ అయిన  ఇంట్లో వాళ్ళు చిరాకు పడిన మాటలకూ మాత్రం దూకుడు తగ్గడం లేదు. చివరికి ఆ మాటలు తగ్గాలంటే నాలుకకు ముల్లు అయిన  గుచ్చాలి లేదా పక్కవడి చెవులకు చిల్లు అయిన పడాలి. నా అనుభవంతో, కానీ నేటి యువతరాన్ని చూసాక  నాకు అనిపించేది ఒకటి " వాగుడు అనేది తాగుడు కన్నా చెడ్డ అలవాటు తాగడం వలన తాగిన వాడికి పిచ్చి వస్తుందేమో కానీ వాగుడు వలన చుట్టూ ఉన్నవాళ్ళకి మాత్రం పిచ్చి వస్తుంది." అలా అని మాట్లాడటం వద్దు అని చెప్పే హక్కు నాకు లేదు కానీ మితంగా మాటాడటం ముద్దు... ఆకర్షించే విధంగా మాటాడటం హద్దు.. కానీ చిరాకు తెప్పించేల మాటాడటం మాత్రం వద్దు. మనం చేసే పనులు మన అదుపులో ఉండాలి అలాగే మనం మాటాడే మాటలు పొదుపుగా ఉండాలి. అందుకే  నేను చివరిగా కోరుకునేది ఒక్కటే మన మాటాడితే......
               నీ మాటతో....ఇటు నిశ్శబ్దం అయిన పోవాలి ...అటు ఓ యుద్ధం అయిన ఆగాలి.
               నీ మాటతో.... ఇటు  సమస్య  అయిన పోవాలి ... అటు సహాయం అయిన పొందాలి  
               నీ మాటతో.... ఇటు  ఆకలి అయిన తీరాలి...  అటు ప్రాణం అయిన పోయాలి.
               నీ మాటతో.... ఇటు  ఆనందం అయిన కలగాలి ....అటు అవమానం అయిన పోవాలి 

Wednesday, May 9, 2012

ఇంకా ఎంత  కాలం.....

ఏదైనా మంచి పని చేయాల్సిన  సమయం వచ్చినప్పుడు నేను దానిని ఎందుకో ఆ  పని చేయకుండా కాలయాపన  చేస్తుంటాను. అప్పుడు  నేను అనుకుంటాను ఇంకా ఎంతకాలం ఇలా కాలయాపన  చేస్తాం. ఉదాహరణకి  నేను నా కళ్ళు దానం చేద్దామని అనుకున్న  అయితే ఇప్పటికి నేను ఆ  పని చేయలేకపోయాను, దీని  గురించి నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు కొంత మంది ఇలాంటి పనులు ఇప్పటినుండే ఎందుకు ఇలాంటివి చేయడానికి ఇంకా  సమయం ఉంది, అందుకే ముందు జీవితాన్ని సంతోషంగా గడపమంటారు. ఏది ఏమైనప్పటకి  ఒక మనిషి ఒక మంచి  పని చేయడానికి  లేదా చేయకపోవడానికి తన  జీవితంలో ఎదురైనా సంఘటనలను బట్టి ఉంటుంది కానీ  పక్కవాడు చెప్పిన  దానిని బట్టి ఉండవు.  ప్రతి మనిషి జీవతంలో ఎదురైనా  కొన్ని సంఘటనలు తనని నిలబెట్టి  ప్రశ్నిస్తాయి,  ఆ సంఘటనలే మనిషిని ప్రభావితం చేస్తాయి, చివరికి  ఆ సంఘటనలే మనిషిలో మార్పుకి నాంది  పలుకుతాయి. అయితే నేను మంచి పనులు చేయాలని అనుకోవడాని నన్ను ప్రభావితం చేసిన  సంఘటనలు  మూడు ఉన్నాయి. 

నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక  సంఘటన  ఇది నేను చదివినదో లేదా ఎవరో చెప్పినదో నాకు గుర్తు లేదు కానీ ఈ  సంఘటన  నన్ను బాగా ఆలోచింపచేసింది. ఒకాయన  నయాగరా జలపాతం నుండి కిందకు ( గుండ్రని టబ్  లోనుండి ) ఒక  రికర్డ్  శృష్టించి, ఒక  రోజు తన  ఇంటి తోటలో కాలు జారి పడిపోవడంతో తన  కాలు విరిగి అనారోగ్యము పాలై చివరికి తన  ప్రాణాలనే విడవ  వలసి వచ్చిందట. రెండవ  సంఘటన  స్వశక్తితో ఆర్దికంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన  సత్యం " రామలింగ  రాజు" గారు ఒకేసారిగా తను  శృష్టించిన  ఆర్ధిక  సామ్రాజ్యం  పేక  మేడల  కూలిపోవడముతో ఇప్పుడు ఎంతో దుర్భరమైన  జీవితాన్ని చూడవలసి వచ్చింది. మూడవదిగా  నేను టెలివిజన్ లో హీరోస్ ప్రాజెక్ట్ ( AIDS Awareness) ఒక  ప్రోగ్రాముని  చూసాను. ఆ  ప్రోగ్రాములో చెన్నై నుండి ఒక  డాక్టర్  తన  దగ్గరికి వచ్చిన  ఒక  రోగి గురించి ఇలా చెప్పారు.

హైదరాబాద్  నుండి తన చెల్లితో వచ్చిన రోగిని పరీక్షించిన తరువాత, తన చెల్లి వచ్చి డాక్టర్ ని అడిగిన మొదటి ప్రశ్న " మా అన్నయ ఇంకా ఎంత కాలం బ్రతుకుతాడు...?". దానికి డాక్టర్ మీ అన్నయ్య ఇంకా ఐదు  సంవత్సరాలు బ్రతకవచ్చు అనగానే అతని చెల్లి ఆత్రుతగా  అయిదేళ్ళు బ్రతుకుతాడా అని మరల అడిగింది. అందుకు డాక్టర్ అవకాశం ఉంటె పదేళ్ళు ఇంకా అదృష్టం ఉంటె ఇంకా ఇరవై సంవత్సరాలు అయినా బ్రతకవచ్చు ఎందుకంటే ఇంతవరకు HIV కి మందు కనుగొనలేదు ఇంకా ఈ అయిదు పది  సంవత్సరాలలో మందు కనక కనుక్కొంటే మీ అన్నయ జీవితకాలం బ్రతికే అవకాశం ఉంటుంది. అది విన్నచెల్లి, అతను ఎంతో సంతోషంగా తిరిగి హైదారాబాద్ బస్సు లో ప్రయాణం అయ్యారు. దురదృష్టం కొద్ది ఆ బస్సు ప్రమాదానికి గురైంది ఆ ప్రమాదంలో HIV సోకినా అన్నయ బ్రతికాడు కానీ ఎంతో ఆరోగ్యవంతురాలైన తన చెల్లి మాత్రం అకాల మరణం చెందింది. ఇలా పై మూడు సంఘటనలలో మొదటివాడు బలవంతుడు రెండవవాడు ధనవంతుడు మూడవవాడు ఆరోగ్యవంతుడు అయినప్పటికీ విధి వక్రించడం వలన వాళ్ళు దేని వలన మనం అతిశాయంచినారో దాని వలెనే వారు నాశనం అయ్యారు అందుకే రేపు మనది కాదు...నేడు సంతోషంగా ఉన్నామా లేదా అన్నది ఆలోచిస్తే చాలు అని అనుకుంటా.... అలాగే ఏదైనా మంచి పని అనుకుంటే దానిని చేస్తే మంచిదని అనుకుంట...

        ఇలాంటి విషయాలు నా మిత్రులతో నేను మాటాడినప్పుడు  రేపే మనం పోతామని వైరాగ్యంతో బ్రతకలేము. మనిషి ఆశ జీవి రేపు ఉందని, ముందు ముందు మంచి జరుగుతాయని ఇంకా ఆనందంగా బ్రతుకుతమనే ఆశతోనే బ్రతకాలి లేకపోతే ఈ ప్రపంచమే లేదు అంటారు. ఆలోచిస్తే ఇదికూడా నిజమనిపిస్తుంది ఒక మనిషి సగటు జీవితంలో చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, ఇలా పిల్లల చదువులు చివరికి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసరికి మనిషి జీవితంలో అరవై సంవత్సరాలు తెలియకుండానే నిండిపోతాయి. అప్పుడు మన జీవితాని ఒక్కసారి వెనిక్కి చూసుకుంటే మన పిల్లలు వచ్చి అడుగుతారు " ఇన్నేళ్ళ జీవితంలో మాకోసం ఏమి సంపాదించారు..?, అలానే మనల్ని నమ్మి జీవితాంతం మనవెనుక నడిచిన భాగస్వామి అడుగుతుంది ఇకనుండి మనం బ్రతకడానికి ఎంత కూడబెట్టారని....? కానీ ఆ రోజు మాత్రం మన అంతరాత్మ అడుగుతుంది " ఇన్నేళ్ళ జీవితంలో ఏమి సాధించావని...?, ఎంత సంతృప్తిని మూట కట్టుకున్నవని..? ఆ రోజు మనం మన అంతరాత్మ ముందు దోషిగా నిలబదకూడదు.. అందుకే నేను అనుకుంటాను "  రేపు ఉందని ఆశతో బ్రతకాలి కాని రేపటికోసం నేటి  సంతోషాన్ని, సంతృప్తి వదులుకొని బ్రతకరాదు."

         ఏదయినా మంచి పని చేయాలంటే మన జీవిత గమ్యాలను చేరుకున్నాక లేదా మన జీవితంలో మంచి స్తాయికి వచ్చాక లేదా మనకున్న బాధ్యతలను నెరవేర్చక చేద్దామని ప్రతివారు చేసే అవకాశం వచ్చినప్పుడు ఇంకోసారి చుద్దములే అని వాయిదా  వేస్తుంటాం  కానీ వాయిదా వేసిన తరువాత అనుకుంటాం అయ్యో ఎంత పని జరిగింది ఈ  పని ముందే చేయాల్సిందని . దీనికి నేను ఒక ఉదాహరణ మీ ముందు ఉంచుతున్నాను. ఒక ఉన్నత ప్రభుత్వ ఉద్యోగి మాతృ దినోత్సవ సందర్భంగా నా తల్లి ఒక పుష్పగుచ్చం కొనడానికి ఒక పూల దుకాణం వద్దకు వచ్చి ఆ పూలవాడితో అధికారి " మాతృ దినోత్సవ సందర్భంగా నా తల్లి ఒక పుష్పగుచ్చం పంపించ దలచుకున్నాను కావున ఒక మంచి, ఒక అందమైన  పుష్పగుచ్చం కావాలి, అది చూడగానే మా అమ్మకి నేను తనని ఎంతగా అభిమానిస్తున్ననో తెలియాలి " అని చెప్పెను. అంతలో ఒక పదిహేనేళ్ళ కుర్రవాడు వచ్చి " అయ్యా నా దగ్గర పది రూపాయలే ఉన్నాయి అందుకు తగ్గ ఒక  పుష్పగుచ్చం ఇమ్మని అడుగగా ఆ పూలవాడు పది రూపాయలకి ఏమి రాదని తిరస్కరించినాడు. అయినప్పటికీ ఆ కుర్రవాడు పూలవాడిని బ్రతిమిలాడటం మొదలుపెట్టాడు. అది చుసిన అధికారి నేను ఆ పిల్లవాడి మొత్తంను  చెల్లిస్తాను తనకి కూడా చిన్న పుష్పగుచ్చం ఇమ్మని చెప్పెను. అది తీసుకొని ఆ కుర్రవాడు ఆనందంగా పరిగెట్టగా అందుకు అధికారి నేను కూడా ఆ మార్గంలో వెళ్తున్నాను నిన్ను కూడా మీ ఇంటి దగ్గర దించి వెళ్తాను అని అంటే ఆ కుర్రవాడు అధికారి కారులో తన ఇంటివైపు వెళ్ళెను. అంత ఆ కుర్రవాడికి తన తల్లిమీద ఉన్న ప్రేమకు అధికారి ముచ్చ్తవేసి కుర్రవాడి తల్లిని చూద్దామని ఇంటికి వెళ్ళెను. అధికారి తన తల్లిని చూసి ఆశ్చర్య  పోయాను ఎందుకంటే ఆ కుర్రవాడి తల్లి చనిపోయి చాలా రోజులు అయ్యింది. ఆ కుర్రవాడు తన తల్లికి అంజలి ఘటించిన తరువాత అధికారితో " అయ్యా నా చిన్నతనంలో నా తల్లి నన్ను ఎంతో అపురూపంగా, ఎంతో అల్లారుముద్దుగా పెంచింది కానీ తనని బాగా చూసుకోవాలని తెలిసే సమయానికి నా తల్లి తనువు చాలించింది. సేవ చేయాలనీ ఉన్న అందరకి ఆ  అవకాశం, అదృష్టం రాదు సార్ " అని విల విల పోయాడు. అది చుసిన అధికారికి ఒక్కసారి ఆలోచించుకొని " తన తల్లిని సంతోషంగా ఉంచాలని మరియు ఉండాలని అనుకుంటున్నాను కానీ    రోజు తను అక్కడ ఎలా ఉందో ఇంతవరకు చూడలేదు, వెంటనే తన ఆఫీసుకి సెలవు పెట్టి తన తెల్లి దగ్గరకి వెళ్ళెను. మనకి అనుకూలమైన సమయం వచ్చే వరకు అవతలవారి అవసరాలు వేచి ఉండవు అందుకే నేను అనుకుంటాను మంచి పని చేయడానికి మంచి రోజు ఎప్పుడని ఆలోచించనవసరం లేదు...మంచి సమయం కోసం ఎదురు చూడనవసరం లేదు...మంచి ముహూర్తం కోసం  వెదకనవసరం లేదు...మంచి పని చేయడానికి మదుపు అవసరంలేదు,  మంది మార్బలం అవసరంలేదు, మంచి చేయాలన్న మంచి మనసుంటే చాలు... ఇంకా లోకంలో మంచి మనసున్న మనుషులు ఉన్నారని నమ్మకంతో ఈ బ్లాగ్ రాస్తున్నా...
          జీవితంలో మనం చేసిన మంచి పనులే ముసలితనంలో మనల్ని మోస్తాయి.. అందుకే వయసు పెరిగే కొద్ది మనకి పెద్దిరకం రావాలి కానీ వృద్ధాప్యం రాకడదు. చివరిగా నేను కోరుకునేది ఒక్కటే ... సమయానుకూలంగా....  సమయస్పూర్తితో... సమస్యల్లో పడకుండా...మనకు సంతృప్తిని మిగిల్చే... నలుగురిని సంతోషపెట్టే మంచి పనుల్ని చేస్తూనే ఉండండి దిన దినం జీవితాన్ని ఆస్వాదిస్తూ....ఆనందిస్తూ...జీవించండి....

Monday, May 7, 2012

అమ్మా నీ సేవా గొప్ప సేవా...

ఒకే ఒక వ్యక్తి... ఆ  వ్యక్తి అంటే ఆనందం, ఆదరణ, ఆత్మీయత, ఆప్యాయత, ఆదర్శం,  ఇలా ఎన్ని చెప్పుకున్న ఇంకా తక్కువే అనిపిస్తుంది. అయిన ఆ ఒక్క  వ్యక్తికే  ఇన్ని రూపాలా, ఆ  వ్యక్తిలో  ఇన్ని భావాలా ఇది నిజ జీవితంలో సాధ్యమేనా...అని ఆలోచిస్తే అది ఒక్కరి వల్లే సాధ్యం ఆ వ్యక్తి ఎవరో కాదు "అమ్మ " ...మరి అలాంటి అమ్మ గురించి ఒక  పూటలోనో, ఒక్క పుట లోనో రాయలేమని తెలిసినప్పటికి, ఇప్పటికే చాలామంది కవులు అమ్మయొక్క  గొప్పతనం   రాసి ఉన్నందున  ఇంకా నేను కొత్తగా ఏమి రాయలేనని తెలిసిన  ఈ  బ్లాగ్  రాయడానికి  కారణం మరొకసారి అమ్మ  ప్రేమని గుర్తుచేద్దామని  ప్రయత్నం మాత్రమే... మహాభారతంలో ఒకచోట  " ఈలోకంలో  ధరిత్రి కన్నా బరువైనది  ఏది అని అడిగితే  దానికి ధర్మరాజు  అమ్మ అని సమాధానం చెబుతాడు." నిజానికి భుమికన్నాభరించే శక్తి  అమ్మకి  మాత్రమే ఉంది. అలాంటి అమ్మ కడుపున పుట్టిననేను  మాతృదినోత్సవం సందర్భంగా  ఆమెకి అంకితమిస్తూ  రాస్తున్నా బ్లాగ్  ఇది....

నవమాసాలు మోసి ఒక బిడ్డకి జన్మనిస్తూ తను పునర్జన్మను పొందినప్పటి నుండి తల్లిగా తన  ప్రయాణం మొదలవుతుంది.  పొత్తిళ్ళలో ఉన్న బిడ్డని చూసి తన  ఒత్తిల్లనే  మరచిపోతుంది. అప్పటిను నుండి ఆ బిడ్డను కంటికి రెప్పవలె  కాపాడతూ  ముందుకు సాగుతుంది. బుడి బుడి నడకలైన, చిలక పపలుకులైన  అన్ని అమ్మ  దగ్గర  నుండే నేర్చుకుంటాం.  ఆకలి వేసినప్పుడు అమ్మ  చేతి గోరుముద్దలైన, అల్లరి చేసినప్పుడు అమ్మ  చేతి  దెబ్బలు కూడా కమ్మగానే  ఉంటాయి. ఇలా బాల్యంలో ఆటపాటలు అమ్మ  ఒడిలోన, మాట  మంచితనం అమ్మ  బడిలోన, ఆనందం మరియు ఆదర్సాలు అమ్మ  గుడిలోన  మనమందరం నేర్చుకున్నవాళ్ళమే. అందుకే నేను అనుకుంటాను "మన అందిరికీ అమ్మే ఆది గురువు...అమ్మ హృదయమే మనకి మొదటి పాటశాల.... "

నేను యవ్వనంలో నాకు మొదట  స్నేహితురాలు మా అమ్మే...నేను పెరుగుతున్న  కొద్ది ఆమె ఇష్టాలను నా మీద  రుద్దలేదు. నా ఇష్టాలను తెలుసుకొని వాటికి ఆమె భావాలను జోడించి నన్ను మంచి మార్గంలో నడిపించింది. నాతో పాటు కుటుంబంలో  పెరుగుతున్న కష్టాలు.. ఆర్దిక  ఇబ్బందులు తనలోనే దాచుకొని నన్ను ఉన్నత  మార్గాలు వైపు నడిపించిది.  నాకు వయసుతో పాటు పెరుగిన  కోపం, కొంటెతనం ఇలా ఆమెను నేను ఇబ్బంది పెట్టిన, తనకు కోపం తెప్పించిన ఆ కోపం తన కళ్ళలోనే చూసాను కానీ ఎప్పుడు ఆ కోపం  ఆమె పెదవి మీద  చూడలేదు. ఇలా ఆమె నోటి మాట  ఎప్పుడు నా మేలే  కోరేది, ఆమె మనసు ఎప్పుడు నా సంతోషాన్నే కోరేది, ఆమె చూపు ఎప్పుడు నా జీవితానికి ముందు  చూపులాగే  సాగింది. మా అమ్మని చుస్తే ఎప్పుడు ఒకటి అనిపిస్తుంది " నా సంతోషం కోసం దుఖాలను, బాధలను  తను దిగ మింగుతూనే ...నా కళ్ళల్లో  సంతోషం చూసి మాత్రం పొంగిపోయేది..." 

నేను చదువుకున్న  సమయంలో సెలవులలో నా మిత్రులు  ఇంటికి వెళ్ళేవాడిని.   అందుకే నాకు నా మిత్రులతో  పాటు  వాళ్ళ కుటుంబ సబ్యులతోను పరిచయం  కూడా ఉండేది.  ఇలా వాళ్ళో ఇంట్లో కూడా నన్ను కుటుంబ సబ్యుడి వలె ఏంతో ఆప్యాయతను,  అనురాగాన్ని పొందాను.  వాళ్ళు  కూడా నా కులాన్ని బట్టో లేదా  మానవత్వంతోనో  నన్ను సాకలేదు. నేను కూడా వాళ్ళ  పిల్లల్లో నన్ను ఒకడిగానే  చూసారు. అందుకే " మతం కన్నా  మానవత్వం గొప్పది... మానవత్వం కన్నా  మాతృత్వం గొప్పది..." అంటారు. దీనికి  గొప్ప నిదర్శనం మదర్ తెరిసా, తన మాతృత్వంతో అనేక దీన జనులకు  సేవ చేయగలిగింది. 

ఇలా అమ్మదనంలో కమ్మదనం గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. మరి అలాంటి అమ్మకు నేటి సమాజంలో  స్థానం ఎక్కడుంది..., మనం బుడి బుడి నడకలు నేర్చుకోవడానికి చేయుతనిచ్చిన  చేతికి చేయూత  ఎక్కడుంది..., మనకు  చిలక పలుకులు  నేర్పిన  ప్రేమమూర్తికి చక్కగా పలకరింపు  ఎక్కడుంది..., పాల  ముద్దలు పెట్టి పెంచిన  పవిత్ర మూర్తికి పిడికెడు మెతుకులు పెట్టెవాడు ఎక్కడున్నాడు... ఇంతకన్నా బాధకరమైన విషయం ఏమిటంటే అన్నదమ్ములు  విడిపోయనప్పుడు " ఆప్పులునైన భరిస్తున్నారు కానీ ముసలి తనంలో అమ్మని  భరించ  లేకపొతున్నారు " అందుకే  రోజురోజుకి వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. ఇలా చేసిన  ఇంకా మనం సంతోషంగా  వున్నామంటే అమ్మ  యొక్క అపూర్వమైన   ప్రేమ  చివరివరకు తనే బాధ పడుతుంది కానీ మనం బాధ  పడాలని కోరుకోదు.  అందుకేనేమో " భుమికన్నాభరించే శక్తి  అమ్మకి మాత్రమే ఉంది.." ఈ  సందర్భంగా నేను ఇంకొక  విషయం  చెప్పదలచు   కొన్నును  " ప్రతి స్త్రీ లోను మాతృత్వం ఉందని గమనించ  కలిగినప్పుడు ఈ  సమాజంలో స్త్రీలపై  ఎలాంటి ఆవాంచినీయ  సంఘటనలు జరగవు. అందుకే అమ్మని ప్రేమించండి...స్త్రీలను గౌరవించండి... మన  భారతీయ  విలువలను  కాపాడండి...
అమ్మని గౌరవించిన  వాళ్ళందరూ ఈ   బ్లాగ్  రాయడానికి నాకు స్పూర్తి ప్రదాతలే...అనుకోని కారణాల  వల్ల  ఒకవేళ    ఎవరైనా తన  తల్లికి దూరంగా ఉన్నట్టు అయితే వారి కోపతాపాలను, తప్పు ఒప్పులను  పక్కని పెట్టి  ఈ  మాతృదినోత్సవం  సందర్భంగా వారు కలిస్తే అంతకన్నా కావాల్సింది ఇంకేమి ఉంటుంది...ఇలాంటివి ఉహాకి బాగానే ఉంటుంది కానీ నిజ  జీవితంలో కష్టమే అయిన  ఏదో ఆశతో ఈ  బ్లాగ్ పోస్ట్  చేస్తున్నాను.  







Wednesday, April 25, 2012

నా కుటుంబం...

నేను ఉన్నత కుటుంబంలో పుట్టలేదు కానీ ఉమ్మడి కుటుంబంలో పెరిగాను. సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు అందరం ఎంతో ఆనందంగా గడిపేవాళ్ళం. అప్పుడు నేను చుసిన ప్రేమ అభిమానాలు, ఆ  అప్యాయతలు నేను పెరుగుతున్న కొద్ది వాళ్ళ దగ్గర నుండి పొందలేకపోయాను. నేను కూడా ఆలోచిస్తే ప్రేమ అభిమానాలు,ఆ అప్యాయతలు  సరిగ్గా వాళ్ళకి పంచలేక పోయాను అనిపిస్తుంది. మరి ఈ మార్పు ఎక్కడ నాలో వచ్చింది ఒక వేళ వస్తే అది ఎక్కడ మొదలయ్యింది. అసలు ఎందుకు మారాల్సి వచ్చింది అని ఆలోచించడం మొదలు పెట్టాను. ప్రపంచంలో పరిస్థితులు మనో వేగంగా కన్నా వేగంగా మారుతున్నాయి. అందుకేనేమో తరతరానికి మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. ఇంతకి కుటుంబం అంటే ఎలా వుండాలి అని నేను ఆలోచిస్తున్న సమయంలో విపులలో ఒక కధ నన్ను ఎంతో ఆకట్టుకుంది. ఆ కధ చదివిన తరువాత నా మనసులో ఒక తెలియని సంతోషం ఒక గొప్ప అనుభూతిని నింపింది. ఆ కధా రచయతికి నా పాదాభి వందనాలు తెలుపుకుంటూ నా మాటలలో ఆ కధను మీ ముందు ఉంచుతున్నాను. ఇంతకి ఆ కధ పేరు " కన్నీళ్లు కావాలి..."

అమెరికా దేశంలో న్యూయార్క్ నగరంలో దేశవిదేశ శాస్త్రవేత్తలందరూ ఒక చర్చా వేదికలో పాల్గొన్నారు. ఆ వేదిక సారంశం " కన్నీళ్ళు తయారుచేయడం ఎలా...?". దీని నిమిత్తం ముందుగా అమెరికా శాస్త్రవేత్త నిలబడి " అయ్యా మనిషి కళ్ళ నుండి రోజురోజికి కన్నీలు రావడం తగ్గుతున్నాయి. ఇలానే కనక కొంతకాలం కొనసాగితే మనిషి కళ్ళనుండి పూర్తిగా కన్నీళ్ళు రావడం జరగదు. కన్నీళ్లు మనిషి యొక్క కళ్ళు అంతర్భాగాలను పరిశుభ్రం చేస్తుంది. కానీ ఇలా కన్నీళ్లు తరగడం వలన  మనిషికి కంటి సంబందమైన వ్యాధులతో బాధపడవలసి వస్తుంది  అలానే చివిరికి మనిషి చూపుకూడా మందగించ వచ్చును. కావున  ఇక్కడకు విచ్చేసిన  వారందరూ కన్నీళ్లు తాయారు చేయడంలో వారియొక్క సూచనలను సలహాలను తెలియచేయమని" చెబుతూ ముగించాడు. తరువాత  జపాన్  శాస్త్రవేత్త లేచి " అసలు కన్నీళ్లు తయారుచేయాలి అంటే ముందు కన్నీళ్ళో కళ్ళను శుద్ధి చేసే ఏ ఏ   రసాయనాలు ఏమున్నాయో తెలుసుకోవాలి కాబట్టి ముందు మనిషి కన్నీళ్లను పరీక్షించాలి. ఇలా ఒక్కో దేశపు శాస్త్రవేత్త తమ తమ సూచనలను తెలియజేస్తున్నారు. చివిరిగా మన భారత దేశ  శాస్త్రవేత్త లేచి అసలు మనిషికి కన్నీళ్లు మనసులోని సంతోషం, బాధలాంటి  భావోద్వేగాలను బట్టి జనిస్తాయి. కానీ మనిషి నేడు అలాంటి భావోద్వేగాలకు లేకుండా యాంత్రికమైన జీవితం జీవిస్తున్నాడు. రోజురోజుకి మనిషికి పెరుగుతున్న పని ఒత్తిడి, సంపాదన మీద  అధిక వ్యామోహం, మితి మీరిన స్వార్ధం వలన  మనిషి యాంత్రికమైన జీవితం సాగిస్తున్నాడు. రేపటి తరాలు కోసం పది రూపాయలు సంపాదించడం ప్రయాసపడుతున్నాడు కానీ వారితో పది నిమిషాలు గడపలేకపోతున్నాడు. పిల్లల సంతోషం కోసం వేలకి వేలు వెచ్చెంచితున్నారు కానీ ఆ పిల్లలతో సంతోషంగా గడపడానికి సమయాన్ని మాత్రం వెచ్చించ లేకపొతున్నారు. అందుకే నేడు కుటుంబ సంబంధాలు కూడా వ్యాపార ధోరణిలోనే నడుస్తున్నాయి. డబ్బుతో అన్ని కొనగలం కానీ అప్యాయతలు, అనురాగాలు వాటితోనే కలిగే సంతోషాలు, బాధలను కొనలేం..అలాగే సహజ సిద్ధంగా జనించే కన్నీళ్లు కూడా మనం కొనలేం. మరి ఇక కన్నీళ్ళు రావాలంటే మనం చేయాల్సింది ప్రయోగాలూ కాదు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రేమించాలి. అలాంటి ప్రేమను పంచె ఒక గ్రామం మా దేశంలో ఉంది దానిని సందర్శించమని చెప్పి ముగించాడు.

భారత శాస్త్రవేత్త కోరిక మేరకు ఒక బృందం మన దేశంలో ఆ   గ్రామాన్ని విచ్చేసారు. వారు ఆ గ్రామంలో జరిగే ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ పెళ్ళిలో పచ్చని గడపలు, మామిడాకుల తోరణాలు, కళకళలాడే కళ్యాణ మందిరాలు, మంగళ వాయిద్యాలు, పడుచుపిల్లల పక్క చూపులు, చిన్న పిల్లల కేరింతలు, వధూవరుల సిగ్గులు స్వప్నాలు, పెద్దల దీవనలు, విందులు, వియ్యాల వారి వినోదాలు, ఇలా ఎదుర్కోల పన్నీరు నుండి అప్పగింతలలో కన్నీరు మద్య జరిగే ఎన్నో అప్రుర్వమైన, అద్భుతమైన  పెళ్లిని తిలకించి ఆ బృందం ఒక గొప్ప ఆనందం కూడిన అనుభూతిని పొందారు. అంత వివహ వేడుకలో కూడా జరిగిన పొరపాట్లుకు కూడా ఒకరికొకరు చేసుకునే సమర్ధింపులు, సర్దుబాటులతో కూడిన సరిదిద్దుబాటులు ఇలా అనుకున్నట్టు జరగన్నపుడు వచ్చే బాధ, తరువాత వాళ్ళని సంతోషపరచాడిని పడే ప్రయాస..ఇలా ఎన్నో భావోద్వాగాలతో జరిగే వివాహం శాస్త్రవేత్తల బృందానికి ఒక సంతృప్తిని మిగిల్చింది. అలా  శాస్త్రవేత్తల బృందానికి ఆ గ్రామాన్ని విడిచి వెళ్ళినప్పుడు గ్రామస్తులు యిచ్చిన వీడ్కోలు దుఖః సాగరంలో సాగింది..

ఇది కధా...ఈ కధ చదివాకా నాకు తెలిసింది మనం నేడు ఆప్యాయతలు అవసరం కొద్ది ప్రదర్శిస్తున్నారు, మమకారం మాటలలోనే చూపిస్తున్నారు, మరి ప్రేమలు తమ .  పని ముగించే వరకే కురిపిస్తారు. సర్దుకు బ్రతకల్సింది పోయి అన్నిముందే  సర్దుకుని బ్రతుకుతున్నారు.మరి సమాజంలో ఇలాంటి మార్పులను  మనం నేడు ప్రపంచీకరణ అని కొత్తగా పిలుచుకున్న, సమాజంలో స్థానం  కోసం ఇలా చేసినవాడిని మనం మంచి నేర్పరిగా చెప్పుకున్న అది చివిరికి  మనిషి వినాసనం వైపు మాత్రమే పయనిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో మనిషి జీవన పరిస్థుతులు కన్నా మనిషి యొక్క మానసికస్థితి ఇంకా వేగంగా మార్పు చెందుతుంది. అభివృద్ధి కోసం మార్పు అనేది మనిషి యొక్క జీవన పరిస్థుతులలో అవసరం కానీ అది మనిషి యొక్క మానసిక స్థితిలోను, మనవ సంబందాలలోను మార్పు అవసరం లేదు. అందుకే మనిషి సంతోషంగా ఉండడానికి నూతన ప్రయోగాలూ చేయనవసరం లేదు, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్నిస్వార్ధం లేకుండా  ప్రేమిస్తే చాలు... అంటే మన కుటుంబ సబ్యులు పట్ల మనం ప్రేమతో మెలిగితే చాలు...ఏదైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మన ఇంటివారిని సంతోషపరిచిన తరువాత సమాజ శ్రేయస్సుకి అడుగులు వేయాలి...